close
కప్పు కొత్త గూటికే

ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌
తోక ముడిచిన కంగారూ
సెమీఫైనల్లో చిత్తు
చెలరేగిన జేసన్‌ రాయ్
విజృంభించిన వోక్స్‌

ఐదు సార్లు గెలిచిన ఆస్ట్రేలియా పోటీలో లేదు.. రెండేసి సార్లు గెలిచిన వెస్టిండీస్‌, భారత్‌లు మిగల్లేదు. చెరోసారి కప్పును ముద్డాడిన శ్రీలంక, పాకిస్థానూ లేవు. ఓ కొత్త ఛాంపియన్‌ రాబోతోంది. ఎన్నడూ తనను అందుకోని జట్టును వరల్డ్‌కప్‌ అక్కున చేర్చుకోబోతోంది. పేరుకు పుట్టిళ్లే అయినా ఏనాడూ ట్రోఫీకి నోచుకోని ఇంగ్లాండ్‌ 2019 ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దశాబ్దాల స్వపాన్ని నెరవేర్చుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. తనలాగే తొలి కప్పు కోసం ఆరాటపడుతున్న న్యూజిలాండ్‌తో ఆదివారం ఫైనల్లో ఇంగ్లాండ్‌ తలపడుతుంది.

అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌తో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఇంగ్లాండ్‌ ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో ఎనిమిది వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌  ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. వోక్స్‌, రషీద్‌, ఆర్చర్‌ బంతితో కంగారూలను చుట్టేస్తే...  విధ్వంసక బ్యాటింగ్‌తో జేసన్‌ రాయ్‌ ఆ జట్టు బౌలింగ్‌ను ఉతికేసి ఇంగ్లాండ్‌ ఛేదనను తేలిక చేశాడు. ఓ ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓడడం ఆస్ట్రేలియాకు ఇదే తొలిసారి. 1992 తర్వాత మెగా టోర్నీలో ఫైనల్లో అడుగుపెట్టడం ఇంగ్లాండ్‌కూ ఇదే మొదటిసారి.

బర్మింగ్‌హామ్‌

ఫేవరెట్‌గా ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌.. తనపై అంచనాలు ఏమాత్రం తప్పు కాదని నిరూపిస్తూ ఫైనల్లో అడుగుపెట్టింది. అన్ని రంగాల్లోనూ అదరగొట్టిన ఆతిథ్య జట్టు గురువారం జగిగిన సెమీఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా కొట్టేసింది. వోక్స్‌ (3/20), రషీద్‌ (3/54), ఆర్చర్‌ (2/32) విజృంభించడంతో మొదట ఆసీస్‌ 49 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. స్టీవెన్‌ స్మిత్‌ (85; 119 బంతుల్లో 6×4), కేరీ (46; 70 బంతుల్లో 4×4) పోరాడారు. జేసన్‌ రాయ్‌ (85; 65 బంతుల్లో 9×4, 5×6) చెలరేగడంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 32.1 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. రూట్‌ (49 నాటౌట్‌; 46 బంతుల్లో 8×4), మోర్గాన్‌ (45 నాటౌట్‌; 39 బంతుల్లో 8×4), బెయిర్‌స్టో (34; 43 బంతుల్లో 5×4) రాణించారు. సంచలన బౌలింగ్‌తో ఆసీస్‌ పతనాన్ని శాసించిన వోక్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

