close
గాయం..ఒక మధుర జ్ఞాపకం కాదు!

వృద్ధిమాన్‌ సాహా.. ఐపీఎల్‌ ఫైనల్లో శతకం బాదిన తొలి ఆటగాడు. 2014 డిసెంబర్‌ నుంచి మూడేళ్ల వరకు టెస్టుల్లో భారత ప్రధాన వికెట్‌ కీపర్‌. ధోనీ టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో ‘మిస్టర్‌ కూల్‌’ స్థానాన్ని పరిపూర్ణంగా భర్తీ చేసిన ఆటగాడు. కానీ, అంతా సజావుగా సాగుతున్న తరుణంలో గాయం అతడి కెరీర్‌ను మలుపుతిప్పింది. ఒక గాయం నుంచి కోలుకున్నాక మరొక గాయం.. తర్వాత ఇంకో గాయం. ఇలా టీమ్‌ఇండియాకు అతడిని దూరం చేసింది. గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులో చోటు సంపాదించిన అతడు ప్రస్తుతం తుదిజట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. పంత్‌, కేఎస్‌ భరత్, సంజు శాంసన్‌ వంటి యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో 34 ఏళ్ల సాహా తిరిగి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడా?

గత మూడేళ్లుగా టీమ్‌ఇండియాను పీడిస్తున్న ప్రధాన సమస్య.. వన్డేల్లో నాలుగో స్థానంలో ఆడగల నాణ్యమైన బ్యాట్స్‌మన్‌. ఎంత మందిని పరీక్షించిన నేటికీ తేలని సరైన ఫలితం. ఈ కారణంగానే ప్రపంచకప్‌ నుంచి భారత్‌ నిష్క్రమించింది. దీని తర్వాత టీమ్‌ఇండియాకు మరో సమస్య ఎదురైంది. టెస్టుల్లో నిలకడగా ఆడే వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌. అసలు ఈ సమస్య 2014లో ఎదురవ్వాల్సింది. కానీ ధోనీ స్థానంలో వచ్చిన సాహా అద్భుతంగా రాణించి జట్టును సమతూకంగా చేశాడు. కానీ, గాయం కారణంగా సాహా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో రిషభ్‌ పంత్‌ వచ్చాడు. తొలి సిరీస్‌లోనే ఇంగ్లాండ్‌ పిచ్‌లపై శతకం బాది పంత్‌ అందరి దృష్టి ఆకర్షించాడు. గాయం నుంచి సాహా కోలుకునేలోపు అతడు జట్టులో ప్రధాన ఆటగాడిగా మారిపోయాడు. దీంతో ప్రధాన వికెట్‌ కీపర్‌ సాహా కాస్త పంత్‌ బ్యాకప్‌ ఆటగాడిగా మారిపోయాడు. కానీ, పంత్‌ నిర్లక్ష్య షాట్లతో పెవిలియన్‌కు చేరుతుండటంతో వికెట్‌ కీపర్‌ సమస్య మొదలైంది.

2014లో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో ధోనీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. అతడి స్థానంలో వచ్చిన సాహా కంగారూల గడ్డపై ఫర్వాలేదనిపించాడు. తర్వాత జరిగిన వెస్టిండీస్ సిరీస్‌లో శతకం, కివీస్‌పై అజేయంగా అర్ధశతకాలు బాదాడు. బంగ్లా, ఆసీస్‌పై కూడా సెంచరీలు చేయడంతో అతడి స్థానం సుస్థిరమైంది. కానీ, 2018 జనవరిలో సఫారీల పర్యటనకు వెళ్లిన అతడికి గాయమైంది. సజావుగా సాగిపోతున్న అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. స్వదేశానికి తిరిగివచ్చిన సాహా జాతీయ క్రికెట్‌ అకాడమీకి (ఎన్‌సీఏ) చికిత్స కోసం వెళ్లాడు. ఎడమ కాలి తొడ కండరాలు, కుడిభుజం నొప్పి గురించి తెలిపాడు. చికిత్స అనంతరం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. 

గాయం నుంచి కోలుకున్న సాహా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగాడు. బంతిని అందుకునే క్రమంలో పలుమార్లు డైవ్‌ చేశాడు. కుడిభుజంపై భారం పడటంతో నొప్పి తిరగబెట్టింది. 5 మ్యాచులకు దూరమయ్యాక మరో మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాడు. కానీ, ఈ మ్యాచ్‌లో అతడి బొటనవేలికి గాయమైంది. శస్త్రచికిత్స చేయించుకుని తిరిగి ఎన్‌సీఏకు చేరాడు. కుడిభుజం నొప్పి మరోసారి రావడంతో వైద్యులు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో సాహాను శస్త్రచికిత్స కోసం బీసీసీఐ ఇంగ్లాండ్‌కు పంపింది. సర్జరీ కోసం అతడు బయలుదేరిన సమయంలోనే భారత జట్టు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. అతడి స్థానంలో వచ్చిన పంత్‌ తన తొలి సిరీస్‌లోనే శతకం బాదాడు.  సాహాకు శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలోనే పంత్‌ టీమ్‌ఇండియా ప్రధాన వికెట్‌  కీపర్‌గా మారిపోయాడు. 

‘గాయాలను కప్పిపుచ్చి సాహాకు ఐపీఎల్‌లో ఆడేందుకు అవకాశం ఇచ్చారా? అతడి గాయాలపై సరైన రీతిలో స్పందించలేదా?’ అని బీసీసీఐపై విమర్శలు వచ్చాయి. ఇంగ్లాండ్‌ పర్యటనకు జట్టును ఎంపిక చేస్తున్న సమయంలో అతడి గాయం గురించి బీసీసీఐ ఎటువంటి వివరాలు తెలుపలేదు. ఆ సమయంలో చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌కు కూడా ఈ విషయం గురించి అవగాహన లేకపోవడం గమనార్హం. అతడి భుజానికి గాయమైతే బొటన వేలి గాయం నుంచి సాహా ఇంకా కోలుకోలేదని ఆయన తెలిపారు. దీంతో బీసీసీఐపై మరోసారి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. స్పందించిన బీసీసీఐ సాహా గాయాల గురించి పూర్తి వివరాలు తెలిపి, శస్త్రచికిత్స కోసం అతడిని మాంచెస్టర్‌కు పంపింది.

గాయాలు తన కెరీర్‌ను మలుపు తిప్పడంతో పాటు అతడి నిర్ణయాలు కూడా భారత జట్టు నుంచి దూరం చేశాయి. అప్పుడే కోలుకుని ఐపీఎల్‌లో డైవ్‌లు చేయడంతో అతడి గాయాలు తిరగబెట్టాయి. పాతగాయాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పడుంటే ప్రస్తుత భారత ప్రధాన వికెట్‌ కీపర్‌గా సాహానే ఉండేవాడేమో! మూడు ఫార్మాట్లలోనూ పంత్‌ ఆడుతుండటంతో అతడికి పనిభారం పెరిగిందని,  ప్రత్యామ్నాయంగా ముగ్గురు వికెట్‌ కీపర్లను సిద్ధం చేస్తున్నామని ఇటీవల ఎమ్మెస్కే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తిరిగి పుంజుకొని టెస్టుల్లో భారత ప్రధాన వికెట్‌ కీపర్‌గా సాహా మారుతాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే! 

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.