close
హై.. హై.. షకిబ్‌ 

అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం 
సెమీస్‌పై పులుల కన్ను

అదే అఫ్గానిస్థాన్‌.. అదే సౌథాంప్టన్‌.. భారత్‌ స్థానంలోకి బంగ్లాదేశ్‌ వచ్చింది. ఈసారి కూడా పిచ్‌ నెమ్మదే. అఫ్గాన్‌ స్పిన్నర్లు మరోసారి  సత్తా చాటారు. కానీ బెదురులేని ఆటతో పెద్ద జట్లను బెంబేలెత్తిస్తున్న బంగ్లాదేశ్‌.. సవాల్‌ను గట్టిగానే కాచుకుంది. బ్యాట్స్‌మెన్‌ పట్టుదలతో ఆడి జట్టుకు మెరుగైన స్కోరు అందిస్తే.. ఆ తర్వాత బౌలర్లు అఫ్గాన్‌ను చుట్టేశారు. ముష్ఫికర్‌ రహీమ్‌ (83; 87 బంతుల్లో 4×4, 1×6) ప్రతికూల పరిస్థితుల్లో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. అర్ధశతకంతో   అతడికి సహకరించిన షకిబ్‌.. బౌలింగ్‌లో విజృంభించి అయిదు వికెట్లు  పడగొట్టడం విశేషం. దీంతో అఫ్గాన్‌కు ఈ ప్రపంచకప్‌లో వరుసగా ఏడో పరాజయం తప్పలేదు. ఈ గెలుపుతో సెమీస్‌పై ఆశలు పెంచుకున్న బంగ్లా.. రేసును మరింత  ఆసక్తికరంగా మార్చింది.

సౌథాంప్టన్‌

ఈ ప్రపంచకప్‌లో గెలిచినా.. ఓడినా.. చక్కటి ప్రదర్శనతో ప్రశంసలందుకుంటున్న బంగ్లాదేశ్‌.. గత మ్యాచ్‌లో భారత్‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేసిన అఫ్గానిస్థాన్‌పై అలవోకగా విజయం సాధించింది. సోమవారం ఆ జట్టు 62 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట ముష్ఫికర్‌ రహీమ్‌, షకిబ్‌ అల్‌హసన్‌ (51 69 బంతుల్లో 1×4) రాణించడంతో బంగ్లా 50 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. ముజీబ్‌ రెహ్మాన్‌ (3/39) గట్టి దెబ్బ తీసినా.. వీళ్లిద్దరి రాణింపుతో బంగ్లా మెరుగైన స్కోరు సాధించింది. అనంతరం షకిబ్‌ (5/29), ముస్తాఫిజుర్‌ (2/32)ల ధాటికి అఫ్గాన్‌ 47 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో గుల్బాదిన్‌ నైబ్‌ (47), షెన్వారి (49) మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడారు. ఓపెనర్లు నైబ్‌, రహ్మత్‌ షా (24)లతో పాటు అస్ఘర్‌ (20), నబి (0), నజీబుల్లా (23)ల వికెట్లను పడగొట్టి అఫ్గాన్‌కు విజయావకాశాలే లేకుండా చేసింది షకిబే. 49 పరుగుల వద్ద తొలి వికెట్‌ పడేవరకే అఫ్గాన్‌ పోటీలో ఉంది. షకిబ్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. టోర్నీలో ఏడు మ్యాచ్‌లాడిన బంగ్లాకిది మూడో విజయం. 7 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.

ఇటు ముజీబ్‌.. అటు ముష్ఫికర్‌!: శనివారం భారత్‌తో అఫ్గానిస్థాన్‌ తలపడ్డ పిచ్‌ మీదే ఈ మ్యాచ్‌ కూడా జరిగింది. నెమ్మదిగా ఉండి స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌ను ముజీబ్‌ రెహ్మాన్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. మూడు కీలక వికెట్లతో బంగ్లాను గట్టి దెబ్బే కొట్టాడతను. అయితే ముజీబ్‌తో పాటు నబి (1/44) కూడా ఇబ్బంది పెట్టినా.. పిచ్‌ సవాలు విసిరినా.. ముష్ఫికర్‌ రహీమ్‌ గొప్ప బ్యాటింగ్‌తో జట్టుకు మంచి స్కోరునందించాడు. ముజీబ్‌ ఆరంభంలోనే లిటన్‌ దాస్‌ (16)ను ఔట్‌ చేసి అఫ్గాన్‌కు శుభారంభాన్నందించాడు. అయితే తమీమ్‌ (36), షకిబ్‌ రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. తమీమ్‌ ఔటయ్యాక షకిబ్‌కు రహీమ్‌ తోడయ్యాడు. పరుగులు అంత సులువుగా రాకపోయినా.. ఈ జోడీ నిలకడగా ఆడింది. అయితే ముజీబ్‌ మరోసారి తన పంజా విసిరాడు. చక్కటి బంతులతో షకిబ్‌, సౌమ్య సర్కార్‌ (3)లను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని బంగ్లాను గట్టి దెబ్బ తీశాడు. దీంతో 143/2 నుంచి బంగ్లా 151/4కు చేరుకుంది. అయితే ముష్ఫికర్‌.. మహ్మదుల్లా (27), మొసాదెెక్‌ (35)లతో భాగస్వామ్యాలు నెలకొల్పి స్కోరును 250 దాటించాడు. ఇదే వేదికలో అఫ్గాన్‌తో మ్యాచ్‌లో భారత్‌ 224 పరుగులే చేసింది. 

