close
నువ్వు ఆగితే లోకమే ఊగదా..!

అందరి దృష్టీ వరుణుడిపైనే
 పాకిస్థాన్‌తో నేడు భారత్‌ ఢీ
 అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ
మాంచెస్టర్‌

ప్రపంచకప్‌ నాలుగేళ్లకోసారి వస్తుంది. టోర్నీకి ఏడాది ముందే షెడ్యూల్‌ ప్రకటిస్తారు. ఆ సమయంలో ప్రతి క్రికెట్‌ అభిమాని కళ్లూ వెతికేది ఒక్క మ్యాచ్‌ కోసమే!
కప్పు ఎప్పుడు మొదలవుతుంది..? ఎప్పుడు ముగుస్తుంది.. తొలి మ్యాచ్‌లో ఎవరు తలపడతారు.. ఫైనల్‌ ఎప్పుడు.. ఇవన్నీ తర్వాత! ఆ ·రెండు జట్లు లీగ్‌ దశలో తలపడుతున్నాయా.. తలపడుతుంటే ఎప్పుడు.. దీని మీదే దృష్టంతా!
అందరి కళ్లూ ఆగేది.. ‘భారత్‌ × పాకిస్థాన్‌’ అని కనిపించిన చోటే! ఆ మ్యాచ్‌ తేదీ అలా మదిలో ముద్రించుకుపోతుంది. ప్రపంచకప్‌ గురించి చర్చ రాగానే ఆ తేదీనే గుర్తుకొస్తుంది. టోర్నీ ఎప్పుడు మొదలైనా సరే.. ఎదురు చూపులన్నీ ఆ మ్యాచ్‌ కోసమే!
2019 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను గత ఏడాది ప్రకటించినపుడు.. క్రికెట్‌ అభిమానులు కళ్లు ఆగింది ‘జూన్‌ 16’ దగ్గర. నిరీక్షణ ఫలించింది. ఆ రోజు రానే వచ్చింది. క్రికెట్‌ అభిమానుల కలల మ్యాచ్‌ నేడే. ఇంకొన్ని గంటల్లోనే క్రికెట్‌ ప్రపంచమంతా కళ్లప్పగించి చూసే మహా సమరం! చిరకాల ప్రత్యర్థుల పోరుకు సర్వం సిద్ధం!
కానీ అందరితో పాటు వరుణుడు కూడా ఈ మ్యాచ్‌ కోసం ఎదురు చూస్తుండటమే ఆందోళనకరం! ప్రపంచకప్‌ను వెంటాడుతున్న వర్షం ఈ మ్యాచ్‌నూ విడిచిపెట్టేలా లేదు. వరుణుడు కరుణిస్తే మాత్రం ఈ రసవత్తర పోరుతో ప్రపంచకప్‌ వేడెక్కడం ఖాయం!

భారత్‌, పాకిస్థాన్‌ యుద్ధానికి సర్వం సిద్ధం! కానీ ఇక్కడ తుపాకులుండవు, యుద్ధ విమానాలుండవు! బ్యాటు, బంతి.. ఇవే ఆయుధాలు! ఈ పోరు సాగేది ఇరు దేశాల సరిహద్దుల్లో కాదు.. ఇంగ్లిష్‌ గడ్డపై! భారతీయులు, పాకిస్థానీలు మాత్రమే కాదు.. క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా చూసే సమరం ఇది! అసలే ప్రపంచకప్‌.. ఆపై భారత్‌-పాక్‌ పోరంటే ఏ క్రికెట్‌ అభిమాని అయినా ఎలా విడిచిపెడతాడు? ఆ మాటకొస్తే క్రికెట్‌ అంటే ఆసక్తి లేని వాళ్లు సైతం ఓ కన్నేసే మ్యాచ్‌ ఇది. ఆశించిన స్థాయిలో ఉత్కంఠభరిత పోరాటాలు లేక.. వర్షం వల్ల ఏకంగా నాలుగు మ్యాచ్‌లు రద్దయి.. అసలు ప్రపంచకప్‌ జరుగుతున్న భావనే లేని తరుణంలో.. టోర్నీకి ఊపు తెచ్చే పోరు ఇదే ఇదే అవుతుందని అందరి ఆశ! గత కొన్ని నెలల్లో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలుపు ఇరు దేశాల అభిమానులకూ ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రపంచకప్‌లో పాక్‌తో తలపడ్డ ఆరు మ్యాచ్‌ల్లోనూ జయకేతనం ఎగురవేసిన టీమ్‌ఇండియా.. చరిత్రను పునరావృతం చేస్తూ మరోసారి చిరకాల ప్రత్యర్థిని మట్టికరిపించాలని భారత అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. పాక్‌ ఎంతో భీకరంగా ఉన్న రోజుల్లోనూ ప్రపంచకప్‌లో ఆ జట్టుకు తలవంచని భారత్‌.. ప్రస్తుత పాక్‌తో పోలిస్తే బలంగా ఉన్న భారత్‌ సామర్థ్యానికి తగ్గట్లు ఆడితే అజేయ రికార్డును కొనసాగించడం కష్టం కాదు. ఈ మ్యాచ్‌ ఓడితే పాక్‌ సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టమవుతాయి కాబట్టి ఆ జట్టు అంత తేలిగ్గా లొంగకపోవచ్చు. రెండేళ్ల కిందట ఛాంపియన్స్‌ ట్రోఫీ లీగ్‌ దశలో పాక్‌ను చిత్తు చేశాక ఆ జట్టును కొంచెం తేలిగ్గా తీసుకున్న భారత్‌.. ఫైనల్లో చిత్తుగా ఓడింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదివారం కోహ్లీసేన అప్రమత్తంగా ఉండాల్సిందే.

