close
పంత్‌ టాప్‌ లేపాడు 

అగ్రస్థానానికి దిల్లీ 
రాజస్థాన్‌పై గెలుపు 
రహానె సెంచరీ వృథా 
జైపుర్‌

రాజస్థాన్‌తో మ్యాచ్‌.. దిల్లీ లక్ష్యం 192.. 10 ఓవర్లకు దిల్లీ స్కోరు 81/2.. ఒకవైపు రాయల్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. క్రీజులో పృథ్వీ ఉన్నా జోరుగా ఆడలేకపోతున్నాడు. ఇలాంటి స్థితిలో రిషబ్‌ పంత్‌ రెచ్చిపోయాడు. తన శైలిలో షాట్లతో విరుచుకుపడిన ఈ యువ కెరటం.. రాజస్థాన్‌ నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు.  వికెట్లు పడుతున్నా.. ఒత్తిడి ఉన్నా ఏమాత్రం తగ్గకుండా ఆడిన ఈ కుర్రాడు.. దిల్లీని ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ విజయంతో 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో దిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 
మ బ్యాట్స్‌మన్‌ సెంచరీ చేస్తే రాజస్థాన్‌కు కలిసి రాదేమో! సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో సంజు శాంసన్‌ సెంచరీ చేసినా.. రాయల్స్‌ గెలవలేదు. ఇప్పుడూ అంతే అజింక్య రహానె (105 నాటౌట్‌; 63 బంతుల్లో 11×4, 3×6) సెంచరీ చేసినా.. రాజస్థాన్‌ గెలవలేదు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 6 వికెట్ల తేడాతో రాయల్స్‌ను ఓడించింది. మొదట రాజస్థాన్‌ 20 ఓవర్లలో
6 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఛేదనలో రిషబ్‌ పంత్‌ (78 నాటౌట్‌; 36 బంతుల్లో 6×4, 4×6), శిఖర్‌ ధావన్‌ (54; 27 బంతుల్లో 8×4, 2×6) మెరవడంతో లక్ష్యాన్ని దిల్లీ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

మెరిసిన ధావన్‌, పంత్‌: ఛేదనలో శిఖర్‌ ధావన్‌ చెలరేగిపోయాడు. రాజస్థాన్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు పెంచాడు. ధవళ్‌ కులకర్ణి వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో సిక్స్‌తో మొదలుపెట్టిన ధావన్‌.. ఆ తర్వాత గోపాల్‌ బౌలింగ్‌లో సిక్స్‌, రెండు ఫోర్లతో సహా 15
పరుగులు రాబట్టాడు. ధవళ్‌ బౌలింగ్‌లో మరోసారి మూడు ఫోర్లు కొట్టిన శిఖర్‌.. పరాగ్‌ బౌలింగ్‌లో సింగిల్‌తో అర్ధసెంచరీ (25 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. దూకుడు మీదున్న ధావన్‌ను శ్రేయస్‌ గోపాల్‌ (2/47) ఔట్‌ చేశాడు. పృథ్వీ షా (42; 39 బంతుల్లో 4×4, 1×6)తో కలిసి శిఖర్‌ తొలి వికెట్‌కు 72 పరుగులు జత చేశాడు. అయితే కాసేపటికే కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (4) కూడా ఔట్‌ కావడంతో దిల్లీ 77/2తో ఇబ్బందుల్లో పడింది. 60 బంతుల్లో 111 పరుగులు చేయాల్సిన స్థితి! ఈ దశలో రిషబ్‌ పంత్‌ దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా తన శైలిలో పుల్‌ షాట్లతో మెరిసిన పంత్‌.. దిల్లీ సాధించాల్సిన రన్‌రేట్‌ను అదుపులో ఉంచాడు. 24 బంతుల్లో 41 పరుగులు అవసరమైన స్థితిలో పృథ్వీని గోపాల్‌ ఔట్‌ చేశాడు. 7 బంతుల్లో 12 పరుగులు చేయాల్సినపుడు సిక్స్‌ బాది దిల్లీని విజయానికి చేరువ చేసిన పంత్‌.. ఆ తర్వాతి ఓవర్లో మరో సిక్స్‌ కొట్టి దిల్లీని గెలిపించాడు.
 
