close
టెస్టుల్లో ఇన్నాళ్లకు..

రోహిత్‌ తొలి ద్విశతకం
రహానె సెంచరీ
దక్షిణాఫ్రికా9/2
రాంచి టెస్టులో భారత్‌ పైచేయి
రాంచి

వన్డేల్లో డబుల్‌ సెంచరీ అంటే ఓ అద్భుతం. ఆ అద్భుతాన్ని మూడుసార్లు సాధించి చరిత్ర సృష్టించిన వీరుడు రోహిత్‌ శర్మ. టెస్టుల్లో చాలా సాధారణమైన ఈ ఘనతను కెరీర్‌ ఆరంభమైన పుష్కర కాలానికి అందుకున్నాడతను. సుదీర్ఘ ఫార్మాట్లో ఓపెనర్‌ అవతారమెత్తాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న అతను.. మరో భారీ ఇన్నింగ్స్‌ ఆడేశాడు. అతడి ద్విశతకానికి అజింక్య రహానె క్లాస్‌ సెంచరీ తోడవడంతో మూడో టెస్టులో రెండో రోజూ భారత్‌దే పైచేయి అయింది. తొలి ఇన్నింగ్స్‌ను 497/9 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసిన టీమ్‌ఇండియా.. దొరికిన కాస్త సమయంలోనే రెండు వికెట్లు కూల్చి దక్షిణాఫ్రికాను మరింత ఒత్తిడిలోకి నెట్టింది. పిచ్‌ స్పిన్నర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో మూడో రోజు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కు పెను సవాలే.

వన్డేల్లో ఏకంగా మూడు డబుల్‌ సెంచరీలు బాదిన రోహిత్‌శర్మ తొలిసారి టెస్టుల్లో ఆ ఆనందాన్ని చవిచూశాడు. ఇటీవలే ఓపెనర్‌ అవతారమెత్తిన తొలి మ్యాచ్‌లోనే రెండు శతకాలతో రెచ్చిపోయిన రోహిత్‌.. ఇదే సిరీస్‌లో డబుల్‌ సెంచరీ కూడా సాధించాడు. దక్షిణాఫ్రికాతో చివరిదైన మూడో టెస్టులో రోహిత్‌ (212; 255 బంతుల్లో 28×4, 6×6) డబుల్‌ సెంచరీకి, రహానె (115; 192 బంతుల్లో 17×4, 1×6) శతకం తోడవడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 497 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. జడేజా (51), ఉమేశ్‌ యాదవ్‌ (31) కూడా సత్తా చాటారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లిండె (4/133), రబాడ (3/85) రాణించారు. అనంతరం ఇన్నింగ్స్‌ ఆరంభించిన సఫారీ జట్టు ఆట ఆఖరుకు 5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది. ఎల్గర్‌ (0)ను షమి, డికాక్‌ (4)ను ఉమేశ్‌ పెవిలియన్‌ చేర్చారు. హంజా (0), డుప్లెసిస్‌ (1) క్రీజులో ఉన్నారు.

ఆ ఇద్దరి జోరు..: 224/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ను రోహిత్‌ (ఓవర్‌ నైట్‌ 117), రహానె (ఓవర్‌నైట్‌ 83) నడిపించారు. తొలిరోజు కంటే దూకుడుగా ఆడిన రోహిత్‌.. ఎంగిడి, రబాడ బౌలింగ్‌లో మెరుపు కట్‌ షాట్లు కొట్టాడు. రహానె కూడా బ్యాక్‌ఫుట్‌లో అద్భుతమైన షాట్లు ఆడి స్కోరు పెంచాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ 199 బంతుల్లో 150 పరుగుల మైలురాయి అందుకోగా.. నోర్జె బౌలింగ్‌లో సింగిల్‌ తీసిన రహానె 169 బంతుల్లో సెంచరీ సాధించాడు. శతకం అందుకున్న కొద్దిసేపటి తర్వాత లిండె బంతిని కట్‌ చేయబోయిన రహానె.. వికెట్‌కీపర్‌ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో నాలుగో వికెట్‌కు రోహిత్‌-రహానె 267 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

