close
ఈ కప్పే గొప్పా! 

ఈనాడు క్రీడావిభాగం

టీమ్‌ఇండియా గెలిచిన రెండు సహా ఇంతకుముందు 11 ప్రపంచకప్‌లు చూశాం! మన జట్టు గెలిచినపుడు అమితానందానికి, ఉద్వేగానికి గురై ఉండొచ్చు!  కానీ ఒక తటస్థ క్రికెట్‌ ప్రేమికుడిగా చూస్తే ఈ ప్రపంచకప్‌ గురించి జరిగినంత చర్చ ఎప్పుడైనా జరిగిందా..? ఈ టోర్నీ స్థాయిలో మరే కప్‌ అయినా ఉత్కంఠభరితంగా సాగిందా..?బ్యాటుకు, బంతికి మధ్య రసవత్తర సమరాలు.. అన్యూహ విజయాలు.. అనుకోని ఫలితాలు.. అంతుచిక్కని మలుపులు.. లెక్కకు మించిన నాటకీయ పరిణామాలు.. నరాలు తెగే ఉత్కంఠతో అభిమానుల్ని ఊపేసిన ఈ ప్రస్తుత టోర్నీ ప్రపంచకప్పుల్లోకెల్లా ఉత్తమం అన్నది ఇప్పుడు చర్చనీయాంశం! 

ప్రపంచకప్‌ అంటేనే ప్రతి ఆటగాడూ, ప్రతి జట్టూ శక్తివంచన లేకుండా పోరాడే అత్యున్నత వేదిక. అయితే ప్రపంచకప్‌ అనగానే పరుగుల ప్రవాహానికే ఎక్కువగా అలవాటుపడ్డ అభిమానులు ఈ కప్పు భిన్నంగా ఉంటుందని అనుకోలేదు. కప్పుకు ముందు ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ల వన్డే సిరీస్‌ చూశాక విశ్వపోరులో 500 చూస్తామా? అన్న ఆసక్తికర ప్రశ్న తలెత్తింది. కప్పులోకి దిగాక మొదట్లో బ్యాటు పవరు కనిపించింది. అఫ్గానిస్థాన్‌ (397/6), బంగ్లాదేశ్‌ (386/6)లపై ఇంగ్లాండ్‌ భారీస్కోర్లు నమోదు చేసింది. ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ 17 సిక్సర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారీస్కోర్లపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రాను రాను పరిస్థితి మారిపోయింది. క్రమంగా బౌలర్ల పట్టు పెరిగింది. బ్యాటుపైకి బంతి దండెత్తింది. పరుగుల ప్రవాహానికి అడ్డుకట్టపడింది. అయినా ఉత్సాహం తగ్గలేదు. ఉత్కంఠకు కొదవలేదు. సెమీస్‌లో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా ఛేదించలేకపోయింది. ఫైనల్లో కివీస్‌ సాధించిన 241 స్కోరును అందుకోడానికి ఇంగ్లాండ్‌ ఆపసోపాలు పడింది. ఫైనల్లో స్కోర్లు సమమై.. సూపర్‌ ఓవరూ టై అయి.. సగటు అభిమానులు ఉత్కంఠలో ఊగిపోయారు.

అందరిదీ ఈ కప్పు

వరో ఒక బ్యాట్స్‌మనో.. బౌలరో టోర్నీ ఆసాంతం చెలరేగడం ప్రపంచకప్‌లో ఆనవాయితీ. స్టార్‌ ఆటగాళ్లు అద్వితీయ ఆటతో కప్పుపై తమ ముద్ర వేయడం 1975 నుంచి చూస్తున్నదే. వివ్‌ రిచర్డ్స్‌, కపిల్‌దేవ్‌, ఇమ్రాన్‌ఖాన్‌, సచిన్‌ తెందుల్కర్‌, జయసూర్య, రికీ పాంటింగ్‌, మెక్‌గ్రాత్‌, ధోని, యువరాజ్‌.. ఇలా ఎంతోమందిని చూశాం. ఈకప్పు ఒకరో ఇద్దరిదో కాదు.. అందరిదీ. ప్రతి జట్టులో మెరిసిన ఆటగాళ్లెందరో. లెక్కకు మించిన ప్రతిభావంతులు. బ్యాటింగ్‌లో రోహిత్‌శర్మ (648 పరుగులు- భారత్‌), డేవిడ్‌ వార్నర్‌ (647- ఆస్ట్రేలియా), విలియమ్సన్‌ (578- న్యూజిలాండ్‌), రూట్‌ (556- ఇంగ్లాండ్‌), బెయిర్‌స్టో (532- ఇంగ్లాండ్‌), ఫించ్‌ (507- ఆస్ట్రేలియా), బాబర్‌ అజామ్‌ (474- పాకిస్థాన్‌), స్టోక్స్‌ (465- ఇంగ్లాండ్‌), రాయ్‌ (443- ఇంగ్లాండ్‌), కోహ్లి (443- భారత్‌).. బౌలింగ్‌లో స్టార్క్‌ (27 వికెట్లు- ఆస్ట్రేలియా), ఫెర్గూసన్‌ (21- న్యూజిలాండ్‌), ఆర్చర్‌ (20- ఇంగ్లాండ్‌), ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (20- బంగ్లాదేశ్‌), బుమ్రా (18- భారత్‌), వుడ్‌ (18- ఇంగ్లాండ్‌), ఆమిర్‌ (17- పాకిస్థాన్‌), బౌల్ట్‌  (17- న్యూజిలాండ్‌), షమి (14- భారత్‌)తో పాటు మరెంతో మందికి ఈ ప్రపంచకప్‌ చిరస్మరణీయమే. అగ్రశ్రేణి జట్లలో హేమాహేమీ   ఆటగాళ్లు బరిలో ఉన్నా.. బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌హసన్‌ (606 పరుగులు, 11 వికెట్లు) మేటి బ్యాట్స్‌మెన్‌కు దీటైన       ప్రదర్శన చేయడం, బౌలింగ్‌లోనూ సత్తా చాటి అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా నిలవడం ఊహించని విషయం.

