close
లేచి పడిన రాయుడు

ఈనాడు - హైదరాబాద్‌

‘‘ప్రపంచ కప్‌ జట్టు కూర్పు దాదాపుగా పూర్తయింది. నాలుగో స్థానం కోసం కొంతమంది ఆటగాళ్లను పరిశీలించాం. ఆసియా కప్‌లో ప్రదర్శన చూశాక నాలుగో స్థానానికి రాయుడు సరైన ఆటగాడిగా భావిస్తున్నాం. జట్టు ఎంపిక దాదాపుగా పూర్తయినట్లే!’’
ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ముందు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్న మాటలివి! ప్రపంచ కప్‌లో చోటు ఖాయమని భావించిన రాయుడు.. ఫిట్‌నెస్‌ కాపాడుకునేందుకు రంజీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు! ఐతే సోమవారం ప్రకటించిన 15 మంది సభ్యుల టీమ్‌ఇండియాలో రాయుడు స్థానం దక్కకపోవడం అతడితో పాటు తెలుగు రాష్ట్రాల అభిమానులకు నిరాశ కలిగించిన పరిణామం!
2016 జూన్‌లో జింబాబ్వేతో చివరి వన్డే ఆడిన రాయుడు మళ్లీ వన్డే జట్టులో అడుగుపెట్టేందుకు రెండేళ్లు పట్టింది! నిరుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున అత్యధిక పరుగులు (602) చేయడం.. ధోని సేన మూడోసారి టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించడంతో రాయుడును సెలెక్టర్లు ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపిక చేశారు. ఐతే యోయో పరీక్షలో విఫలమవడంతో ఇంగ్లాండ్‌ పర్యటనకు దూరమయ్యాడు రాయుడు. ఆ తర్వాత యోయో పరీక్షలో సఫలమై.. ఆసియా కప్‌కు ఎంపికైన రాయుడు రెండు అర్ధ సెంచరీలతో రాణించాడు. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఒక సెంచరీ, మరో అర్ధ సెంచరీ సాధించాడు. 2018లో 11 మ్యాచ్‌ల్లో 10 ఇన్నింగ్స్‌లాడిన రాయుడు.. 56 సగటుతో 392 పరుగులు రాబట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో రెండు వన్డేల్లో (0, 24) విఫలమైన అతడు న్యూజిలాండ్‌ పర్యటనలో వరుసగా 13 నాటౌట్‌, 47, 40 నాటౌట్‌, 0, 90 ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. ఐతే సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ రాయుడుకు కోలుకోలేనంత నష్టం చేసింది. 3 మ్యాచ్‌ల్లో వరుసగా 13, 18, 2 ఇన్నింగ్స్‌లతో విఫలమవడం అతడి ప్రపంచకప్‌ అవకాశాల్ని సందిగ్ధంలో పడేసింది. ఆ తర్వాతి రెండు వన్డేల్లో రాయుడుకు తుదిజట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుత ఐపీఎల్‌లో 8 మ్యాచ్‌లాడిన రాయుడు.. వరుసగా 28, 5, 1, 0, 21 నాటౌట్‌, 21, 57, 5 ఇన్నింగ్స్‌లతో నిరాశ పరిచాడు. ఆసీస్‌తో సిరీస్‌ మినహా వన్డేల్లో నిలకడగా రాణించిన రాయుడుకు వీవీఎస్‌ లక్ష్మణ్‌, గంభీర్‌, మంజ్రేకర్‌ లాంటి ఆటగాళ్లు మద్దతు తెలిపినా.. ఐపీఎల్‌లో పేలవమైన ఫామ్‌ అతడికి ప్రతికూలంగా మారింది. 2003 ప్రపంచకప్‌ సమయంలో లక్ష్మణ్‌కు చివరి నిమిషంలో బెర్తు చేజారింది. తాజాగా రాయుడికి అలాంటి అనుభవమే ఎదురైంది.

పాపం.. రాయుడు

‘‘రాయుడు ఎంతగానో నిరాశ చెందుంటాడు. ప్రపంచ కప్‌ జట్టులో అతడికి కచ్చితంగా చోటు దక్కుతుందని అనిపించింది. ప్రపంచకప్‌ కోసం అతడు నాలుగు రోజుల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రాయుడు ఎంత గట్టిగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతడికి నా సానుభూతి’’

- హర్ష భోగే
 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.