close
అలవోకగా కొట్టేశారు..

రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం
మెరిసిన కోహ్లి

పొట్టి సిరీస్‌లో టీమ్‌ ఇండియా ఘనంగా బోణీ కొట్టింది. రెండో టీ20ని అలవోకగా చేజిక్కించుకుంది. బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మొదట దక్షిణాఫ్రికాకు కళ్లెం వేసిన భారత్‌.. కెప్టెన్‌ కోహ్లి సూపర్‌ ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని అనాయాసంగా ఛేదించింది.

మొహాలి

ల్‌రౌండ్‌ ఆధిపత్యంతో టీమ్‌ ఇండియా అదరగొట్టింది. రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. దీపక్‌ చాహర్‌ (2/22), ఇతర భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు మొదట దక్షిణాఫ్రికా 149/5కే పరిమితమైంది. డికాక్‌ (52; 37 బంతుల్లో 8×4), బవుమా (49; 43 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. విరాట్‌ కోహ్లి (72 నాటౌట్‌; 52 బంతుల్లో 4×4, 3×6), శిఖర్‌ ధావన్‌ (40; 31 బంతుల్లో 4×4, 1×6) సత్తా చాటడంతో లక్ష్యాన్ని భారత్‌ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈ విజయంతో సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది. చివరిదైన మూడో టీ20 22న బెంగళూరులో జరుగుతుంది.

దక్షిణఫ్రికా కట్టడి: కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన భారత బౌలర్లు మొదట దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. కెప్టెన్‌ క్వింటన్‌ డికాక్‌, అరంగేట్ర బ్యాట్స్‌మన్‌ బవుమా రాణించినా సఫారీ జట్టుకు తక్కువ స్కోరుకే సరిపెట్టుకోక తప్పలేదు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు గొప్ప ఆరంభమేమీ దక్కలేదు. దీపక్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ స్వేచ్ఛగా ఆడనివ్వకపోవడంతో ఆ జట్టు 6 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 39 పరుగులు చేసింది. హెండ్రిక్స్‌ను చాహర్‌ ఔట్‌ చేశాడు. ఓపెనర్‌ డికాక్‌కు తోడైన బవుమా బ్యాట్‌ ఝుళిపించడతో దక్షిణాఫ్రికా 10 ఓవర్లకు 78/1తో నిలిచింది. ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ కాస్త ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఆ కొన్ని ఓవర్లలోనే. తర్వాతి ఐదు ఓవర్లలో 32 పరుగులే చేసిన దక్షిణాఫ్రికా రెండు వికెట్లు చేజార్చుకుంది. డికాక్‌ను సైని.. డసెన్‌ (1)ను జడేజా వెనక్కి పంపారు. ఆఖర్లోనూ దక్షిణాఫ్రికా పుంజుకోలేకపోయింది. భారత బౌలర్లు చివరి నాలుగు ఓవర్లలో 27 పరుగులే ఇచ్చి బవుమా, మిల్లర్‌ (18)ను ఔట్‌ చేశారు. దక్షిణాఫ్రికా నిజానికి 149 కంటే కూడా తక్కువ స్కోరు చేసేలా కనిపించింది. కానీ ఫెలుక్వాయో, ప్రిటోరియస్‌ చెరో సిక్స్‌ కొట్టడంతో  సైని వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో 16 పరుగులొచ్చాయి.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: హెండ్రిక్స్‌ (సి) వాషింగ్టన్‌ సుందర్‌ (బి) దీపక్‌ చాహర్‌ 6; డికాక్‌ (సి) కోహ్లి (బి) సైని 52; బవుమా (సి) జడేజా (బి) చాహర్‌ 49; డసెన్‌ (సి) అండ్‌ (బి) జడేజా 1; మిల్లర్‌ (బి) హార్దిక్‌ 18; ప్రిటోరియస్‌ నాటౌట్‌ 10; ఫెలుక్వాయో నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 149;
వికెట్ల పతనం: 1-31, 2-88, 3-90, 4-126, 5-129;
బౌలింగ్‌: వాషింగ్టన్‌ సుందర్‌ 3-0-19-0; చాహర్‌ 4-0-22-2; సైని 4-0-34-1; జడేజా 4-0-31-1; హార్దిక్‌ పాండ్య 4-0-31-1; కృనాల్‌ పాండ్య 1-0-7-0

