close

ఆఖర్లో.. ప్చ్‌!

సిరీస్‌ ఓటమితో పర్యటన ముగింపు
మూడో టీ20లో భారత్‌ పరాజయం
సిరీస్‌ 2-1తో కివీస్‌ వశం

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో టీమ్‌ఇండియా పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టిన భారత్‌.. ఎన్నో అపురూప విజయాలు సాధించింది. ఎన్నో మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకుంది. కానీ ఆఖర్లో కొద్దిగా నిరాశ తప్పలేదు. ఒక్క సిరీస్‌ కూడా కోల్పోకుండా, ఘనమైన ముగింపుతో స్వదేశానికి చేరుకోవాలనుకున్న మన జట్టు ఆశ నెరవేరలేదు. గట్టిగా పోరాడినా.. ఆఖరి టీ20లో ఓటమి తప్పలేదు. హోరాహోరీ పోరులో భారత్‌ను ఓడించిన న్యూజిలాండ్‌.. 2-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది.

హామిల్టన్‌

అద్భుతమైన ఆటతో ఆస్ట్రేలియాలో తొలి సారి టెస్టు సిరీస్‌, వన్డే సిరీస్‌ గెలిచిన టీమ్‌ ఇండియా.. న్యూజిలాండ్‌ను వన్డే సిరీస్‌లో చిత్తు చేసింది. కివీస్‌పై టీ20 సిరీసూ గెలిస్తే భారత జట్టు మరింత సంతృప్తిగా పర్యటనను ముగించేది. కానీ న్యూజిలాండ్‌ ఆ అవకాశం ఇవ్వలేదు. ఆదివారం రసవత్తరంగా సాగిన చివరిదైన మూడో టీ20లో ఆ జట్టు 4 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. మన్రో (72; 40 బంతుల్లో 5×4, 5×6), సీఫెర్ట్‌ (43; 25 బంతుల్లో 3×4, 3×6) గ్రాండ్‌హోమ్‌ (30; 16 బంతుల్లో 3×4, 1×6) విధ్వంసం సృష్టించడంతో మొదట న్యూజిలాండ్‌ 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఛేదనలో భారత్‌ 6 వికెట్లకు 208 పరుగులే చేయగలిగింది. విజయ్‌ శంకర్‌ (43; 35 బంతుల్లో 5×4, 2×6) టాప్‌ స్కోరర్‌. దినేశ్‌ కార్తీక్‌ (33 నాటౌట్‌; 16 బంతుల్లో 4×6) మెరుపులు మెరిపించినా గెలుపు ముంగిట పేలవంగా బ్యాటింగ్‌ చేశాడు.

చేజారిన అవకాశం: చివరి 28 బంతుల్లో భారత్‌ విజయానికి కావాల్సిన పరుగులు 68. అప్పటికే 6 వికెట్లు పోవడంతో కష్టమే అనిపించింది. కానీ దినేశ్‌ కార్తీక్‌, కృనాల్‌ పాండ్య (26 నాటౌట్‌; 13 బంతుల్లో 2×4, 2×6) విధ్వంసక విన్యాసాలతో భారత్‌ ఆశలను నిలిపారు. మిచెల్‌, టిక్నర్‌ ఓవర్లలో కార్తీక్‌ ఒక్కో సిక్స్‌ బాదగా.. సౌథీ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో కృనాల్‌ విరుచుకుపడ్డాడు. వరుసగా 6, 4, 4 దంచాడు. దీంతో చివరి 12 బంతుల్లో 30 పరుగులు అవసరమయ్యాయి. తర్వాత కుగెలిన్‌ ఓవర్లో కార్తీక్‌, కృనాల్‌ చెరో సిక్స్‌ కొట్టారు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన పరిస్థితి. బ్యాట్స్‌మెన్‌ జోరుతో భారత్‌ గెలుపు ఆశలు పెరిగాయి. కానీ ఆఖరి ఓవర్లో కార్తీక్‌ నిరాశపరిచాడు. సౌథీ తొలి బంతికి రెండు పరుగులు చేసిన అతడు.. తర్వాతి రెండు బంతులకు ఒక్క పరుగూ చేయలేదు. నాలుగో బంతికి సింగిలే తీయడంతో విజయం భారత్‌కు దూరమైంది. చివరి రెండు బంతుల్లో 13 పరుగులు చేయాల్సి రాగా.. కృనాల్‌ సింగిల్‌ తీశాడు. ఆఖరి బంతికి కార్తీక్‌ కొట్టిన సిక్స్‌కు ఎలాంటి విలువ లేకుండా పోయింది. మొదట్లో రోహిత్‌ ధాటికి ఆడకపోవడం కూడా భారత్‌ అవకాశాలను ప్రభావితం చేసింది. తొలి ఓవర్లోనే ధావన్‌ (5) ఔటైనా.. 8 ఓవర్లకు భారత్‌ 76/1తో నిలిచింది. కాస్త బ్యాటు ఝుళిపించిన శంకర్‌.. తొమ్మిదో ఓవర్లో జట్టు స్కోరు 81 వద్ద ఔటయ్యాడు. ఐతే 14వ ఓవర్‌ దాకా క్రీజులో ఉన్న రోహిత్‌ తన సహజ శైలిలో దూకుడుగా ఆడలేకపోయాడు. 32 బంతుల్లో 38 పరుగులు చేసిన అతడు మూడు ఫోర్లే కొట్టాడు. ధనాధన్‌ షాట్లతో అలరించిన పంత్‌ (28; 12 బంతుల్లో 1×4, 3×6), హార్దిక్‌ పాండ్య (21; 11 బంతుల్లో 1×4, 2×6)లు అయినా కాస్త ఎక్కువసేపు నిలిస్తే.. భారత్‌ పరిస్థితి భిన్నంగా ఉండేదే. శంకర్‌ ఔటయ్యాక వచ్చిన పంత్‌ 13వ ఓవర్లో ఔట్‌ కాగా.. ఆపై హార్దిక్‌ 15వ ఓవర్లో వెనుదిరిగాడు. ధోని (2) విఫలమయ్యాడు.

