close
కుర్రాళ్లకు పిలుపు

రాహుల్‌ చాహర్‌, సైనిలకు అవకాశం
ధావన్‌, సాహా పునరాగమనం
పాండ్యకు విశ్రాంతి.. కార్తీక్‌పై వేటు
మిడిలార్డర్‌లో శ్రేయస్‌, మనీష్‌
వెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్ల ఎంపిక
ముంబయి

రెండు కొత్త ముఖాలు.. ఇద్దరికి విశ్రాంతి.. ఇద్దరికి ఉద్వాసన ఇదీ టూకీగా వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపికైన భారత జట్ల పరిస్థితి..! పరిమిత ఓవర్ల సిరీస్‌ల నుంచి విశ్రాంతి తీసుకుంటాడని భావించిన కెప్టెన్‌ కోహ్లి అన్ని సిరీస్‌లకూ అందుబాటులో ఉండనున్నాడు. మాజీ కెప్టెన్‌ ధోని గైర్హాజరీలో రిషబ్‌ పంత్‌ అన్ని సిరీస్‌లకు ప్రధాన వికెట్‌ కీపర్‌గా ఎంపికయ్యాడు. రాహుల్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైనిలు టీమ్‌ఇండియా తలుపు తట్టగా.. గాయాల నుంచి కోలుకున్న శిఖర్‌ ధావన్‌, వృద్ధిమాన్‌ సాహా మళ్లీ జట్టులోకి వచ్చారు. బుమ్రాకు వన్డే, టీ20లకు విశ్రాంతినిచ్చి టెస్టులో జట్టులో చోటిచ్చారు. రోహిత్‌ టెస్టు జట్టులోనూ ఉన్నాడు.

వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపిక చేసిన జట్లలో ఊహించినట్లే సెలెక్టర్లు ఎక్కువ మంది కుర్రాళ్లకు చోటు కల్పించారు. మిడిలార్డర్‌ను పటిష్టం చేయడంతో పాటు.. యువ పేసర్లను పరీక్షించేందుకు సిద్ధమయ్యారు. భారత జట్టు మరికొన్ని నెలల పాటు తీరిక లేకుండా ఆడాల్సివున్న నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు విశ్రాంతినిచ్చారు. ఆదివారం ఎమ్మెస్కే ప్రసాద్‌ సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీ టెస్టులు, వన్డే, టీ20లకు వేర్వేరు జట్లను ప్రకటించింది. ఆగస్టు 3న ప్రారంభమయ్యే ఈ పర్యటనలో అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌ కోహ్లినే.

పంతే ప్రధాన వికెట్‌ కీపర్‌

రిటైర్మెంట్‌ ప్రకటన ధోని వ్యక్తిగతమైన అంశమని, ఎప్పుడు ఆటకు వీడ్కోలు పలకాలో అతనికి తెలుసని ప్రసాద్‌ అభిప్రాయపడ్డాడు. ధోని భవితవ్యంపై చాలా ప్రశ్నలు ఎదురైనా అతడు పెద్దగా స్పందించలేదు. ‘‘రిటైర్మెంట్‌ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైంది. ఎప్పుడు ఆటకు వీడ్కోలు పలకాలో ధోని లాంటి దిగ్గజ ఆటగాడికి తెలుసు. అతనే విండీస్‌తో సిరీస్‌ నుంచి వైదొలిగాడు. ఇక ఈ అంశంపై చర్చలు అనవసరం. భవిష్యత్‌ కార్యచరణపై దృష్టి పెట్టడమే మా పని. పంత్‌కు ఎక్కువ అవకాశాలు కల్పించి అతణ్ని ప్రధాన వికెట్‌కీపర్‌గా తీర్చిదిద్దడమే మా ప్రస్తుత ప్రణాళిక. ధోనీకి కూడా ఆ విషయం చెప్పాం’’ అని ప్రసాద్‌ తెలిపాడు. ఒకవేళ ధోని అందుబాటులో ఉంటే అతడిని విండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసేవారా అన్న ప్రశ్నకు.. అందుబాటులో ఉన్నప్పుడు ఆలోచిస్తామని బదులిచ్చాడు. పారామిలటరీ పారాచూట్‌ రెజిమెంట్‌ బెటాలియన్‌లో రెండు నెలలు పనిచేసేందుకు ధోనికి ఆర్మీ అనుమతి లభించినట్టు సమాచారం. 