ఆ ఇద్దరిలో ఎవరు?: గాయపడ్డ ధావన్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌.. రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేయడం ఖాయం. నాలుగో స్థానంలో ఎవరన్నది ప్రశ్న. జట్టు వర్గాల సమాచారం ప్రకారం వర్షం వల్ల ఓవర్లు తగ్గితే ధాటిగా ఆడే కార్తీక్‌ను ఎంచుకుంటారట. పూర్తి ఓవర్ల మ్యాచ్‌ అయితే ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను ఆడిస్తారట. మరోవైపు పాక్‌పై మంచి రికార్డున్న షమిని తుది జట్టులోకి తెచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాక్‌ పతనాన్ని శాసించింది అతనే. ప్రస్తుతం ఫామ్‌లో కూడా ఉన్నాడు. కుల్‌దీప్‌ను తప్పించి అతడిని ఆడించొచ్చు.

టాస్‌ గెలిస్తే..: ఛేదనలో తడబడటం పాకిస్థాన్‌కు అలవాటు. టోర్నీలో భారత్‌ చేతిలో ఓడిన ఆరు మ్యాచ్‌ల్లో.. 2003 మినహా ఐదుసార్లూ ఆ జట్టు రెండోసారే బ్యాటింగ్‌ చేసింది. చరిత్రను బట్టి చూస్తే భారత్‌ టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ అప్పగించేయొచ్చు. అయితే ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో వర్ష ప్రభావం నేపథ్యంలో ఆరంభంలో ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కోవడం కష్టం. కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు బౌలింగే ఎంచుకోవచ్చేమో!

వరుణుడా.. ఈ ఒక్కటి వదిలేయ్‌

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే ఏకంగా నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దవడం అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించింది. అయ్యిందేదో అయ్యిందని భారత్‌-పాకిస్థాన్‌ బ్లాక్‌బస్టర్‌ పోరుకు సిద్ధమైయిపోయారు. ఈ మ్యాచ్‌ సజావుగా సాగితే అన్నీ మరిచిపోతారు. కానీ ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రపంచకప్‌కే ఆకర్షణ అయిన ఈ మ్యాచ్‌ కూడా రద్దయితే టోర్నీ కళ తప్పడం ఖాయం. అందుకే ఈ మ్యాచ్‌ జరగాలని ఐసీసీ సైతం ఎంతగానో కోరుకుంటోంది. భారత్‌-పాక్‌ పూర్తిగా 50 ఓవర్ల మ్యాచ్‌లో తలపడితేనే మజా. అలా కుదరక ఓవర్లు కోత పడినా.. కనీసం ఫలితం అయినా వస్తే చాలని ఆశిస్తున్నారు. ఈ ఒక్క మ్యాచ్‌ను వదిలేయాలని వరుణుడిని అందరూ కోరుకుంటున్నారు.

గెలవాలి కానీ.. అలా కాదు

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌లు ఒకప్పుడు ఎంత హోరాహోరీగా సాగేవో తెలిసిందే. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో భీకరంగా ఉన్న పాక్‌ను ఓడిస్తే ఆ మజానే వేరుగా ఉండేది. కానీ గత దశాబ్దంలో కథ మారింది. పాక్‌ అన్ని రకాలుగా బలహీనపడింది. అదే సమయంలో భారత్‌ బలం పెరిగింది. దీంతో ఆ జట్టుతో మ్యాచ్‌లు చాలా వరకు ఏకపక్షం అయ్యాయి. గత రెండు ప్రపంచకప్‌ల్లోనూ పాక్‌ను భారత్‌ సులువుగానే ఓడించింది.2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ లీగ్‌ మ్యాచ్‌లో పాక్‌ను భారత్‌ సులువుగా ఓడిస్తే.. ఫైనల్లో పాక్‌ ఇంకా అలవోకగా నెగ్గింది. ప్రస్తుతం భారత్‌తో పోలిస్తే పాక్‌ బలహీనంగా ఉంది. ప్రపంచకప్‌లో ఆ జట్టుపై భారత్‌ అజేయ రికార్డును కొనసాగించాలని ఆశిస్తున్న అభిమానులు.. ఏకపక్ష మ్యాచ్‌ను మాత్రం కోరుకోవడం లేదు. పాక్‌ నుంచి గట్టి పోటీ కోరుకుంటున్నారు. మ్యాచ్‌ పోటాపోటీగా సాగి, పాక్‌పై భారత్‌ గెలిస్తే అప్పుడుంటుంది మజా!

