close

పడింది వేటు 

పాండ్య, రాహుల్‌లపై సస్పెన్షన్‌ 
టీవీ షోలో అభ్యంతర వ్యాఖ్యల ఫలితం 
విచారణ పూర్తయ్యే వరకు మైదానానికి దూరం 
ఆసీస్‌తో వన్డే సిరీస్‌ నుంచి ఔట్‌.. స్వదేశానికి పయనం!

ఒక టీవీ ఛానెల్‌ టాక్‌ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత యువ క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌లపై బీసీసీఐ కఠిన చర్యలు చేపట్టింది. వీళ్లిద్దరిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. పాండ్య, రాహుల్‌ల వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించిన బోర్డు.. అది పూర్తయి తదుపరి చర్యలు చేపట్టే వరకు వీళ్లిద్దరూ మ్యాచ్‌లు ఆడేందుకు వీల్లేదని తేల్చింది. ఇప్పటికే ఒకసారి పాండ్య, రాహుల్‌లకు షోకాజ్‌ నోటీసులిచ్చిన బీసీసీఐ.. తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి నోటీసులివ్వడం విశేషం. శనివారం ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు దూరమైన వీళ్లిద్దరూ.. స్వదేశానికి పయనం కానున్నారు. ఈ సిరీస్‌ తర్వాత పాండ్య, రాహుల్‌ న్యూజిలాండ్‌ పర్యటనలకు 
వెళ్లడమూ కష్టమే.

దిల్లీ

బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్వహించే టాక్‌ షో.. భారత యువ క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌లను గట్టి దెబ్బే కొట్టింది. ఆ షోలో యధాలాపంగా చేసిన వ్యాఖ్యలు వారి మెడకు చుట్టుకున్నాయి. ఆ వ్యాఖ్యలు ఇద్దరి కెరీర్లనే ప్రభావం చేసే పరిస్థితి తలెత్తింది. రాహుల్‌, పాండ్యలకు అమ్మాయిలతో సంబంధాలపై కరణ్‌ అడిగిన కొన్ని ప్రశ్నలు.. వాటికి ఇద్దరూ ఇచ్చిన సమాధానాలపై సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. వీరి వ్యాఖ్యలు భారత క్రికెట్‌ ప్రతిష్టనే దెబ్బ తీసేలా ఉండటంతో బీసీసీఐ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే పాండ్య, రాహుల్‌లకు బోర్డు షోకాజ్‌ నోటీసులు ఇవ్వగా.. ఇద్దరూ క్షమాపణ చెబుతూ వివరణ కూడా ఇచ్చారు. కానీ అంతటితో వ్యవహారం సమసిపోలేదు. బీసీసీఐ న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న అనంతరం పాలకుల కమిటీ (సీఓఏ) మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని నిర్ణయించింది. అది పూర్తయ్యే వరకు పాండ్య, రాహుల్‌లపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. విచారణ పూర్తయి నివేదిక రావడానికి రెండు వారాల సమయం పట్టే అవకాశముండటంతో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ మొత్తానికి వీళ్లిద్దరూ దూరమయ్యారు. పాండ్య, రాహుల్‌ వెంటనే స్వదేశానికి వచ్చేయాలని బీసీసీఐ ఆదేశించడంతో.. శనివారమే విమానం ఎక్కనున్నట్లు సమాచారం. ఆసీస్‌తో వన్డే సిరీస్‌ ఈ నెల 18న ముగియనుండగా.. తర్వాత భారత జట్టు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఈ నెల 23న కివీస్‌తో ఆరంభమయ్యే వన్డే సిరీస్‌లోనూ వీరు ఆడటం సందేహమే. మరోవైపు ఇంతటి వివాదానికి కారణమైన పాండ్య, రాహుల్‌ల టీవీ షో ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోను దాన్ని డిజిటల్‌ మాధ్యమాల నుంచి తొలగించారు.