ఆ బంతికి సింగిల్‌ తీసి ఉంటే..
ధనాధన్‌ బ్యాటింగ్‌తో భారత్‌ను లక్ష్యానికి చేరువ చేసిన దినేశ్‌ కార్తీక్‌.. గెలుపు ముంగిట పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచాడు. ఆఖరి ఓవర్లో మూడో బంతికి అలవోకగా సింగిల్‌ వచ్చే అవకాశమున్నా తీసుకోవడానికి నిరాకరించి అందరికీ షాకిచ్చాడు. కృనాల్‌ సింగిల్‌ కోసం పరుగెత్తాడు. దాదాపు కార్తీక్‌ దాకా వెళ్లాడు. కానీ అతడు వద్దనడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. కృనాలేమీ టెయిలెండర్‌ కాదు. అతడి బ్యాటింగ్‌ సామర్థ్యం తెలియనిదీ కాదు. అప్పటికీ భారీ షాట్లు ఆడి మంచి ఊపు మీదున్నాడు కూడా. అయినా కార్తీక్‌ సింగిల్‌ తీయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆ బంతికి కార్తీక్‌ సింగిల్‌ తీసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో మరి!

రెచ్చిపోయిన మన్రో
బౌలింగ్‌లో భారత్‌ పూర్తిగా తేలిపోయింది. టాస్‌ ఓడిన కివీస్‌ బ్యాటింగ్‌కు దిగగా.. ఓపెనర్లు మన్రో, సీఫెర్ట్‌ ఆ జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చారు. ఎనిమిదో ఓవర్లో సీఫెర్ట్‌ ఔటయ్యేటప్పటికి స్కోరు 80. కుల్‌దీప్‌ బౌలింగ్‌లో ధోని మెరుపు వేగంతో చేసిన స్టంపింగ్‌కు స్టీఫెర్ట్‌ నిష్క్రమించాడు. ఆ తర్వాత మన్రో జోరు పెరిగిందే తప్ప తగ్గలేదు. అతడు విలియమ్సన్‌ (27) రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించాక ఔటయ్యాడు. గ్రాండ్‌హోమ్‌, మిచెల్‌ (19 నాటౌట్‌), రాస్‌ టేలర్‌ (14 నాటౌట్‌) కూడా బ్యాట్‌ ఝళిపించడంతో కివీస్‌ అలవోకగా 200 దాటింది. కుల్‌దీప్‌ (2/26) లేకుంటే కివీస్‌ మరింత భారీ స్కోరు సాధించేదే. ఖలీల్‌ (1/47), కృనాల్‌ (0/54), హార్దిక్‌ (0/44) ధారాళంగా పరుగులిచ్చారు. ఆఖరి 5 ఓవర్లలో న్యూజిలాండ్‌ 61 పరుగులు రాబట్టింది. భారత జట్టు పేలవ ఫీల్డింగ్‌ కూడా కివీస్‌కు కలిసొచ్చింది. భారత ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడమే కాకుండా.. బంతిని సరిగా ఆపకుండా అదనపు పరుగులూ ఇచ్చారు.

