close

ఈసారి టైటిల్‌ గెలుస్తాం

సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీధరన్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌:  గత ఏడాది రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్న తమ జట్టు ఈసారి కచ్చితంగా టైటిల్‌ సాధిస్తుందని సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీధరన్‌ అన్నాడు. ఫెరిట్‌ క్రికెట్‌ బాష్‌ (ఎఫ్‌సీబీ) పేరుతో వస్తున్న కొత్త లీగ్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఈ శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ఆదివారం ప్రగతి నగర్‌లోని ప్రగతి క్రికెట్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మురళీ మాట్లాడుతూ.. ‘‘ఈ సారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ మంచి జట్టుతో బరిలో దిగనుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో జట్టు సమతూకంతో ఉంది. గత సీజన్‌లో ఫైనల్లో ఓడాం. ఈ సారి ట్రోఫీ నెగ్గుతామనే నమ్మకం ఉంది. ఐపీఎల్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌, టామ్‌ మూడీ లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పాడు. ఇక ఎఫ్‌సీబీకి మార్గనిర్దేశకుడిగా వ్యవహరిస్తున్న మురళీ ఈ లీగ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో క్రికెట్‌ను అభిమానించే వాళ్లు ఎక్కువ. ఏ గళ్లీలో చూసిన బ్యాట్‌ పట్టుకొని ఆడేవాళ్లు కనిపిస్తారు. క్రికెట్‌ అంటే పిచ్చి ఉన్నవాళ్లందరికీ జాతీయ జట్టు తరపున ఆడాలని ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం రాదు. అలాంటి వాళ్లకోసమే ఈ లీగ్‌కు శ్రీకారం చుట్టారు. క్రికెట్‌ అంటే అభిమానం ఉండి వివిధ రంగాల్లో స్థిరపడ్డ వాళ్లు, ప్రస్తుత క్రికెటర్లు, రాబోయే యువ ఆటగాళ్లు ఇలా వీళ్లందరూ ఈ లీగ్‌లో ఆడే అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న వాళ్లు ఈ లీగ్‌లో పాల్గొనవచ్చు. దేశవ్యాప్తంగా ఈ లీగ్‌ నిర్వహించబోతున్నారు. అంతర్జాతీయ స్థాయికి తగ్గకుండా ఈ లీగ్‌ జరగనుంది’’ అని తెలిపాడు. ఎఫ్‌సీబీ వ్యవస్థాపకుడు జస్మీత్‌ భాటియా మాట్లాడుతూ.. ‘‘వైద్యుడు, ఇంజినీర్‌ ఇలా ఎవరైనా సరే.. లీగ్‌లో పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించవచ్చు. దేశవ్యాప్తంగా 16 జట్లు ఈ లీగ్‌లో పాల్గొనబోతున్నాయి. 380 మంది కోచ్‌ల ద్వారా ఏప్రిల్‌ మొదటి వారంలో ఆటగాళ్ల ఎంపిక జరగనుంది. ఎంపికైన క్రీడాకారులకు మురళీధరన్‌, క్రిస్‌ గేల్‌, జహీర్‌ ఖాన్‌, ప్రవీణ్‌ కుమార్‌ లాంటి వాళ్లు శిక్షణ ఇస్తారు. ప్రపంచకప్‌ తర్వాత జరిగే ఈ లీగ్‌లో 15 ఓవర్ల మ్యాచ్‌లు జరుగుతాయి. పదిహేనేళ్లు దాటిన ఎవరైనా సరే తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.www. feritcricketbash.com  వెబ్‌సైట్లోకి లాగిన్‌ అయ్యి మిగతా సమాచారం పొందవచ్చు. 9871063063 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి పేర్లు నమోదు చేసుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. అనంతరం అక్కడి క్రికెటర్లతో మాట్లాడిన మురళీధరన్‌ వాళ్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. బౌలింగ్‌లో సూచనలు అందించాడు. యువ క్రికెటర్లకు నెట్స్‌లో బౌలింగ్‌ చేశాడు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌సీబీ సహ వ్యవస్థాపకుడు మితేశ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.