సిక్స్‌తో డబుల్‌: రహానె ఔట్‌ అయినా రోహిత్‌ తగ్గలేదు. జడేజా (51; 119 బంతుల్లో 4×4) అండతో మరింత చెలరేగి ఆడాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజు వదిలి ముందుకొస్తూ స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు. లంచ్‌ సమయానికి భారత్‌ స్కోరు 357/4 కాగా.. రోహిత్‌ స్కోరు 199. అదే స్కోరు వద్ద రబాడ బౌలింగ్‌లో బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో కొద్దిలో బౌల్డ్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్‌.. ఆ తర్వాత ఎంగిడి వేసిన లెంగ్త్‌ బంతిని పుల్‌తో సిక్సర్‌గా మలిచి ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో సెంచరీని కూడా రోహిత్‌ సిక్స్‌తోనే పూర్తి చేసుకోవడం విశేషం. అదే ఓవర్లో మరో సిక్సర్‌ బాదిన రోహిత్‌.. మరో పుల్‌ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. తర్వాత జడేజా.. సాహా (24)తో కలిసి స్కోరు పెంచాడు. అయితే వీళ్లిద్దరినీ లిండె ఔట్‌ చేయడంతో భారత్‌    450/7తో నిలిచింది. ఆపై ఉమేశ్‌  జోరుతో భారత్‌ 500కు చేరువైంది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌ (సి) ఎల్గర్‌ (బి) రబాడ 10;  రోహిత్‌శర్మ (సి) ఎంగిడి (బి) రబాడ 212; పుజారా ఎల్బీ (బి) రబాడ 0; కోహ్లి ఎల్బీ (బి) నోర్జె 12; రహానె (సి) క్లాసెన్‌ (బి) లిండె 115; జడేజా (సి) క్లాసెస్‌ (బి) లిండె 51; సాహా (బి) లిండె 24; అశ్విన్‌ (స్టంప్డ్‌) క్లాసెన్‌ (బి) పీట్‌ 14; ఉమేశ్‌ (సి) క్లాసెన్‌ (బి) లిండె 31; నదీమ్‌ నాటౌట్‌ 1; షమి నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం: (116.3 ఓవర్లలో 9 వికెట్లకు) 497 డిక్లేర్డ్‌; వికెట్ల పతనం: 1-12, 2-16, 3-39, 4-306; 5-370, 6-417, 7-450, 8-464, 9-482; బౌలింగ్‌: రబాడ 23-7-85-3; ఎంగిడి 20-5-83-0; నోర్జె 24.3-5-79-1; లిండె 31-2-133-4; పీట్‌ 18-3-101-1;

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (సి) సాహా (బి) షమి 0; డికాక్‌ (సి) సాహా (బి) ఉమేశ్‌ 4; హంజా బ్యాటింగ్‌ 0; డుప్లెసిస్‌ బ్యాటింగ్‌ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (5 ఓవర్లలో 2 వికెట్లకు) 9; వికెట్ల పతనం: 1-4, 2-8; బౌలింగ్‌: షమి 1-1-0-1; ఉమేశ్‌ 1-0-4-1; నదీమ్‌ 2-2-0-0; జడేజా 1-0-1-0

ఉమేశ్‌ విధ్వంసం

భారత ఇన్నింగ్స్‌కు ఉమేశ్‌ యాదవ్‌ (31; 10 బంతుల్లో 5×6) మెరుపు ముంగిపు ఇచ్చాడు. లిండెనే లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు బాదిన ఈ బౌలర్‌.. అనూహ్యంగా భారత స్కోరు పెంచాడు. కేవలం 10 బంతులే ఎదుర్కొన్న ఉమేశ్‌.. అందులో 5 సిక్సర్లు కొట్టి రాంచి స్టేడియాన్ని ఊపేశాడు. లిండె బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలిచిన ఉమేశ్‌.. ఆ తర్వాత అతను వేసిన ఓవర్లోనే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి బంతిని సిక్సర్‌ కొట్టిన ఉమేశ్‌.. ఆ తర్వాత మూడు, ఐదు బంతులను కూడా స్టాండ్స్‌లోకి పంపాడు. చివరి బంతికి మరో భారీ షాట్‌ కొట్టబోయి ఔటయ్యాడు. ఉమేశ్‌ ఔటైన కాసేపటి తర్వాత కోహ్లి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. భారత పరుగుల వానలో తడిసి అలసిన దక్షిణాఫ్రికా.. ఆదివారం మిగిలిన కాస్త సమయంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. వెలుతురు లేమి కారణంగా ఆట ముందే నిలిచిపోయింది.

