close
వేసవి శిబిరాల ఊసేది?

ఇప్పటికీ వెలువడని ప్రకటనలు
శాట్స్‌, జీహెచ్‌ఎంసీ మీనమేషాలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఏప్రిల్‌ వచ్చిందంటే ఎండలు మండిపోతాయి.. సెలవులతో పాఠశాలలూ మూతబడతాయి.. ఇక సందడంతా క్రీడా మైదానాల్లోనే. జంట నగరాల్లో ఖాళీగా ఉన్న ఏ మైదానంలో చూసిన ఆటాడుతున్న పిల్లలే కనిపిస్తారు. ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలనే ఉద్దేశంతో కొందరు అకాడమీల్లో చేరితే.. మరికొందరు వేసవి శిబిరాల్లో పాల్గొని ఆటలో మెళకువలు ఒంటపట్టించుకుంటారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్స్‌), జీహెచ్‌ఎంసీ, ప్రైవేట్‌ అకాడమీలు ప్రతి ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. కానీ ఈ సారి శాట్స్‌, జీహెచ్‌ఎంసీ నుంచి శిబిరాలకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. దానికి కారణం ఎన్నికలు. అయితే తెలంగాణలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలోనైనా శిబిరాల నిర్వహణపై ప్రకటనలు వెలువడుతాయో లేదో చూడాలి.

ఎందుకీ ఆలస్యం: సాధారణంగా ప్రతి ఏడాది వేసవి మొదలైందంటేనే శిక్షణ శిబిరాల సందడి షురూ అయ్యేది. పాఠశాలకు సెలవులు ప్రకటించేలోపే ఈ శిబిరాలకు సంబంధించిన అన్ని ముందస్తు ఏర్పాట్లు జరిగిపోయేవి. ఎప్పుడు ఆరంభమౌతాయి? ఎన్ని రోజులు సాగుతాయి? ఎక్కడెక్కడ ఏయే క్రీడల్లో శిక్షణ ఇస్తారు? తదితర విషయాలతో ప్రకటనలు వెలువడేవి. గతేడాది ఏప్రిల్‌ మొదటి వారం నుంచి శాట్స్‌ శిబిరాల సందడి మొదలైంది. కానీ ఈ సారి పరీక్షలు ముగిసి... పాఠశాలలకు సెలవులు ప్రకటించినా కూడా ఇంకా వేసవి శిబిరాల ఊసే లేదు. దాంతో తమ పిల్లల్ని శిబిరాల్లో చేర్పించాలనే ఆరాటంతో ఉన్న తల్లిదండ్రులు ఆ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది శిబిరాల ఆరంభం ఆలస్యం కావడానికి ప్రధాన కారణం సార్వత్రిక ఎన్నికలే. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండడం, శాట్స్‌ ఇండోర్‌ స్టేడియాలను ఎన్నికల సామగ్రిని నిలువ ఉంచడం కోసం వినియోగించడంతో ఈ ఆలస్యం తప్పలేదు. అయితే ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసి.. ఎన్నికలు ముగియగానే శిబిరాలు ప్రారంభిస్తే బాగుండేదని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు పదిహేను రోజుల సమయం వృథా అవుతుందని వాళ్లు అంటున్నారు.

ఎక్కడెక్కడ: జంటనగరాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 12 స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, ఏడు స్విమ్మింగ్‌ పూల్‌లు, 521 క్రీడా మైదానాలున్నాయి. గతేడాది మొత్తం 1600 కేంద్రాల్లో 51 క్రీడాంశాల్లో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఈ సారి మరింత పెద్ద ఎత్తున ఈ శిబిరాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు శాట్స్‌ ఆధ్వర్యంలో నిరుడు ఎల్బీ స్టేడియం, సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియం, సైక్లింగ్‌ వెలోడ్రోం, షూటింగ్‌ రేంజ్‌ (యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌), గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, జింఖానా మైదానం, వాటర్‌ స్పోర్ట్స్‌ (హుస్సేన్‌సాగర్‌), కేవీబీఆర్‌ ఇండోర్‌ స్టేడియాల్లో కలిపి మొత్తం 29 రకాల క్రీడాంశాల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. 14 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న సుమారు 5 వేల మంది చిన్నారులు ఈ శిబిరాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది ఈ నెల 25 నుంచి శాట్స్‌ ఆధ్వర్యంలో శిబిరాలు ఆరంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెలాఖరులోపు శిబిరాలు ప్రారంభిస్తామని జీహెచ్‌ఎంసీ తెలిపింది.

25 నుంచి ఆరంభం
‘‘శాట్స్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి శిక్షణ శిబిరాలు ఆరంభం కానున్నాయి. త్వరలోనే ప్రకటన విడుదల చేస్తాం. ఎన్నికల కారణంగానే ఈ సారి శిబిరాల ఏర్పాటు ఆలస్యమైంది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం’’

- జీఏ శోభ, శాట్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ (శిక్షణ, అకాడమీలు)

ఎదురుచూస్తున్నాం
‘‘వేసవి శిక్షణ శిబిరాల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాం. పిల్లలకు పరీక్షలు అయిపోయినా కూడా ఇంకా ప్రకటన రాకపోవడంతో.. ఈ సారి శిబిరాలు ఉంటాయో లేదో అని కంగారు పడ్డాం. రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో శిబిరాలు ప్రారంభం అవుతున్నాయని తెలిసింది. అన్ని వసతులతో శిబిరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది’’

- తల్లిదండ్రులు
 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.