close
పాక్‌ జట్టులో లుకలుకలు?

కరాచి

ప్రపంచకప్‌లో మరోసారి భారత్‌ చేతిలో పరాభవం చవిచూసిన నేపథ్యంలో పాకిస్థాన్‌ జట్టుపై ఆ దేశంలో విమర్శలు వెల్లువెతుతున్నాయి. పాక్‌ ఆటగాళ్లు ఏమాత్రం ప్రణాళిక లేకుండా ఆడారని, వారిలో సానుకూల ధోరణే కనిపించలేదని మాజీలు, అభిమానులు అభిప్రాయపడ్డారు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోవాలన్న కెప్టెన్‌ సర్ఫ్‌రాజ్‌ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ‘‘జట్టు ఎంపిక బాగా లేదు. సరైన ప్రణాళికే లేదు. ఆటలో గెలుపోటములు సహజం. కానీ పోరాడకుండానే తలొగ్గడం దారుణం’’ అని పాక్‌ మాజీ కెప్టెన్‌ వసీమ్‌ అక్రమ్‌ అన్నాడు. ‘‘భారత్‌తో మ్యాచ్‌ అంటే ఎంతో ప్రత్యేకం. ఈ మ్యాచ్‌లో మా కెప్టెన్‌, ఆటగాళ్ల శరీర భాష ఏమాత్రం సానుకూలంగా లేదు. రెండేళ్ల కిందట ఛాంపియన్స్‌ ట్రోఫీలో టాస్‌ గెలిచిన కోహ్లి పాకిస్థాన్‌కు బ్యాటింగ్‌ ఇచ్చి తప్పు చేశాడు. ఇప్పుడు సర్ఫ్‌రాజ్‌ అదే పని చేశాడు’’ అని మరో మాజీ ఆటగాడు మహ్మద్‌ యూసుఫ్‌ పేర్కొన్నాడు. మాజీ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌.. సర్ఫ్‌రాజ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అతడికి బుర్ర లేదని అన్నాడు. మరోవైపు పాకిస్థాన్‌ జట్టులో అంతర్గతంగా లుకలుకలు ఉన్నాయని, సర్ఫ్‌రాజ్‌కు వ్యతిరేకంగా జట్టులో కొందరు ఆటగాళ్లు గ్రూపులు కట్టారని ఆ దేశ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సర్ఫ్‌రాజ్‌ కెప్టెన్‌గా ఉండటమే వీరికి ఇష్టం లేదని.. భారత్‌తో మ్యాచ్‌లో సర్ఫ్‌రాజ్‌ ఔటై డ్రెస్సింగ్‌ రూంకు వచ్చిన అనంతరం ఆ ఆటగాళ్లపై చిందులు తొక్కాడని అందులో పేర్కొన్నారు. మరోవైపు భారత్‌తో మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి తమ ఆటగాళ్లు బయటికి వెళ్లి విందు చేసినట్లుగా వస్తున్న వార్తల్ని పాకిస్థాన్‌ బోర్డు ఖండించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న వీడియోలు పాతవని, శనివారం ఆటగాళ్లు హోటల్‌ గదులకే పరిమితం అయ్యారని పీసీబీ స్పష్టం చేసింది.

భారత్‌ మ్యాచే చివరిదా?

భారత్‌తో మ్యాచ్‌లో ఆడిన తొలి బంతికే ఔటైన షోయబ్‌ మాలిక్‌పై అన్ని వైపులా విమర్శలు వెల్లువెతుతున్నాయి. 37 ఏళ్ల మాలిక్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయడంపైనే ఇంతకుముందు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అతను ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన చేస్తూ వచ్చాడు. అయితే భారత్‌పై మాలిక్‌ రికార్డు బాగున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో అయినా రాణిస్తాడని పాక్‌ అభిమానులు ఆశించారు. కానీ అతను అన్ని రకాలుగా నిరాశ పరిచాడు. ప్రాక్టీస్‌ మీద దృష్టిపెట్టకుండా మ్యాచ్‌కు ముందు సానియాతో కలిసి రెస్టారెంటుకు వెళ్లడంపై వ్యతిరేకత ఎదుర్కొన్న మాలిక్‌.. మ్యాచ్‌లో వైఫల్యంతో మరింతగా విమర్శల పాలవుతున్నాడు. ప్రపంచకప్‌ అనంతరం రిటైరవుతానని మాలిక్‌ ముందే సంకేతాలు ఇచ్చాడు. ఇక టోర్నీలో అతను మరో మ్యాచ్‌ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. భారత్‌తో ఆడిందే మాలిక్‌ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావచ్చు.
సర్ఫ్‌రాజ్‌ అయోమయానికి లోనయ్యాడు. వాహబ్‌ రియాజ్‌ బౌలింగ్‌లో షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో ఫీల్డర్‌ను ఉంచాడు. షాదాబ్‌ఖాన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో ఫీల్డర్‌ను పెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో లెగ్‌ స్పిన్నర్‌కు బంతిపై పట్టు దొరకడం కష్టం. పాక్‌ జట్టులో ఊహాశక్తి కొరవడింది. ఆలోచన విధానంలో  లోపముంది.
- సచిన్‌
‘‘ఒక కెప్టెన్‌ ఇలా బుర్ర లేకుండా ఎలా ఉంటాడో నాకర్థం కావడం లేదు. పాకిస్థాన్‌ ఛేదనలో బలహీనం అని తెలిసి కూడా మొదట ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. మా బలం బౌలింగ్‌. బ్యాటింగ్‌ కాదు. 1999లో మంచి బ్యాట్స్‌మెన్‌ ఉన్నా 227 పరుగుల్ని ఛేదించలేకపోయాం. అలాంటిది టాస్‌  గెలిచిన సర్ఫ్‌రాజ్‌ ఏమాత్రం బుర్ర  వాడకుండా బౌలింగ్‌ తీసుకున్నాడు’’
- షోయబ్‌ అక్తర్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.