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: సీఫెర్ట్‌ (స్టంప్డ్‌) ధోని (బి) కుల్‌దీప్‌ 43; మన్రో (సి) హార్దిక్‌ (బి) కుల్‌దీప్‌ 72; విలియమ్సన్‌ (సి) కుల్‌దీప్‌ (బి) ఖలీల్‌ 27; గ్రాండ్‌హోమ్‌ (సి) ధోని (బి) భువనేశ్వర్‌ 30; మిచెల్‌ నాటౌట్‌ 19; రాస్‌ టేలర్‌ నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 212; వికెట్ల పతనం: 1-80, 2-135, 3-150, 4-193; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-37-1; ఖలీల్‌ అహ్మద్‌ 4-0-47-1; హార్దిక్‌ పాండ్య 4-0-44-0; కృనాల్‌ పాండ్య 4-0-54-0; కుల్‌దీప్‌ యాదవ్‌ 4-0-26-2

భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (సి) మిచెల్‌ (బి) శాంట్నర్‌ 5; రోహిత్‌ (సి) సీఫెర్ట్‌ (బి) మిచెల్‌ 38; విజయ్‌ శంకర్‌ (సి) గ్రాండ్‌హోమ్‌ (బి) శాంట్నర్‌ 43; రిషబ్‌ పంత్‌ (సి) విలియమ్సన్‌ (బి) టిక్నర్‌ 28; హార్దిక్‌ పాండ్య (సి) విలియమ్సన్‌ (బి) కుగెలిన్‌ 21; ధోని (సి) సౌథీ (బి) మిచెల్‌ 2; దినేశ్‌ కార్తీక్‌ నాటౌట్‌ 33; కృనాల్‌ పాండ్య నాటౌట్‌ 26; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208; వికెట్ల పతనం:  1-6, 2-81, 3-121, 4-141, 5-145, 6-145; బౌలింగ్‌: శాంట్నర్‌ 3-0-32-2; సౌథీ 4-0-47-0; కుగెలిన్‌ 4-0-37-1; టిక్నర్‌    4-0-34-1; ఇష్‌ సోధి 2-0-30-0; మిచెల్‌ 3-0-27-2\

పది సిరీస్‌ల తర్వాత...

దాదాపు రెండేళ్ల కాలంలో ద్వైపాక్షిక సిరీస్‌లో ఓడిపోవడం భారత్‌కు ఇదే తొలిసారి. గత పది సిరీస్‌ల్లో భారత్‌ ఓడిపోలేదు. అందులో తొమ్మిది గెలిచి, ఒకటి డ్రా చేసుకుంది.

ధోని కోసం అక్కడ కూడా..

ధోని కోసం అభిమానులు స్టేడియాల్లో బారికేడ్లు దూకి మైదానంలోకి వెళ్లిపోవడం కొత్తేమీ కాదు. భారత్‌లో లెక్కలేనన్నిసార్లు ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు న్యూజిలాండ్‌లో కూడా ఓ అభిమాని ఇదే పని చేశాడు. కివీస్‌తో మూడో టీ20 సందర్భంగా ఓ వ్యక్తి భద్రత సిబ్బందిని దాటుకుని మైదానంలోకి వెళ్లాడు. ధోని దగ్గరికెళ్లి పాదాభివందనం చేశాడు. ఐతే అతను కిందికి వంగే క్రమంలో చేతిలో ఉన్న భారత జాతీయ జెండా కింద పడబోతుంటే.. ధోని చురుగ్గా స్పందించి దాన్ని చేతికి తీసుకోవడంతో అతడిపై ప్రశంసల జల్లు కురిసింది. ధోని పాదాన్ని తాకాక ఆ అభిమాని తెగ సంబరపడుతూ మైదానాన్ని వీడాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

‘‘విజయం దాకా వచ్చి ఓడిపోయినందుకు బాధగా ఉంది. కానీ మేం ఆఖరి వరకు గట్టిగా పోరాడాం. ఓడినా ఈ పర్యటనలో మాకు ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. పర్యటన ఆసాంతం మా ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. బాగా శ్రమించారు. విజయంతో ముగించలేకపోయినందుకు వాళ్లకు నిరాశ కలుగుతుండొచ్చు. కానీ మేం తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు సాగాం’’

- రోహిత్‌ శర్మ, భారత తాత్కాలిక కెప్టెన్‌

8

టీ20 క్రికెట్లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌కు ఇది ఎనిమిదో ఓటమి. మరే జట్టు చేతిలోనూ టీమ్‌ ఇండియా ఇన్నిసార్లు ఓడలేదు.

131

ఈ సిరీస్‌ మొత్తంలో హార్దిక్‌ పాండ్య ఇచ్చిన పరుగులు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులిచ్చిన భారత బౌలర్‌ అతడే.

118.75

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ స్ట్రైక్‌రేట్‌. టీ20ల్లో 30, ఆపై బంతులు ఆడిన ఇన్నింగ్స్‌ల్లో అతడికిది నాలుగో అత్యల్ప స్రైక్‌రేట్‌.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.