close
వినేశ్‌.. సాధించెన్‌

కాంస్యంతో పాటు ఒలింపిక్స్‌ బెర్త్‌ సొంతం
ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌

పసిడి కల నెరవేరలేదు. కానీ పతక కరవు తీరింది. భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పతకంతో మురిసింది. మూడుసార్లు ఒట్టి చేతుల్తో వెనుదిరిగిన ఈ హరియాణా అమ్మాయి నాలుగో ప్రయత్నంలో అసాధారణ పోరాటంతో కాంస్యాన్ని ముద్దాడింది. టోక్యో ఒలింపిక్స్‌ బెర్తునూ ఖారారు చేసుకుని.. మరో కల సాకారం చేసుకునే దిశగా అడుగేసింది.

నూర్‌ సుల్తాన్‌ (కజకిస్థాన్‌)

ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఎన్నో అంచనాలతో బరిలో దిగిన వినేశ్‌ పట్టు వదలకుండా పతకం కైవసం చేసుకుంది. 53 కేజీల విభాగం కాంస్య పతక పోరులో 4-1 తేడాతో గ్రీస్‌ రెజ్లర్‌ మరియాను ఓడించింది. 2020 ఒలింపిక్స్‌ బెర్తునూ సాధించింది. నిజానికి పోటీ తొలి రోజు ప్రి క్వార్టర్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మయు మకైదా చేతిలో ఓడింది. అయితే మయు ఫైనల్‌ చేరడంతో రెపిచేజ్‌ ఆడే అవకాశం కొట్టేసిన ఆమె.. ఎలాంటి తప్పిదాలకు చోటు ఇవ్వకుండా వరుస బౌట్లలో ప్రత్యర్థుల్ని చిత్తు చేసి కాంస్యం గెలుచుకుంది.

రక్షణాత్మకంగా..:‘అదును చూసి పంజా విసురు..’ ప్రపంచ రెజ్లింగ్‌లో వినేశ్‌ పాటించిన సూత్రం ఇదే. ప్రత్యర్థి దూకుడు ప్రదర్శించినా రక్షణాత్మకంగా ఆడి.. ఆ తర్వాత ఆఖర్లో విరుచుకుపడి ఆమె పతకం గెలిచింది. మరియాతో మ్యాచ్‌ ఆరంభం నుంచి వినేశ్‌ డిఫెన్స్‌పైనే దృష్టి పెట్టింది. అంతలోనే ప్రత్యర్థి ఒక పాయింట్‌ సాధించి ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా వినేశ్‌ పాయింట్లు రాబట్టకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. సరైన సమయం కోసం వేచిచూసిన ఆమె ఒకే పట్టులో ప్రత్యర్థిని పడగొట్టి.. తిరిగి లేవకుండా చేసి.. విజయం సాధించింది. అంతకుముందు రెపిచేజ్‌ తొలి రౌండ్లో 5-0తో యులియా (ఉక్రెయిన్‌)పై, రెండో రౌండ్లో 8-2తో ప్రపంచ నంబర్‌వన్‌ సారా అన్‌ (అమెరికా)పై వినేశ్‌ నెగ్గింది. మరోవైపు పూజ దండ (59 కేజీలు) రెండో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకం గెలిచే దిశగా అడుగులు వేస్తోంది. సెమీస్‌లో లీబోవ్‌ (రష్యా) చేతిలో ఓడిన ఆమె కాంస్యం కోసం పోరాడనుంది. గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె 57 కేజీల విభాగంలో కంచు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. సీమా బిస్లా (50 కేజీలు) రెపిచేజ్‌ రెండో రౌండ్లో 3-11తో ఎకతెరిన (రష్యా) చేతిలో ఓడింది. సరిత (57 కేజీలు), కిరణ్‌ (76 కేజీలు), నవ్‌జోత్‌ కౌర్‌ (65 కేజీలు) టోర్నీ నుంచి నిష్క్రమించారు.

5

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించిన భారత ఐదో మహిళా రెజ్లర్‌ వినేశ్‌. అంతకుముందు అల్కా తోమర్‌ (2006), గీతా ఫొగాట్‌, బబిత ఫొగాట్‌ (2012), పూజ దండ (2018) పతకాలు గెలిచారు.

