close
భారత్‌ పైచేయి

విజృంభించిన ఇషాంత్
విండీస్‌ 222 ఆలౌట్‌
రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 111/3
ఆంటిగ్వా

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్‌ పైచేయి సాధిస్తోంది. ఇషాంత్‌శర్మ (5/43) విజృంభించడంతో ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్‌ చేసి 75 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. కడపటి వార్తలందే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 42 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (16) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. రాహుల్‌ (38; 85 బంతుల్లో 4×4), పుజారా (25; 53 బంతుల్లో 1×4) పట్టుదలతో ఆడారు. అయితే వీళ్లిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటవడంతో బారత్‌ ఇబ్బందుల్లో పడింది. కెప్టెన్‌ కోహ్లి (20 బ్యాటింగ్‌), రహానె (12 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. 7 వికెట్లు చేతిలో ఉన్న టీమ్‌ఇండియా.. 186 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఆఖరి సెషన్లో ఐదు వికెట్లు: వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌ బౌలింగే హైలైట్‌.. రెండో రోజు టీ విరామానికి 82/3తో నిలిచిన ఆ జట్టు ఆట ఆఖరుకు 179/8కి పరిమితం అయిందంటే కారణం లంబూనే. పదునైన పేస్‌ బౌలింగ్‌తో విండీస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఇషాంత్‌.. క్రమం తప్పకుండా వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. ఒక దశలో వెస్టిండీస్‌ 130/4తో ఫర్వాలేదనిపించినా ఇషాంత్‌ విజృంభణతో కుప్పకూలింది. ముందుగా కుదురుకున్న చేజ్‌ (48)ను ఔట్‌ చేసిన ఇషాంత్‌.. ఆ తర్వాత చక్కటి ఔట్‌ స్వింగర్‌తో హోప్‌ (24)ను పెవిలియన్‌ చేర్చాడు. హెట్‌మయర్‌ (35), హోల్డర్‌ (39) నిలవడంతో విండీస్‌ 174/5తో కోలుకున్నట్లు కనిపించింది. అయితే మెరుపు రిటర్న్‌ క్యాచ్‌తో హెట్‌మయర్‌ను ఔట్‌ చేసిన ఇషాంత్‌.. ఆ తర్వాత రోచ్‌ (0)ను కూడా పెవిలియన్‌ పంపడంతో రెండో రోజును విండీస్‌ 179/8తో ముగించింది. మూడోరోజు ఉదయం కమిన్స్‌ (43 బంతుల్లో 0) అండతో హోల్డర్‌ పోరాడాడు. ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో షమి పదునైన బంతితో హోల్డర్‌ను పెవిలియన్‌ చేర్చాడు. కమిన్స్‌ను జడేజా బౌల్డ్‌ చేయడంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. మూడో రోజు ఉదయం కరీబియన్‌ జట్టు.. 33 పరుగులు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్‌తో పాటు షమి (2/48), జడేజా (2/64) రాణించారు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 297; వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (సి) అండ్‌ (బి) ఇషాంత్‌ 14; క్యాంప్‌బెల్‌ (బి) షమి 23; బ్రూక్స్‌ (సి) రహానె (బి) జడేజా 11; డారెన్‌ బ్రావో ఎల్బీ (బి) బుమ్రా 18; చేజ్‌ (సి) రాహుల్‌ (బి) ఇషాంత్‌ 48; హోప్‌ (సి) పంత్‌ (బి) ఇషాంత్‌ 24; హెట్‌మయర్‌ (సి) అండ్‌ (బి) ఇషాంత్‌ 35; హోల్డర్‌ (సి) పంత్‌ (బి) షమి 39; రోచ్‌ (సి) కోహ్లి (బి) ఇషాంత్‌ 0; కమిన్స్‌ (బి) జడేజా 0; గాబ్రియల్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (74.2 ఓవర్లలో ఆలౌట్‌) 222; వికెట్ల పతనం: 1-36, 2-48, 3-50, 4-88, 5-130, 6-174, 7-179, 8-179, 9-220; బౌలింగ్‌: ఇషాంత్‌శర్మ 17-5-43-5; బుమ్రా 18-4-55-1; షమి 17-3-48-2; జడేజా 20.2-4-64-2; విహారి 2-0-7-0

1

టెస్టులో వేగంగా 50 వికెట్లు పడగొట్టిన భారత పేసర్‌గా బుమ్రా (11 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తం మీద వేగంగా ఈ మైలురాయి దాటిన భారత బౌలర్లలో అతనిది మూడో స్థానం. ఈ జాబితాలో అశ్విన్‌ (9 మ్యాచ్‌లు) ముందున్నాడు. 

‘‘వర్షం పడిన తర్వాత బంతి స్వింగ్‌ కాలేదు. కానీ పిచ్‌పై బౌన్స్‌ మాత్రం ఉంది. ఈ స్థితిలో క్రాస్‌ సీమ్‌కు ప్రయత్నించమని బుమ్రా సలహా ఇచ్చాడు. అతని సలహాను పాటించి ఫలితం పొందా’’

- ఇషాంత్‌ 

9

టెస్టుల్లో 5 వికెట్లు తీయడం ఇషాంత్‌కు ఇది తొమ్మిదోసారి

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.