జేసన్‌ ధనాధన్‌.. లక్ష్యం ఉఫ్‌: లక్ష్యం చాలా చిన్నదే. కానీ ఇంగ్లాండ్‌ లాగే ఆరంభంలో చకచకా వికెట్లు పడగొడితే విజయం కోసం ప్రయత్నించడానికి ఆసీస్‌కు ఏమైనా అవకాశం ఉండేది. కానీ ఇంగ్లాండ్‌ ఓపెనర్లు జేసన్‌ రాయ్‌, బెయిర్‌స్టో కంగారూ బౌలర్లకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. అలవోకగా బ్యాటింగ్‌ చేసిన ఈ జంట 10 ఓవర్లలో 50 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌ విజయానికి గట్టి పునాది వేసింది. ఆ తర్వాత రాయ్‌ గేర్‌ మార్చాడు. కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. స్టార్క్‌ ఓవర్లో రెండు ఫోర్లతో రాయ్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఎంతకీ ఓపెనింగ్‌ భాగస్వామ్యం విడిపోకపోవడంతో భిన్నంగా ప్రయత్నిద్దామన్న ఉద్దేశంతో ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌.. 16వ ఓవర్లో పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ స్మిత్‌కు బంతినిచ్చాడు. కానీ అది ఆసీస్‌కు మరింత నష్టమే చేసింది. మరింత విరుచుకుపడ్డ రాయ్‌.. వరుసగా మూడు సిక్స్‌లు కొట్టి స్మిత్‌కు ఘన సన్మానమే చేశాడు. ఓ భారీ సిక్స్‌కు బంతి ఏకంగా మైదానం బయట పడింది. జట్టు స్కోరు 124 వద్ద బెయిర్‌స్టో ఔటయ్యాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రాయ్‌.. 147 వద్ద అంపైర్‌ ధర్మసేన తప్పుడు నిర్ణయానికి క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. అప్పటికే సమీక్షలు అయిపోవడంతో రాయ్‌.. అంపైర్‌ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగాడు. కొద్ది తేడాలో ఇంగ్లాండ్‌ రెండు వికెట్లు కోల్పోయినా ఆ జట్టుపై ఆసీస్‌ ఒత్తిడి తేలేకపోయింది. రూట్‌, కెప్టెన్‌ మోర్గాన్‌ వారికి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. దూకుడుగా ఆడిన ఈ జంట అభేద్యమైన మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చింది.

పోరాడిన స్మిత్‌, కేరీ: ఆస్ట్రేలియా స్కోరు 223. ఆ జట్టు ఆరంభం చూస్తే ఆ మాత్రం స్కోరైనా చేసేట్లు కనపడలేదు. ఇంగ్లాండ్‌ పేసర్ల పదునైన బౌలింగ్‌కు, ముఖ్యంగా వోక్స్‌ ధాటికి బెంబేలెత్తిన ఆ జట్టు 6.1 ఓవర్లలో 14 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు చేజార్చుకుంది. కుప్పకూలేలా కనిపించింది. కానీ స్మిత్‌ అసాధారణ పోరాటంతో జట్టును ఆదుకున్నాడు. ముందు కేరీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన స్మిత్‌.. ఆ తర్వాత మాక్స్‌వెల్‌ (22), స్టార్క్‌ (29) సహకారంతో స్కోరును 200 దాటించాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ పతనం ఆరంభం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. రెండో ఓవర్లో ఆర్చర్‌ ఫుల్‌ లెంగ్త్‌ డెలివరీకి ఫించ్‌ (0) వికెట్ల ముందు దొరికిపోగా. వెంటనే వోక్స్‌ బౌలింగ్‌లో వార్నర్‌ (9) స్లిప్‌లో చిక్కాడు. కాసేపటి తర్వాత హ్యాండ్స్‌కాంబ్‌ (4)ను వోక్స్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ దశలో మరో వికెట్‌ పడి ఉంటే ఆసీస్‌ కుప్పకూలేదే. కానీ పట్టుదలగా నిలిచిన స్మిత్‌.. చక్కటి బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఆర్చర్‌ బౌన్సర్‌కు గడ్డానికి గాయమైనా కేరీ పోరాడాడు. స్మిత్‌కు చక్కని సహాకారాన్నిచ్చాడు. ఇద్దరూ నాలుగో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. 27.1 ఓవర్లలో స్కోరు 117/4. భాగస్వామ్యం బలంగా సాగుతుండడంతో ఆస్ట్రేలియా మంచి స్కోరే చేసేలా కనిపించింది. కానీ రషీద్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఆ జట్టును గట్టి దెబ్బతీశాడు. ముందు కేరీని ఔట్‌ చేయడం ద్వారా ప్రమాదకరంగా మారిన భాగస్వామ్యాన్ని విడదీసిన రషీద్‌.. స్టాయినిస్‌ను ఖాతా తెరవనివ్వలేదు. పోరాటాన్ని కొనసాగించిన స్మిత్‌.. మ్యాక్స్‌వెల్‌తో ఆరో వికెట్‌కు 39, స్టార్క్‌తో ఎనిమిదో వికెట్‌కు 51 పరుగులు జోడించి 48వ ఓవర్లో ఔటయ్యాడు.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) బెయిర్‌స్టో (బి) వోక్స్‌ 9; ఫించ్‌ ఎల్బీ (బి) ఆర్చర్‌ 0; స్మిత్‌ రనౌట్‌ 85; హ్యాండ్స్‌కాంబ్‌ (బి) వోక్స్‌ 4; కేరీ (సి) విన్స్‌ (బి) రషీద్‌ 46; స్టాయినిస్‌ ఎల్బీ (బి) రషీద్‌ 0; మ్యాక్స్‌వెల్‌ (సి) మోర్గాన్‌ (బి) ఆర్చర్‌ 22; కమిన్స్‌ (సి) రూట్‌ (బి) రషీద్‌ 6; స్టార్క్‌ (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 29; బెరెన్‌డార్ఫ్‌ (బి) వుడ్‌ 1; లైయన్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (49 ఓవర్లలో ఆలౌట్‌) 223
వికెట్ల పతనం: 1-4, 2-10, 3-14, 4-117, 5-118, 6-157, 7-166, 8-217, 9-217
బౌలింగ్‌: వోక్స్‌ 8-0-20-3; ఆర్చర్‌ 10-0-32-2; స్టోక్స్‌ 4-0-22-0; వుడ్‌ 9-0-45-1; ప్లంకెట్‌ 8-0-44-0; రషీద్‌ 10-0-54-3

