close
ఆరు కాదు అయిదే.. 

అంపైర్లు తప్పు చేశారు 
ప్రపంచకప్‌ ఫైనల్లో ‘ఓవర్‌ త్రో’ పరుగులపై మాజీ అంపైర్లు 
లండన్‌

ప్రపంచకప్‌ ఫైనల్లో గప్తిల్‌ ఓవర్‌ త్రోకు అంపైర్లు ఆరు పరుగులు ఇవ్వడం ద్వారా తప్పు చేశారని అంతర్జాతీయ మాజీ అంపైర్లు సైమన్‌ టౌఫెల్‌, హరిహరన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘అంపైర్లు తప్పు చేశారనడంలో సందేహం లేదు. ఆ ఓవర్‌ త్రోకు ఇంగ్లాండ్‌కు ఇవ్వాల్సింది ఐదు పరుగులే.. ఆరు కాదు’’ అని ఐదుసార్లు ఐసీసీ ‘అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు గెలిచిన సైమన్‌ టౌఫెల్‌ అన్నాడు. ‘‘కుమార్‌ ధర్మసేన న్యూజిలాండ్‌ ప్రపంచకప్‌ ఆశలను చిదిమేశాడు. ఆ ఓవర్‌ త్రోకు ఇవ్వాల్సింది 5 పరుగులే’’ అని హరిహరన్‌ చెప్పాడు. ఇంగ్లాండ్‌ ఛేదనలో ఆఖరి ఓవర్లో రెండో పరుగు కోసం పరుగెత్తిన స్టోక్స్‌.. డైవ్‌ చేస్తూ క్రీజులో బ్యాట్‌ పెట్టాడు. ఆ క్రమంలో గప్తిల్‌ త్రో అతడి బ్యాట్‌కు తగలడంతో బంతి బౌండరీ దాటింది. దీంతో అంపైర్లు ఇంగ్లాండ్‌కు మొత్తం ఆరు పరుగులిచ్చారు. 
నిబంధన ఏం చెబుతోంది..: ఐసీసీ నిబంధన 19.8 ఓవర్‌త్రో గురించి వివరిస్తుంది. ‘‘ఫీల్డర్‌ ఓవర్‌ త్రోకు బంతి బౌండరీ దాటితే ఆ పరుగులను ప్రత్యర్థి జట్టుకు ఇస్తారు. ఫీల్డర్‌ త్రో విసిరిన క్షణానికి బ్యాట్స్‌మెన్‌ పూర్తి చేసిన పరుగులు, చేస్తున్న పరుగు (బ్యాట్స్‌మెన్‌ ఒకరిని ఒకరు దాటి ఉంటే)ను కూడా ఆ బౌండరీకి కలుపుతారు’’ అని చెబుతోంది. అయితే రెండో పరుగు కోసం పరుగెత్తిన బ్యాట్స్‌మెన్‌ (స్టోక్స్‌, రషీద్‌) గప్తిల్‌ త్రో విసిరే సమయానికి ఒకరినొకరు దాటలేదని టీవీ రీప్లేలు చెబుతున్నాయి. కానీ ఫీల్డ్‌ అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్‌ మాత్రం ఇంగ్లాండ్‌కు ఆరు (4+2) పరుగులిచ్చేశారు. ‘‘త్రో సమయానికి బ్యాట్స్‌మెన్‌ ఇద్దరు ఒకరినొకరు దాటారా లేదా అన్నది అంపైర్లు రూఢీ చేసుకోవాలి. ఫైనల్లో ఓవర్‌ త్రో విషయానికొస్తే.. ఫీల్డర్‌ త్రో విసిరే సమయానికి బ్యాట్స్‌మెన్‌ (స్టోక్స్‌, రషీద్‌) రెండో పరుగు ఆరంభించారంతే. ఒకరినొకరు దాటలేదు. ఆ రెండో పరుగును ఎట్టిపరిస్థితుల్లోనూ లెక్కలోకి తీసుకోకూడదు. టీవీ అంపైర్‌ను సంప్రదించి నిర్ణయాన్ని మార్చడం స్క్వేర్‌ లెగ్‌ అంపైర్‌ (ఎరాస్మస్‌) బాధ్యత. తర్వాతి బంతికి స్టోక్స్‌ స్ట్రైక్‌ చేయాల్సింది కాదు’’ అని హరిహరన్‌ అన్నాడు. 

ఫైనల్‌ చివరి ఓవర్లో గప్తిల్‌ త్రో.. స్టోక్స్‌ బ్యాట్‌కు తాకాల్సింది కాదు. ఇంకెప్పుడూ ఇలా జరగదనుకుంటున్నా. మ్యాచ్‌పై పట్టు కోసం మా ఆటగాళ్లు ఎంతో కష్టపడ్డారు. కానీ అనుకోకుండా నాలుగు అదనపు పరుగులు రావడంతో నిరాశ చెందారు. మేం ఇంకో 20 పరుగులు చేయాల్సిందేమో. అయినప్పటికీ చేసిన స్కోరుతో పోరాడవచ్చు. పోరాడాం. చాలా విషయాలు మాకు అనుకూలంగా జరగలేదు. అయినప్పటికీ ఇంగ్లాండ్‌ ప్రదర్శన విజయానికి అర్హమైందే.
- విలియమ్సన్‌, కివీస్‌ కెప్టెన్‌

ప్రపంచకప్‌లో కివీస్‌ మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ మాకు అదృష్టం కలిసొచ్చింది కాబట్టే కప్పు దక్కింది. విలియమ్సన్‌, అతని జట్టు పట్ల సానుభూతితో ఉన్నా. ఫైనల్లో స్టోక్స్‌ ఇన్నింగ్స్‌ చూసిన ప్రతి ఒక్కరూ అతడిలా ఆడే ప్రయత్నిస్తారు. అతడికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలం ఈ విజయం.

- మోర్గాన్‌, ఇంగ్లాండ్‌ కెప్టెన్‌

పిల్లలూ.. ఆటలాడకండి. బేకింగ్‌ లేదా ఇంకేదైనా పనిని ఎంచుకోండి. 60 ఏళ్ల వయసులో సంతోషంగా చనిపోండి. వచ్చే దశాబ్దంలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఫైనల్‌ చివరి అరగంట గురించి ఆలోచించకుండా ఉంటేనేమో.

-ట్విటర్లో కివీస్‌ ఆల్‌రౌండర్‌ నీషమ్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.