విలక్షణం.. అదే ఆమె లక్షణం

‘‘వినేశ్‌ ఎప్పుడు ఎలా ఆడుతుంతో అర్థం కాకుండా ఉంది’’.. ‘‘అప్పటి వరకు రక్షణాత్మకంగా ఆడిన తను.. ఒక్కసారిగా ఎదురుదాడి చేసి పడగొడుతోంది’’.. ‘‘ఆమె ఆటతీరును అంచనా వేయలేం’’.. ఇవీ వినేశ్‌తో తలపడిన ప్రపంచ స్థాయి రెజ్లర్లు అంటున్న మాటలు. తన ఆటతీరును గొప్పగా మార్చుకొని.. విలక్షణమైన శైలితో ప్రత్యర్థుల భరతం పడుతున్న వినేశ్‌కు సరిగా సరిపోయే మాటలివి. 50 నుంచి 53 కేజీల విభాగానికి మారిన ఆమె ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకెళ్తోంది. పోలాండ్‌ ఓపెన్‌, యాసర్‌ డోగు, స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి టోర్నీల్లో స్వర్ణాలు సొంతం చేసుకున్న ఆమె.. తాజాగా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యంతో సత్తాచాటింది. ఆమెకు ఈ కాంస్యం అంత సులభంగా దక్కలేదు. ప్రతి అడుగులోనూ ఆమెకు సవాళ్లు ఎదురయ్యాయి. అన్నింటినీ అధిగమించి పతకాన్ని కొల్లగొట్టింది. రెపిచేజ్‌ రౌండ్లో గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ కాంస్య విజేత యులియా, ప్రపంచ నంబర్‌వన్‌ సారా, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మరియాలపై విజయాలు సాధించి ఔరా! అనిపించింది.

అంచనాలకు అందకుండా: బరిలో దిగే ముందు ప్రత్యర్థి ఆటతీరు ఎలా ఉంది? ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తోంది? అని క్రీడాకారులు తెలుసుకోవడం సహజం. కానీ వినేశ్‌ విషయంలో మాత్రం ప్రత్యర్థులకు తిప్పలు తప్పట్లేవ్‌. తన ఆటతీరును అంచనా వేయడంలో వాళ్లు విఫలమౌతూనే ఉన్నారు. మ్యాట్‌పైకి అడుగుపెట్టగానే ఆటగాళ్లు ఎదురుదాడికి దిగేందుకు చూస్తారు. వినేశ్‌ ప్రశాంతంగా పోరును ఆరంభిస్తుంది. డిఫెన్స్‌లో బలంగా ఉంటూ ప్రత్యర్థిని రెచ్చగొడుతుంది. అవకాశం చిక్కిన వెంటనే ఉడుం పట్టుతో చిత్తుచేస్తుంది. ‘‘ఆమె ఓ గొప్ప ప్రత్యర్థి. నేను గౌరవించే అతి తక్కువ మందిలో తను ఒకరు. డిఫెన్స్‌ పరంగా ఆమె అద్భుతం’’ అని వినేశ్‌ చేతిలో ఓడిన ప్రపంచ నంబర్‌వన్‌ సారా తెలిపింది. వినేశ్‌ ఆటలో గొప్పతనం ఏంంటే.. ఎప్పుడూ తన శరీరాన్ని పూర్తి నియంత్రణలో ఉంచుకుంటుంది. ‘‘వినేశ్‌ చూపించే శరీర సమతౌల్యత అమోఘం. ఒక పిల్లిని భవనం పైనుంచి కిందికి విసిరేస్తే అది సురక్షితంగా తన కాళ్ల సాయంతో కిందకు దిగగలదు. ఆమె బ్యాలెన్స్‌ కూడా అలాంటిదే’’ అని భారత కోచ్‌ ఆండ్రూ కుక్‌ అంటాడు. తన విలక్షణమైన శైలి ఆటతీరుతో అగ్రశ్రేణి రెజ్లర్లను షాకిస్తూ దూసుకెళ్తోంది వినేశ్‌. గతేడాది కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో స్వర్ణాలతో సత్తాచాటిన ఆమె.. తాజాగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో మరో ఎత్తుకు చేరింది. ఇక తన ఖాతాలో చేరాల్సింది ఒలింపిక్స్‌ పతకమే.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.