రాయుడుపై వివక్ష లేదు 

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడుపై ఎలాంటి వివక్ష ప్రదర్శించలేదని టీమ్‌ఇండియా సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ చెప్పాడు. రాయుడిని విస్మరించడంపై స్పష్టత ఇచ్చాడు. ‘‘రాయుడు ఎలాంటి భావోద్వేగాలకు గురయ్యాడో..  సెలక్షన్‌ కమిటీ  అలాంటి భావోద్వేగాలకే గురైంది. ఎంపిక చేసిన ఆటగాడు మంచి ప్రదర్శన కనబరుస్తుంటే ఆనందంగా ఉంటుంది. అదే విధంగా ఓ ఆటగాడు బాధతో నిష్క్రమిస్తే సెలక్షన్‌ కమిటీకీ బాధగానే ఉంటుంది. విజయ్‌ శంకర్‌, రిషబ్‌ పంత్‌, మయాంక్‌ అగర్వాల్‌ ఎంపికలో ఎలాంటి పక్షపాతం లేదు.  జట్టు కూర్పు కారణంగానే రాయుడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేకపోయాం. ధావన్‌ స్థానంలో జట్టు మేనేజ్‌మెంట్‌ ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌ కావాలని కోరడంతో పంత్‌ను ఇంగ్లాండ్‌ రప్పించాం. కేఎల్‌ రాహుల్‌ మైదానంలో గాయపడటంతో ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా మయాంక్‌ను పిలిచాం’’ అని ప్రసాద్‌ వివరించాడు. రాయుడు చేసిన 3డి ట్వీట్‌పై ప్రసాద్‌ స్పందిస్తూ.. ‘‘అది మంచి ట్వీట్‌. సమయోచితంగా ఉంది. ఆ ట్వీట్‌ను ఆస్వాదించా. అతనికి అలాంటి ఆలోచన ఎలా తట్టిందో?’’ అని అన్నాడు. 

అన్న వేగంగా.. తమ్ముడు నెమ్మదిగా 

భారత టీ20 జట్టులో మరో అన్నదమ్ముల జోడీ చోటు సంపాదించింది. చివరిగా హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య భారత జట్టుకు ఆడగా, తాజాగా విండీస్‌ పర్యటనలో ఆడబోయే టీ20 జట్టులో దీపక్‌ చాహర్‌, రాహుల్‌ చాహర్‌ చోటు దక్కించుకున్నారు. అయితే హార్దిక్‌-కృనాల్‌ సొంత అన్నదమ్ములు కాగా.. రాహుల్‌-దీపక్‌ అన్నదమ్ముల పిల్లలు. 26 ఏళ్ల దీపక్‌ ఇప్పటికే భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. 2018లో అఫ్గానిస్థాన్‌పై అతను తన తొలి వన్డే ఆడాడు. అదే ఏడాది ఇంగ్లాండ్‌పై ఒక టీ20లోనూ బరిలో దిగాడు. అన్న లానే 19 ఏళ్ల రాహుల్‌ చాహర్‌ కూడా ఐపీఎల్‌లో సత్తా చాటే భారత జట్టు తలుపు తట్టాడు. ఈసారి ముంబయి ఇండియన్స్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ లెగ్‌స్పిన్నర్‌.. 13 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌-ఎతో సిరీస్‌లో భారత్‌-ఎ తరఫున ఆడుతున్న రాహుల్‌ తొలి రెండు వన్డేల్లో 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. 