ఈ నిర్ణయం వెనుక..: పాండ్య, రాహుల్‌లపై సస్పెన్షన్‌ పడటం బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ మైదానం అవతల, పైగా ఆటేతర విషయాలపై మాట్లాడిన నేపథ్యంలో బీసీసీఐ ప్రవర్తన నియమావళిని మీరినట్లు కాదని, దాని ప్రకారం వారిని శిక్షించడానికి వీల్లేదని బోర్డు న్యాయ నిపుణులు పేర్కొన్నట్లు తెలిసింది. ఐతే వీరిపై కఠిన చర్యలు చేపట్టాలని వారు సూచించినట్లు సమాచారం.  కొంత కాలంగా ఎడుల్జీతో పలు విషయాల్లో విభేదిస్తున్న వినోద్‌ రాయ్‌.. ఈ విషయంలో మాత్రం ఆమెకు మద్దతు పలికాడు. సస్పెన్షన్‌ వల్ల వీళ్లిద్దరూ ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో శిక్షను ఈ మూడు వన్డేలకే సరిపెడతారా.. వారిని మరిన్ని మ్యాచ్‌లకు దూరం పెడతారా అన్నది తేలాల్సి ఉంది.

ప్రపంచకప్‌ అవకాశాలూ సంక్లిష్టం: టీవీ షోలో వ్యాఖ్యలకు సంబంధించిన వివాదం హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌ల కెరీర్లను దెబ్బ తీసేలా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో వీళ్లిద్దరూ ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లో ఆడటం సందేహంగా మారింది. కొంత కాలంగా వీరి ఫామ్‌ ఏమంత గొప్పగా లేదు. రాహుల్‌ వరుస వైఫల్యాలతో, నిలకడ లేమితో జట్టులో చోటును ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఆసీస్‌తో వన్డేలకు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. తుది జట్టులో అవకాశం సందేహంగానే ఉంది. అవకాశం దక్కితే సత్తా చాటి ప్రపంచకప్‌ బెర్తు సాధించాలని రాహుల్‌ భావిస్తున్నాడు. ఇక పాండ్య ఫామ్‌ కూడా అంతంతమాత్రంగా ఉండగా.. ఫిట్‌నెస్‌ సమస్యలు కూడా తోడై కొన్ని నెలలుగా టీమ్‌ఇండియాకు దూరంగా ఉన్నాడు. రాబోయే రెండు వన్డే సిరీస్‌ల్లో ఫామ్‌, ఫిట్‌నెస్‌ చాటుకోవాలని ఆశిస్తున్నాడు.  ప్రపంచకప్‌ ముంగిట కీలకమైన సిరీస్‌లకు దూరం కావడంతో ఆ మెగా టోర్నీకి వీరిద్దరి ఎంపిక సందేహంగానే మారింది. 
 

‘‘విచారణ పూర్తయ్యే వరకు పాండ్య, రాహుల్‌ సస్పెన్షన్‌లో ఉంటారు. బీసీసీఐ అంతర్గత కమిటీ లేదా అడ్‌హక్‌ అంబుడ్స్‌మన్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ఇంకా కమిటీని ఏర్పాటు చేయలేదు’’

- వినోద్‌ రాయ్‌, బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్‌

‘‘భారత జట్టు దృష్టి కోణంలో చూస్తే.. అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యల్ని కచ్చితంగా సమర్థించం. ఇదే విషయాన్ని ఆ ఇద్దరు ఆటగాళ్లకు కూడా స్పష్టం చేశాం. వారివి వ్యక్తిగత అభిప్రాయాలు. తప్పు జరిగిందని వాళ్లిద్దరూ భావించారు. జరిగిన పరిణామాల్ని అర్థం చేసుకున్నారు’’ 

- కోహ్లి 

‘‘అలాంటి మాటలు మనం స్నేహితులతో కూడా మాట్లాడం. అలాంటిది వాళ్లిద్దరూ టీవీలో కూర్చుని అలాంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు జనాలు హర్భజన్‌ కూడా ఇలాంటి వాడేనా.. కుంబ్లే, సచిన్‌ కూడా ఈ తరహానేనా అని మాట్లాడుకునే అవకాశముంది. బీసీసీఐ వీరిపై తీసుకున్న చర్యలు సరైనవే. 

- హర్భజన్‌ సింగ్‌

 గత 82 ఏళ్లలో ఒక భారత ఆటగాడు క్రమశిక్షణ చర్యలతో విదేశీ పర్యటన నుంచి అర్ధంతరంగా భారత్‌కు వచ్చేయడం ఇది రెండోసారి మాత్రమే. 1936లో ఓ ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో అదుపు తప్పినందుకు లాలా అమర్‌నాథ్‌ను ఇంగ్లాండ్‌ నుంచి స్వదేశానికి పంపించారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.