ఆగని షకిబ్‌ ఎక్స్‌ప్రెస్‌

2019 ప్రపంచకప్‌పై బలమైన ముద్ర వేస్తున్నాడు బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌హసన్‌. బ్యాటుతో, బంతితో అతడి అద్భుత ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. అలుపెరగకుండా.. ప్రతి మ్యాచ్‌లోనూ రాణిస్తూ అతను ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రపంచకప్‌ చరిత్రలోనే మరే ఆల్‌రౌండర్‌కూ సాధ్యం కాని ప్రదర్శన అతను చేస్తున్నాడు. 7 మ్యాచ్‌ల్లోనే అతను 476 పరుగులు చేయడం విశేషం. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన అతను వార్నర్‌ (447)ను అధిగమించి టోర్నీ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ప్రపంచకప్‌లో మహా మహా బ్యాట్స్‌మెన్‌ ఉండగా.. బంగ్లాదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్‌ ఇలా అగ్రస్థానంలో నిలవడం ఆశ్చర్యకరమే. టోర్నీలో అతడి అత్యల్ప స్కోరు 41. మిగతా ఆరు మ్యాచ్‌ల్లో కనీసం అర్ధశతకం సాధించాడు. మొత్తం షకిబ్‌ రెండు శతకాలు, మూడు అర్ధసెంచరీలు కొట్టడం విశేషం. బౌలింగ్‌లోనూ సత్తా చాటిన అతను 10 వికెట్లు తీసి టాప్‌-10 జాబితాలో ఉన్నాడు.

యువీ తర్వాత అతనే..

ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్‌ బౌలర్‌ షకిబ్‌. ఒక ప్రపంచకప్‌లో సెంచరీ, ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మూడో ఆటగాడు అతడే. కపిల్‌, యువరాజ్‌ ముందున్నారు. ఓ ప్రపంచకప్‌ మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టడంతో పాటు అర్ధసెంచరీ చేసిన ఆటగాళ్లు యువరాజ్‌ (2011), షకిబ్‌ (2019) మాత్రమే.

2

ప్రపంచకప్‌లో వెయ్యికి పైగా పరుగులు, 25కు పైగా వికెట్లు సాధించిన రెండో ఆల్‌రౌండర్‌గా షకిబ్‌ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు సనత్‌ జయసూర్య (1165 పరుగులు, 27 వికెట్లు) మాత్రమే ఈ ఘనత సాధించాడు. షకిబ్‌ ప్రస్తుతం 1016 పరుగులు, 33 వికెట్లతో కొనసాగుతున్నాడు.

3 
ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ సాధించిన మూడు విజయాల్లోనూ షకిబే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: లిటన్‌ దాస్‌ (సి) హస్మతుల్లా (బి) ముజీబ్‌ 16; తమీమ్‌ (బి) నబి 36; షకిబ్‌ ఎల్బీ (బి) ముజీబ్‌ 51; ముష్ఫికర్‌ (సి) నబి (బి) దవ్లత్‌ 83; సౌమ్య సర్కార్‌ ఎల్బీ (బి) ముజీబ్‌ 3; మహ్మదుల్లా (సి) నబి (బి) నైబ్‌ 27; మొసాదెక్‌ (బి) నైబ్‌ 35; సైఫుద్దీన్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 262; 
వికెట్ల పతనం: 1-23, 2-82, 3-143, 4-151, 5-207, 6-251, 7-262; 
బౌలింగ్‌: ముజీబ్‌ రెహ్మాన్‌ 10-0-39-3; దవ్లత్‌ జద్రాన్‌ 9-0-64-1; మహ్మద్‌ నబి 10-0-44-1; గుల్బాదిన్‌ నైబ్‌ 10-1-56-2; రషీద్‌ ఖాన్‌ 10-0-52-0; రెహ్మత్‌ షా 1-0-7-0

అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: నైబ్‌ (సి) లిటన్‌ (బి) షకిబ్‌ 47; రెహ్మత్‌ షా (సి) తమీమ్‌ (బి) షకిబ్‌ 24; హస్మతుల్లా (స్టంప్డ్‌) ముష్ఫికర్‌ (బి) మొసాదెక్‌ 11; అస్ఘర్‌ (సి) షబ్బీర్‌ (బి) షకిబ్‌ 20; నబి (బి) షకిబ్‌ 0; షిన్వారి నాటౌట్‌ 49; ఇక్రమ్‌ రనౌట్‌ 11; నజీబుల్లా (స్టంప్డ్‌) ముష్ఫికర్‌ (బి) షకిబ్‌ 23; రషీద్‌ ఖాన్‌ (సి) మొర్తజా (బి) ముస్తాఫిజుర్‌ 2; దవ్లత్‌ (సి) ముష్ఫికర్‌ (బి) ముస్తాఫిజుర్‌ 0; ముజీబ్‌ (బి) సైఫుద్దీన్‌ 0; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (47 ఓవర్లలో ఆలౌట్‌) 200; 
వికెట్ల పతనం: 1-49, 2-79, 3-104, 4-104, 5-117, 6-132, 7-188, 8-191, 9-195; 
బౌలింగ్‌: మొర్తజా 7-0-37-0; ముస్తాఫిజుర్‌ 8-1-32-2; సైఫుద్దీన్‌ 8-0-33-1; షకిబ్‌ 10-1-29-5; మెహదీ 8-0-37-0; మొసాదెక్‌ 6-0-25-1,

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.