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) కేరీ (బి) కమిన్స్‌ 85; బెయిర్‌స్టో ఎల్బీ (బి) స్టార్క్‌ 34; రూట్‌ నాటౌట్‌ 49; మోర్గాన్‌ నాటౌట్‌ 45; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (32.1 ఓవర్లలో 2 వికెట్లకు) 226
వికెట్ల పతనం: 1-124, 2-147;
బౌలింగ్‌: బెరెన్‌డార్ఫ్‌ 8.1-2-38-0; స్టార్క్‌ 9-0-70-1; కమిన్స్‌ 7-0-34-1; లైయన్‌ 5-0-49-0; స్మిత్‌ 1-0-21-0; స్టాయినిస్‌ 2-0-13-0

‘‘చివరిసారి ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరినప్పుడు నా వయసు ఆరేళ్లు. అప్పుడేం జరిగిందో పెద్దగా గుర్తు లేదు. šఫైనల్‌ మాకు గొప్ప అవకాశం. కప్పు గెలవడమే మా లక్ష్యం’’
- మోర్గాన్‌, ఇంగ్లాండ్‌ కెప్టెన్‌

జేసన్‌పై చర్య!

బంతి బ్యాట్‌కు తాకకున్నా క్యాచ్‌ ఔట్‌ ఇచ్చిన అంపైర్‌ ధర్మసేనపై జేసన్‌ రాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కాసేపు పిచ్‌పై ఉండి నిరసన తెలిపాడు. అతడి చర్య చర్చనీయాంశంగా మారింది. ఫైనల్‌కు ముందు రిఫరీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటాడో..!

4

ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడం ఇంగ్లాండ్‌కు ఇది నాలుగోసారి. ఇంతకుముందు 1979, 1987, 1992లో ఆ జట్టు ఫైనల్‌ చేరింది. ఆ మూడు సార్లూ ఓడిపోయింది

27

ఈ ప్రపంచకప్‌లో ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ పడగొట్టిన వికెట్లు. దీంతో ఒక ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా అతడు రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాకే చెందిన మెక్‌గ్రాత్‌ రికార్డు (26)ను అతడు బద్దలు కొట్టాడు. సెమీస్‌లో బెయిర్‌స్టోను ఔట్‌ చేయడంతో రికార్డు స్టార్క్‌ సొంతమైంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.