వారితోనే ముప్పు

పాక్‌ జట్టులో భారత్‌కు ప్రధాన ముప్పు కాగలరని భావిస్తున్న ఆటగాళ్లు నలుగురు.
* 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ఆమిర్‌ భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ఎలా కకావికలు చేశాడో గుర్తుండే ఉంటుంది. ఈ ప్రపంచకప్‌కు చివరి నిమిషంలో ఎంపికైన అతను.. చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. కోహ్లి సహా భారత ప్రధాన బ్యాట్స్‌మెన్‌కు ఆమిర్‌ సవాలు విసరడం ఖాయం.
* 46/5.. 2011 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌పై వాహబ్‌ రియాజ్‌ ప్రదర్శన ఇది. అతను మునుపటి ఫామ్‌లో లేకపోయినా.. మంచి వేగం, కచ్చితత్వం ఉన్న రియాజ్‌.. తనదైన రోజు విజృంభిస్తాడు. పరిస్థితులు పేసర్లకు అనుకూలిస్తే రియాజ్‌ ప్రమాదకరమే.
* ప్రస్తుతం పాకిస్థాన్‌ జట్టులో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌. వన్డేల్లో అతడి సగటు 51 కావడం గమనార్హం. చక్కటి ఫామ్‌లో ఉన్న అజామ్‌.. గత ఆరు వన్డేల్లో రెండు శతకాలు, మూడు అర్ధశతకాలు సాధించాడు. కోహ్లి లాగే మూడో స్థానంలో ఆడే అతడిని త్వరగా ఔట్‌ చేస్తే పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను గట్టి దెబ్బ తీసినట్లే.
* 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ వేగంగా పాక్‌ వైపు మొగ్గడానికి ఫకర్‌ జమానే కారణం. ఆ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో పాక్‌కు ఊహించని స్కోరు అందించాడీ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌. అప్పుడతను బుమ్రాను అలవోకగా ఎదుర్కొన్నాడు. ఈసారి జస్‌ప్రీత్‌ అతడికి కళ్లెం వేయాల్సిందే.

అతి పెద్ద సవాల్‌ అదే..

కీలకమైన పాకిస్థాన్‌ పోరుకు ధావన్‌ దూరమవడం భారత్‌కు పెద్ద దెబ్బే. ధావన్‌ స్థానంలో రోహిత్‌తో జోడీ కడుతున్న రాహుల్‌.. ఇంత ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి. అతడికి, రోహిత్‌కు ఆమిర్‌ పరీక్ష పెట్టడం ఖాయం. బ్యాటింగ్‌లో కోహ్లీనే అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. కీలక మ్యాచ్‌ల్లో అంచనాలకు తగ్గట్లు రాణించే కోహ్లి నుంచి జట్టు సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. మిడిలార్డర్‌ను నిలబెట్టాల్సిన బాధ్యత ధోనీదే. వికెట్‌కీపర్‌గా, వ్యూహకర్తగానూ అతడి పాత్ర  కీలకం. బౌలింగ్‌లో బుమ్రా మీదే అందరి దృష్టీ నిలిచి ఉంది. అతడికి తోడు భువి, షమి కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే పాక్‌ బ్యాటింగ్‌ను దెబ్బ తీయడం కష్టమేమీ కాదు. పాక్‌తో మ్యాచ్‌ అంటే అన్నిటికంటే ఒత్తిడిని జయించడం పెద్ద సవాల్‌. కోహ్లీసేన దీన్నెలా అధిగమిస్తుందో చూడాలి.

పచ్చిక లేదు..

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ వేదికలో పిచ్‌పై ప్రస్తుతం పచ్చికే లేదట. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమంటున్నారు. అయితే మాంచెస్టర్‌లో ప్రస్తుతం వర్షం పడుతుండటంతో పిచ్‌ ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలంగా ఉండొచ్చు.
‘‘ఈ మ్యాచ్‌లో మేం బాగా ఆడినా, ఆడకపోయినా.. ఇక్కడితో ఏదీ ఆగిపోదు. టోర్నీ కొనసాగుతుంది. కాబట్టి విశాల దృక్పథంతో చూడాలి. ఎవరి మీదా అదనపు ఒత్తిడి ఉండదు’’ 

-కోహ్లీ

‘‘పాకిస్థాన్‌ను ఎప్పుడూ అంచనా వేయలేం. అది ప్రమాదకర జట్టు. వాళ్లను ఎంతమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి’’

-సచిన్‌

‘‘భారత్‌ జాగ్రత్తగా ఉండాలి. తామే ఫేవరెట్లం అనుకుని ఈ మ్యాచ్‌లో అడుగు పెట్టకూడదు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ఇలా ఆడే బోల్తా కొట్టింది’’

- గంగూలీ

‘‘కోట్లాది అభిమానులు కన్నార్పకుండా చూసే సమరమిది. మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు గెలుస్తుంది.. ఓడుతుంది. దీన్ని మ్యాచ్‌గానే చూడాలి... యుద్ధంగా కాదు’’

- అక్రమ్‌


 
 
 
 
 
 
 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.