close

కరీబియన్‌ దీవుల్లో... అమ్మాయిల ఢీ20 


నేటి నుంచి టీ20 ప్రపంచకప్‌ 
తొలి మ్యాచ్‌లో కివీస్‌తో భారత్‌ ఢీ 
స్టార్‌స్పోర్ట్స్‌లో రాత్రి.8.30 నుంచి 
ప్రొవిడెన్స్‌ (గయానా) 


ఎంతసేపూ అబ్బాయిల క్రికెట్‌ టోర్నీలేనా! ఓ చిన్న మార్పు..! అమ్మాయిలు ఆడబోతున్నారు.. పురుషులేనా మేమూ కొడతాం సిక్సులు అంటూ ముందుకొస్తున్నారు.. ఎందుకంటే అమ్మాయిల పండగొచ్చింది..! మెరుపులు మెరిపించేందుకు వారికీ ఓ అవకాశం చిక్కింది.. నేటి నుంచే ప్రపంచ టీ20 టోర్నమెంట్‌! వెస్టిండీస్‌ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో భారత్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతోంది. 10 దేశాలు పోటీపడుతున్న ఈ సమరం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.

హిళల ప్రపంచ టీ20 టోర్నీకి వేళైంది.. కరీబియన్‌ దీవుల వేదికగా అమ్మాయిలు సమరానికి సై అంటున్నారు. టోర్నీ తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత్‌ జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే వన్డేలతో పోలిస్తే టీ20ల్లో టీమ్‌ఇండియాకు ఏమంత గొప్ప రికార్డు లేదు. అందులోనూ టీ20 ప్రపంచకప్‌ భారత్‌కు అచ్చిరాలేదు. ఇప్పటిదాకా ఐదుసార్లు ఈ కప్‌లో ఆడిన మన జట్టుకు రిక్తహస్తమే మిగిలింది. 2009, 10 టోర్నీలో సెమీఫైనల్‌ చేరడమే టీమ్‌ఇండియాకు ఉత్తమ ఫలితాలు. అయితే ఇటీవల ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ ఈ కప్‌లో ఫేవరెట్ల జాబితాలో నిలుస్తుంది. శ్రీలంకను ఓడించి.. సొంతగడ్డపై ఆస్ట్రేలియా-ఎపై గెలిచి మంచి ఊపు మీదుంది భారత్‌. ప్రపంచ టీ20 టోర్నీ వార్మప్‌ పోటీల్లో బలమైన వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌లపై గెలవడం టీమ్‌ఇండియా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ భారత్‌ మునుపటికంటే మెరుగైంది. లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌తో పాటు వెటరన్‌ జులన్‌ గోస్వామి రాణించడం జట్టుకు కీలకం. అయితే సుజె బేట్స్‌, సోఫి డివైజ్‌ లాంటి బ్యాటర్లతో కూడిన కివీస్‌ను ఓడించడం భారత్‌కు అంత సులభమేం కాదు. మొత్తం మీద పోటీ హోరాహోరీ సాగే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌ తర్వాత భారత్‌ ఈనెల 11న పాకిస్థాన్‌తో, 15న ఐర్లాండ్‌తో, 17న మూడుసార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో తలపడనుంది.

                                                                              

మెరుపు తారలు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన.. భారత మహిళల క్రికెట్లో వీళ్లిద్దరూ సంచలనం. మెరుపు వేగంతో ఆడుతూ అందరి దృష్టిని ఆకట్టుకున్న హర్మన్‌, స్మృతి.. మరోసారి తమ జోరు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మంధాన, రోడ్రిగ్స్‌ అదిరే ఫామ్‌లో ఉన్నారు. శ్రీలంక, ఆసీస్‌పై ఆమె అద్భుతంగా రాణించింది. ఆరంభంలో ఆమె చెలరేగి మధ్యలో హర్మన్‌ అందుకే భారత్‌కు మంచి స్కోరు ఖాయం. వీళ్లిద్దరికి తోడు వెటరన్‌ మిథాలీ రాజ్‌ మీద భారత్‌ ఆధారపడుతోంది. ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత ఆమెదే.

 

10 జట్లు, 2 గ్రూపులు

 టోర్నీలో ఆడే జట్లను గ్రూప్‌ ఏ, బి అని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ఐదు జట్లు ఉంటాయి. గ్రూపులో ఒక్క జట్టు మిగిలిన అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. లీగ్‌ మ్యాచ్‌ల్లో టాప్‌ నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో తలపడతాయి. గ్రూప్‌-ఏలో బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌ ఉంటే.. గ్రూప్‌-బిలో భారత్‌, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ ఉన్నాయి.

మనవాళ్లు ఇద్దరు

భారత జట్టులో ఇద్దరు తెలంగాణ క్రీడాకారిణులు ఉన్నారు. ఒకరు వెటరన్‌ మిథాలీరాజ్‌ అయితే మరొకరు అరుంధతిరెడ్డి. ఈ తెలుగమ్మాయి తొలిసారి ప్రపంచ టీ20 టోర్నీలో ఆడే అవకాశాన్ని సంపాదించింది. ఇటీవల శ్రీలంకతో సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన అరుంధతి.. ప్రపంచకప్‌లో సత్తా చాటాలని కోరుకుంటోంది.

భారత బృందమిదే

ర్మన్‌ప్రీత్‌కౌర్‌ (కెప్టెన్‌), మిథాలీరాజ్‌, స్మృతి మంథాన, ఏక్తా బిస్త్‌, హేమలత, మాన్సి జోషి, వేద కృష్ణమూర్తి, అనుజ పాటిల్‌, అరుంధతి రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్‌, దీప్తిశర్మ, పూజ వస్త్రకర్‌, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌
‘‘ఆసియాకప్‌లో ఓడిన తర్వాత భారత్‌ తప్పులు దిద్దుకుని బలంగా పుంజుకుంది. శ్రీలంక సిరీస్‌తో పాటు ఆసీస్‌నూ ఓడించాం. ముఖ్యంగా గత మూడు నెలల్లో బౌలింగ్‌ విభాగం బలపడింది. గత ప్రపంచకప్‌తో పోలిస్తే ఫీల్డింగ్‌లోనూ భారత్‌ ఎంత మెరుగ్గా కనిపిస్తోంది.
- మంధాన

6

ప్రపంచకప్‌ ఆడబోతున్న భారత జట్టులో ఆరుగురు అరంగేట్రం చేస్తున్నారు. అరుంధతిరెడ్డితో పాటు జెమిమా రోడ్రిగ్స్‌, పూజ, రాధా యాదవ్‌, హేమలత, మాన్సి జోషిలకు ఇదే తొలి ప్రపంచకప్‌
గతంలో పురుషుల టీ20 టోర్నీతో కలిసి మహిళల టోర్నీ నిర్వహించేవాళ్లు.. కానీ తొలిసారి మహిళలకు మాత్రమే ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు.

5

ఇప్పటిదాకాజరిగిన ప్రపంచకప్‌లు. అత్యధికంగా ఆస్ట్రేలియా (2010, 12, 14) మూడుసార్లు విజేతగా నిలిచింది.

21

భారత్‌ ఆడిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లు. తొమ్మిదింట్లో గెలిచి.. 12 మ్యాచ్‌లు ఓడిపోయింది. 2009, 10లో సెమీస్‌ చేరడం భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.