close
టైటిళ్లు క్యూ కడుతున్నాయ్‌

బిలియర్డ్స్‌, స్నూకర్‌ చూడటానికి ఒకేలా కనిపించినా.. రెండు వేర్వేరు ఆటలు.. నిబంధనలు వేరు.. పాయింట్ల పద్ధతి వేరు.. అందుకే క్యూ స్పోర్ట్స్‌లోకి వెళ్లే వాళ్లు ఇందులో ఏదో ఒక ఆటనే ఎంచుకుంటారు. కానీ అతను మాత్రం ఆ రెండింటిని ఎంచుకున్నాడు. రెండింట్లో మాస్టర్‌ అయిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 ప్రపంచ టైటిళ్లు సాధించాడు. ప్రపంచ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఘనత ఇది. ఆ ఘనత సాధించిన ఆటగాడు పంకజ్‌ అడ్వాణీ.

ఈనాడు క్రీడావిభాగం

18 ఏళ్ల వయసులో 2003లో తొలిసారి ప్రపంచ అమెచ్యూర్‌ స్నూకర్‌ ఛాంపియన్‌గా నిలిచినప్పటి నుంచి తాజాగా ప్రపంచ బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌ (150 అప్‌)లో మరోసారి విజేతగా అవతరించి రికార్డు స్థాయిలో 22వ టైటిల్‌ అందుకునే దాకా సాగిన అతని ప్రయాణం అనితర సాధ్యం. ప్రపంచంలో మరే ఆటగాడు సొంతం చేసుకోలేని ఘనతలను దక్కించుకొని.. భవిష్యత్‌లో కూడా ఇంకెవరికీ అందని విధంగా శిఖరాగ్రానికి చేరుకున్నాడు. బెంగళూరుకు చెందిన ఈ ఛాంపియన్‌.. పదేళ్ల వయసులో ఆట మొదలెట్టి... ప్రస్తుతం క్యూ స్పోర్ట్స్‌కి చిరునామాగా మారిపోయాడు.

రెండింటిలోనూ: క్యూ క్రీడలైన బిలియర్డ్స్‌, స్నూకర్‌, పూల్‌లో రాణించాలంటే ఏకాగ్రత, నిశిత దృష్టి ఎంతో అవసరం. మిగతా క్రీడాకారులందరూ వీటిలో ఏదో ఒక క్రీడను మాత్రమే ఎంచుకొని ముందుకు సాగుతుంటే.. పంకజ్‌ మాత్రం బిలియర్డ్స్‌, స్నూకర్‌ రెండింట్లోనూ జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ విషయమే అతణ్ని మిగతా ఆటగాళ్ల నుంచి ప్రత్యేకంగా నిలిపింది. చూడడానికి ఒకేలా కనిపించే ఈ రెండు క్రీడల్లో చాలా వ్యత్యాసాలున్నాయి. అందరిలా తాను ఉంటే ప్రత్యేకత ఏమంటుంది? అనుకున్న పంకజ్‌.. రెండింట్లోనూ స్టిక్‌ పట్టాడు. రెండు విభాగాల్లోనూ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పదేళ్ల వయసులో తన అన్న స్ఫూర్తితో తొలిసారి స్నూకర్స్‌ ఆడడం మొదలెట్టిన అతను.. అన్ననే ఓడించి రాష్ట్ర ఛాంపియన్‌గా నిలవడం విశేషం. కెరీర్‌ తొలిదశలోనే ఉత్తమ విజయాలు సాధించడంతో అతని ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ ఆటలో తాను సంచలనాలు నమోదు చేయగలనని అప్పుడే నమ్మాడు. ఆ వయసులోనే బలమైన, తనకంటే మెరుగైన ప్రత్యర్థులను మట్టికరిపించి అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగాడు. ప్రపంచ స్థాయి వేదికల్లో కఠిన సవాళ్లు ఎదురైనా అతను వెనకాడలేదు. పోరాట పటిమ చూపి గెలిచాడు.. మళ్లీ గెలిచాడు.. గెలుస్తూనే ఉన్నాడు. ఒక స్థాయికి చేరుకున్నాక ఇక చాలు అనుకునే ఆటగాళ్లూ ఉంటారు. కానీ అతను మాత్రం ప్రతి ఛాంపియన్‌షిప్‌లోనూ సరికొత్తగా తలపడుతూ.. తన ప్రమాణాలను తానే పెంచుకుంటూ.. ఇతరులెవ్వరూ తన దరిదాపుల్లోకి కూడా రాకుండా.. ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలుస్తున్నాడు. ఇన్ని టైటిళ్లు సాధించినా కూడా అతనికి అలుపన్నదే లేదు. తన విజయాల ఆకలి తీరేది కాదంటూ చెలరేగుతున్నాడు. మరిన్ని టైటిళ్ల కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. మరోవైపు భవిష్యత్‌ ఛాంపియన్లను తయారుచేయడం కోసం క్యూ స్కూల్‌నూ నిర్వహిస్తున్నాడు. దేశంలోనే ఇది తొలి క్యూ స్పోర్ట్స్‌ అకాడమీ.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.