దాగుడుమూతలు

ప్రపంచకప్‌లో సంచలనాలు సాధారణం. పసికూనలు ఒకట్రెండు అగ్రశ్రేణి జట్లకు షాకివ్వడం మమూలే. కానీ నాకౌట్‌కు వెళ్లే జట్లపై టోర్నీ మధ్యలోనే అంచనాకు రావొచ్చు. లయతో దూసుకెళ్తున్న జట్లపై స్పష్టతతో ఉండొచ్చు. ఆఖరి వరకు నాకౌట్‌ బెర్తులు తేలని ప్రపంచకప్‌ మాత్రం ముమ్మాటికీ ఇదే. చివరి లీగ్‌ మ్యాచ్‌ దాకా పాయింట్ల పట్టికలో నంబర్‌వన్‌ జట్టేదో తేలనిదీ ఈ కప్పే. కారణం.. వర్షాలు! పరుగుల జోరు.. సెంచరీల హోరుతో సాగిపోతున్న ప్రపంచకప్‌లో అసలు కిక్‌ తెచ్చింది వరుణుడే. ఎండాకాలంలో అనుకోని అతిథిలా విచ్చేసిన వరుణుడు ప్రపంచకప్‌ సమీకరణాల్నే మార్చేశాడు. మ్యాచ్‌లు రద్దవడం.. పిచ్‌లు నెమ్మదించడంతో ఫలితాలు తారుమారయ్యాయి. అనూహ్యంగా పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ సెమీస్‌ రేసులోకొచ్చాయి. ఇంగ్లాండ్‌, కివీస్‌లు వెనుకబడ్డాయి. నాకౌట్‌ చేరేసరికి ఇంగ్లాండ్‌కు ముచ్చెమటలు పట్టగా.. కివీస్‌కు చావుతప్పి కన్ను లొట్టబోయింది. చివరికి అనుకున్న జట్లే సెమీస్‌ చేరినా.. అక్కడి వరకు సాగిన డ్రామా మాత్రం ఉత్కంఠ రేపింది.

స‌రిహ‌ద్దులు చెరిపింది

2007లో టీమ్‌ఇండియా గ్రూపుదశలోనే నిష్క్రమించింది. ఆ తర్వాత భారత అభిమానులు కప్‌ వంకే చూడలేదు. 2015లో సెమీస్‌లో ఓడింది. మరుసటి రోజు నుంచి టీవీలు మూగబోయాయి! ఈసారీ భారత్‌ సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టింది. అయినా అభిమానులు ముఖం చాటేయలేదు. భారత్‌ ఫైనల్‌కు వస్తుందని భావించి 80 శాతం టిక్కెట్లు కొన్న భారత అభిమానులు లార్డ్స్‌కు పోటెత్తారు. అభిమానంతో స్టేడియాన్ని నింపేశారు. ఫైనల్లో ఇంగ్లాండ్‌, కివీస్‌ తలపడుతున్నా.. దేశమంతా అర్ధరాత్రి వరకు టీవీలకు అతుక్కుపోయింది. ఒక్క భారతే కాదు యావత్‌ క్రికెట్‌ ప్రపంచానిదీ అదే పరిస్థితీ! ఏ సంబంధం లేకపోయినా కొందరు ఇంగ్లాండ్‌కు జైకొట్టారు. మరికొందరు కివీస్‌తో కలిశారు. స్టోక్స్‌ వీరోచిత పోరాటాన్ని పొగిడారు. విలియమ్సన్‌ సమర్థ సారథ్యాన్ని మెచ్చుకున్నారు. మోర్గాన్‌ ఆనందాన్ని ఆస్వాదించారు. గప్తిల్‌ బాధను పంచుకున్నారు. ఆఖరి బంతి వరకు ఇంగ్లాండ్‌, కివీస్‌లతో అడుగులో అడుగేశారు. టై మీద టై అవుతుంటే ఉత్కంఠతో ఊగిపోయారు. ఫలితం తేలే వరకు మునివేళ్లపై నిలబడ్డారు. చివరికి అదృష్టం 12వ ఆటగాడి రూపంలో ఇంగ్లాండ్‌ వెన్నంటి నిలువగా.. దురదృష్టం బౌండరీల రూపంలో కివీస్‌కు కప్‌ను దూరం చేసిన క్షణాలను ఏ క్రికెట్‌ అభిమానీ మరువలేడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.