సాహా వచ్చాడు

టెస్టు జట్టులో ప్రధాన మార్పు వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా పునరాగమనం. అయితే అతను రిషబ్‌ పంత్‌కు బ్యాక్‌ అప్‌ కీపర్‌గా ఉంటాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా తిరిగి జట్టులోకొచ్చాడు. సాహా, అశ్విన్‌లు 2018లో ఆఖరిగా టెస్టు ఆడారు. వన్డే, టీ20 జట్టులో లేని బుమ్రా టెస్టుల్లో ఆడనున్నాడు. టెస్టు జట్టు ఎంపికలో రిషబ్‌తో పాటు సాహా, కేఎస్‌ భరత్‌ పేర్లూ చర్చకు వచ్చాయి. రిషబ్‌, సాహాలకే సెలక్టర్లు ఓటు వేశారు. ఓపెనర్‌ మురళీ విజయ్‌ జట్టులో చోటు కోల్పోగా.. హనుమ విహారి, చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ‘‘భారత్‌-ఎ జట్టులో ఆటగాళ్ల ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకున్నాం. కేఎస్‌ భరత్‌ (ఆంధ్ర) ఎంపికకు చాలా దగ్గరగా వచ్చాడు. అయితే గాయపడిన ఆటగాడికి నిరూపించుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో సాహాను జట్టులో చేర్చాం’’ అని ఎమ్మెస్కే చెప్పాడు.

టెస్టు జట్టు
కోహ్లి (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, పుజారా, రహానె (వైస్‌ కెప్టెన్‌), విహారి, రోహిత్‌, పంత్‌, సాహా, అశ్విన్‌, జడేజా, షమి, ఇషాంత్‌, కుల్‌దీప్‌, బుమ్రా, ఉమేశ్‌

వాళ్లిద్దరే కొత్త

వన్డే, టీ20 జట్లలో దిల్లీ పేసర్‌ నవ్‌దీప్‌ సైని, రాజస్థాన్‌ లెగ్‌స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌లే కొత్త ముఖాలు. టీ20 జట్టులో రాహుల్‌ సోదరుడు దీపక్‌కు కూడా చోటు దక్కడం మరో విశేషం. శ్రేయస్‌, మనీష్‌, ఖలీల్‌ అహ్మద్‌ తిరిగి వన్డే జట్టులోకి రాగా, దినేశ్‌ కార్తీక్‌పై వేటు పడింది. ధావన్‌ తిరిగి జట్టులో చోటు దక్కించుకోగా, గాయంతో బాధపడుతున్న విజయ్‌శంకర్‌, పృథ్వీషాలను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. 

మిడిలార్డర్‌లో వారిద్దరు: వన్డేల్లో మిడిలార్డర్‌ సమస్యలను తీర్చడానికి అనుభవజ్ఞుడు మనీష్‌ పాండేతో పాటు కుర్రాడు శ్రేయస్‌ అయ్యర్‌ను జట్టులో చేర్చింది. గతంలో వీళ్లిద్దరికి వన్డేలు ఆడిన అనుభవం ఉంది. 2015లో అరంగేట్రం చేసిన పాండే 23 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం విండీస్‌లో భారత్‌-ఎ తరఫున ఆడుతూ 4 వన్డేల్లో 155 పరుగులు చేశాడు. మరోవైపు 2017లో అరంగేట్రం చేసిన శ్రేయస్‌.. 6 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో దిల్లీ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్‌.. బ్యాట్స్‌మెన్‌గా 16 మ్యాచ్‌ల్లో 463 పరుగులు చేశాడు. 

టీ20 జట్టు
కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌, మనీష్‌ పాండే, పంత్‌, కృనాల్‌, జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైని.

వన్డే జట్టు
కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, పంత్‌, జడేజా, కుల్‌దీప్‌, చాహల్‌, జాదవ్‌, షమి, భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవ్‌దీప్‌ సైని.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.