close
యాషెస్‌ సమం

ఆఖరి టెస్టులో ఆసీస్‌పై ఇంగ్లాండ్‌ ఘనవిజయం
విజృంభించిన బ్రాడ్‌, లీచ్‌
వేడ్‌ సెంచరీ వృథా
లండన్‌

ఆతిథ్య ఇంగ్లాండ్‌కు ఊరట. ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శించిన ఐదు మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌ను ఆ జట్టు 2-2తో సమం చేసింది. చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ 135 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 399 పరుగుల భారీ లక్ష్యంతో నాలుగో రోజు, ఆదివారం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 263 పరుగులకు ఆలౌటైంది. బ్రాడ్‌ (4/62), లీచ్‌ (4/49), రూట్‌ (2/26) ఆసీస్‌ పతనాన్ని శాసించారు. మాథ్యూ వేడ్‌ (117; 166 బంతుల్లో 167×4, 1×6) పోరాడినా ఫలితం లేకపోయింది. సిరీస్‌లో అదిరే ప్రదర్శన చేసిన స్టీవ్‌ స్మిత్‌.. చివరి ఇన్నింగ్స్‌లో 23 పరుగులకే ఔటయ్యాడు. జోఫ్రా ఆర్చర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. బెన్‌ స్టోక్స్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డును అందుకున్నాడు.

ఓవర్‌నైట్‌ స్కోరు 313/8తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ మరో 16 పరుగులు జోడించి ఆలౌటైంది. భారీ ఛేదనలో ఆస్ట్రేలియాకు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 29 పరుగులకే ఓపెనర్లు హారిస్‌ (9), వార్నర్‌ (11)లు ఇద్దరినీ బ్రాడ్‌ వెనక్కి పంపాడు. 56 వద్ద లబుషేన్‌ (14)ను స్నిన్నర్‌ లీచ్‌ ఔట్‌ చేశాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న స్మిత్‌ కూడా ఈసారి జట్టును ఆదుకోలేకపోయాడ[ు. బ్రాడ్‌ అతణ్ని ఎక్కువసేపు నిలువనివ్వలేదు. 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఆసీస్‌ చిక్కుల్లో పడింది. కానీ మాథ్యూ వేడ్‌ గొప్పగా పోరాడాడు. మిచెల్‌ మార్ష్‌ (24)తో ఐదో వికెట్‌కు 63, పైన్‌ (21) ఆరో వికెట్‌కు 52, కమిన్స్‌ (9)తో ఏడో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. ఆ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఓ దశలో ఆస్ట్రేలియా 260/7తో నిలిచింది. మ్యాచ్‌ను కాస్త ఆసక్తికరంగా మార్చింది. కానీ మూడు పరుగుల వ్యవధిలో వేడ్‌ సహా మూడు వికెట్లు చేజార్చుకుని ఓటమి చవిచూసింది. సిరీస్‌ డ్రాగా ముగిసినా.. గత యాషెస్‌ సిరీస్‌ విజేత అయిన ఆస్ట్రేలియా వద్దే ట్రోఫీ ఉంటుంది.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 294;
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 225;

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 329;
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 263 (స్మిత్‌ 23, వేడ్‌ 117, మిచెల్‌ మార్ష్‌ 24, పైన్‌ 21; బ్రాడ్‌ 4/62, లీచ్‌   4/49, రూట్‌ 2/26)

స్మిత్‌ @ 110.57


టాంపరింగ్‌ వివాదంతో ఏడాదిపాటు ఆటకు దూరమైన ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ పునరాగమనంలో తొలి సిరీస్‌లోనే అద్భుత ప్రదర్శన చేశాడు. అంతకుమించి గౌరవాన్ని సంపాదించుకున్నాడు. ప్రపంచకప్‌లో, ఆ తర్వాత యాషెస్‌ సిరీస్‌లోనూ అతణ్ని ఎగతాళి చేసిన ఇంగ్లిష్‌ అభిమానులు ఆదివారం ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు ఔటై వెళ్లిపోతుంటే లేచి నిలబడి చప్పట్లు చరుస్తూ అతణ్ని అభినందించారు. ఐదు టెస్టులో ఈ యాషెస్‌ సిరీస్‌లో స్మిత్‌ పరుగుల వరదపారించాడు. గాయంతో ఒక టెస్టుకు దూరమైనప్పటికీ సిరీస్‌లో 110.57 సగటుతో 774 పరుగులు చేశాడు. సిరీస్‌లో ఆఖరి ఇన్నింగ్స్‌లో తప్ప ప్రతి ఇన్నింగ్స్‌లోనూ అతడు కనీసం అర్ధ శతకం చేశాడు. 144, 142, 92, 211, 92, 80, 23.. సిరీస్‌లో అతడి స్కోర్లు. బ్రయాన్‌ లారా (778, 1994) తర్వాత ఓ సిరీస్‌లో ఓ బ్యాట్స్‌మన్‌ చేసిన అత్యధిక పరుగులివే.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.