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ ఎల్బీ (బి) ఫెలుక్వాయో 12; ధావన్‌ (సి) మిల్లర్‌ (బి) శాంసి 40; కోహ్లి నాటౌట్‌ 72; రిషబ్‌ పంత్‌ (సి) శాంసి (బి) ఫోర్టిన్‌ 4; శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌ 16; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (19 ఓవర్లలో 3 వికెట్లకు) 151;
వికెట్ల పతనం: 1-33, 2-94, 3-104;
బౌలింగ్‌: రబాడ 3-0-24-0; నోర్జె 3-0-27-0; ఫెలుక్వాయో 3-0-20-1; ప్రిటోరియస్‌ 3-0-27-0; శాంసి 3-0-19-1; ఫోర్టిన్‌ 4-0-32-1

 

2441 

అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి పరుగులు. రోహిత్‌ (2434) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును కోహ్లి అధిగమించాడు.

కోహ్లి అదరహో...

భారత ఛేదనలో కోహ్లి ఆటే హైలైట్‌. చక్కని టైమింగ్‌, ముచ్చటైన షాట్లతో అలరిస్తూ.. ఇన్నింగ్స్‌ను వెన్నెముకలా నిలచిన అతడు జట్టును సాఫీగా విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్‌ 19వ వరకు సాగినా ఎప్పుడూ భారత్‌ నియంత్రణలోనే ఉంది. కష్టమైందేమీ కాని లక్ష్య ఛేదనలో భారత్‌ ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. నోర్జె బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ రెండు సిక్స్‌లు కొట్టగా.. రబాడ బౌలింగ్‌లో ధావన్‌ రెండు ఫోర్లు దంచాడు. కానీ రోహిత్‌ (12)ను ఫెలుక్వాయో ఎక్కువసేపు నిలువనివ్వలేదు. దక్షిణాఫ్రికాకు ఆ ఆనందం కాసేపే. సూపర్‌ ఫామ్‌ను కొనసాగించిన కోహ్లి.. ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇద్దరూ చురుగ్గా సింగిల్స్‌ తీస్తూ, అప్పుడప్పుడు బంతిని బౌండరీ దాటించడంతో భారత్‌ 10 ఓవర్లకు 79/1తో నిలిచింది. రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించిన ధావన్‌ 12వ ఓవర్లో, కాసేపటికే పంత్‌ (4) ఔటైనా కోహ్లి క్రీజులో ఉండడంతో భారత్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ శ్రేయస్‌ అయ్యర్‌ (16 నాటౌట్‌)తో కలిసి అతడు జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖరి 4 ఓవర్లలో 30 పరుగులు చేయాల్సివుండగా కోహ్లి జోరు పెంచి కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. ఫెలుక్వాయో బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతడు.. రబాడ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన తీరు అద్భుతం. లెగ్‌స్టంప్‌పై పడ్డ బంతిని చక్కని టైమింగ్‌తో ఫ్లిక్‌ చేసి ఆహా అనిపించాడు కోహ్లి. తర్వాత ఫోర్టిన్‌ బౌలింగ్‌లో మరో సిక్స్‌ కొట్టాడు. అయ్యర్‌ ఫోర్‌తో ఛేదన పూర్తయింది. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌ హెచ్చరించినా.. పంత్‌ మరోసారి పేలవ షాట్‌కు నిష్క్రమించడం ఒక్కటే ఈ మ్యాచ్‌లో భారత్‌కు ప్రతికూలాంశం.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.