రహానె దూకుడు..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో రహానె ఆటే హైలైట్‌. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే శాంసన్‌ (0) వికెట్‌ కోల్పోయినా.. రహానె.. స్టీవ్‌ స్మిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. స్మిత్‌ ఆచితూచి ఆడగా.. రహానె మాత్రం బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. అక్షర్‌ బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాదిన అజింక్య.. రబాడకూ ఇదే శిక్ష వేశాడు. 32 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన రహానె.. మరో 26 బంతుల్లోనే సెంచరీ మైలురాయి అందుకున్నాడు. అతనికిది రెండో ఐపీఎల్‌ శతకం. రహానెతో పాటు స్మిత్‌ కూడా జోరు పెంచడంతో ఒక దశలో రాయల్స్‌... 12 ఓవర్లకు 122/1తో సులభంగా 200 పరుగులు దాటేలా కనిపించింది. కానీ స్మిత్‌ను ఔట్‌ చేసిన అక్షర్‌.. ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. రెండో వికెట్‌కు రహానె-స్మిత్‌ 130 పరుగులు జత చేయడం విశేషం. అయితే స్మిత్‌ ఔటైన తర్వాత రాజస్థాన్‌ రన్‌రేట్‌ తగ్గింది. దీనికి తోడు స్టోక్స్‌ (8), టర్నర్‌ (0) వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేరడంతో రాయల్స్‌ వేగంగా పరుగులు సాధించలేకపోయింది. ఒకవైపు రహానె క్రీజులో ఉన్నా.. పరుగులు అంత సులభంగా రాలేదు. 19, 20 ఓవర్లలో రాయల్స్‌కు ఎనిమిదేసి పరుగులు మాత్రమే లభించాయి. దిల్లీ బౌలర్లలో రబాడ (2/37) రాణించాడు.

దిల్లీ.. ఎన్నేళ్లకెన్నేళ్లకు

పీఎల్‌  జరుగుతోందంటే పాయింట్ల పట్టికలో దిల్లీ జట్టును కింది వరుసలో వెతుక్కోవాల్సిన పరిస్థితి. గత కొన్నేళ్లలో ఎన్ని మార్పులు చేసినా ఆ జట్టు ప్రదర్శన మారలేదు. అట్టడుగు స్థానానికి గట్టి పోటీదారుగా ఉండేదా జట్టు. కానీ ఈసారి ఆశ్చర్యకరంగా నిలకడగా విజయాలు సాధిస్తూ దూసుకెళ్తోంది. తాజాగా రాజస్థాన్‌పై విజయంతో దిల్లీ.. చెన్నైని వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో ఏకంగా అగ్రస్థానానికి చేరుకుంది. 2009, 2012 సీజన్లలో లీగ్‌ దశలో అగ్రస్థానం సాధించిన దిల్లీ.. తర్వాత తాత్కాలికంగా కూడా ఒక్కసారీ అగ్రస్థానానికి రాలేదు. 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించిన దిల్లీ.. ఇంకో విజయం సాధిస్తే ప్లేఆఫ్‌   చేరినట్లే.

రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: రహానె నాటౌట్‌ 105; శాంసన్‌ రనౌట్‌ 0; స్టీవ్‌ స్మిత్‌ (సి) మోరిస్‌ (బి) అక్షర్‌ 50; స్టోక్స్‌ (సి) అయ్యర్‌ (బి) మోరిస్‌ 8; టర్నర్‌ (సి) రూథర్‌ఫర్డ్‌ (బి) ఇషాంత్‌ 0; బిన్నీ (బి) రబాడ 19; పరాగ్‌ (బి) రబాడ 4; ఎక్స్‌ట్రాలు 5; 
మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 191; 
వికెట్ల పతనం: 1-5, 2-135, 3-157, 4-163, 5-187, 6-191; 
బౌలింగ్‌: ఇషాంత్‌ 4-0-29-1; రబాడ  4-0-37-2; అక్షర్‌పటేల్‌ 4-0-39-1; మిశ్రా 3-0-28-0; మోరిస్‌ 4-0-41-1; రూథర్‌ఫర్డ్‌ 1-0-16-0 
దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) పరాగ్‌ (బి) గోపాల్‌ 42; ధావన్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) గోపాల్‌ 54; శ్రేయస్‌ (సి) స్టోక్స్‌ (బి) పరాగ్‌ 4; పంత్‌ నాటౌట్‌ 78; రూథర్‌ఫర్డ్‌ (సి) పరాగ్‌ (బి) ధవళ్‌ 11; ఇంగ్రామ్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 1 
మొత్తం: (19.2 ఓవర్లలో 4 వికెట్లకు) 193; 
వికెట్ల పతనం: 1-72, 2-77, 3-161, 4-175; 
బౌలింగ్‌: బిన్నీ 1-0-3-0; ధవళ్‌ కులకర్ణి 4-0-51-1; ఉనద్కత్‌ 3.2-0-36-0; శ్రేయస్‌ గోపాల్‌ 4-0-47-2; ఆర్చర్‌ 4-0-31-0; రియాన్‌ పరాగ్‌ 3-0-25-1

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.