నేను రాణించక పోయుంటే...

టెస్ట్‌ ఓపెనర్‌గా రాణించి ఉండకపోతే తనకు వ్యతిరేకంగా చాలా జరిగి ఉండేదని రోహిత్‌ శర్మ వ్యాఖ్యానించాడు. ‘‘నేను ఓపెనర్‌గా రాణించి ఉండకపోతే చాలా జరిగి ఉండేది. మీడియా వాళ్లు నా గురించి చాలా చాలా రాసేవాళ్లు. కాబట్టి నేను వచ్చిన అవకాశాలను కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాల్సిన స్థితి ఏర్పడింది. లేదంటే మీడియా నాకు వ్యతిరేకంగా రాసేది. ఇప్పుడు నా గురించి అందరూ మంచే రాస్తారని నాకు తెలుసు’’ అని రోహిత్‌ అన్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఇప్పటివరకు 520 పరుగులు చేసిన రోహిత్‌.. ఓ సిరీస్‌లో 500పై పరుగులు సాధించిన భారత తొలి ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు.   ‘‘ఓపెనింగ్‌ చేయడం నాకు మంచి అవకాశం. ఓపెనింగ్‌కు సంబంధించి నాకు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు మధ్య చాలా రోజులు చర్చ నడించింది. కాబట్టి ఇన్నింగ్స్‌ ఆరంభించడానికి మానసికంగా నేను సిద్ధంగానే ఉన్నా’’ అని అన్నాడు. తాజా డబుల్‌ సెంచరీ గురించి మాట్లాడుతూ.. ‘‘కఠిన పరిస్థితుల్లో ఈ ఇన్నింగ్స్‌ ఆడాను. ఇంతకుముందు నేను పెద్దగా టెస్ట్‌ క్రికెట్‌ ఆడలేదు. ఈ మ్యాచ్‌లో నాకు కఠిన సవాల్‌ ఎదురైంది’’ అని రోహిత్‌ అన్నాడు. టెస్టు ఓపెనర్‌గా తాను చాలా దూరం ప్రయాణించాల్సివుందని చెప్పాడు. ‘‘నేను ఓపెనర్‌గా మూడు టెస్టులే ఆడాను. చాలా దూరం ప్రయాణించాల్సివుందని నాకు తెలుసు. ఈ మూడు టెస్టుల్లో ప్రదర్శన గురించి మరీ ఎక్కువగా ఆలోచించట్లేదు’’ అని రోహిత్‌ అన్నాడు. ‘‘మ్యాచ్‌లో తొలి బంతి ఆడడం, 30-40 ఓవర్ల తర్వాత బంతిని ఎదుర్కోవడం పూర్తిగా భిన్నమైంది. అయితే టెక్నిక్‌ పరంగా నా ఆటేమీ మారలేదు’’ అని చెప్పాడు.

2

ఒక సిరీస్‌లో ముగ్గురు భారత బ్యాట్స్‌మన్‌ డబుల్‌ సెంచరీలు సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 1955-56లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మూడు డబుల్‌ సెంచరీలు నమోదయ్యాయి.

3

సిరీస్‌లో రోహిత్‌ 100+ స్కోర్లు. ఓ సిరీస్‌లో అత్యధిక శతకాలు సాధించిన భారత ఓపెనర్లలో గావస్కర్‌ (1978లో వెస్టిండీస్‌పై 4) తర్వాతి స్థానం అతడిదే.

4

టెస్టు, వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన నాలుగో బ్యాట్స్‌మన్‌ రోహిత్‌. అతనికన్నా ముందు సచిన్‌, సెహ్వాగ్‌, గేల్‌ ఈ ఘనత సాధించారు.

11

టెస్టుల్లో రహానె సాధించిన శతకాల సంఖ్య. స్వదేశంలో రహానె సెంచరీ చేసి మూడేళ్లు అయింది. చివరిగా 2016లో  దక్షిణాఫ్రికాపైనే అతను శతకం సాధించాడు.

310

ఉమేశ్‌ స్ట్రెక్‌రేట్‌  (10 బంతుల్లో 31 పరుగులు). టెస్టుల్లో 30 అంతకంటే ఎక్కువ పరుగుల్ని వేగంగా సాధించిన బ్యాట్స్‌మన్‌ ఉమేశే.

529

సిరీస్‌లో రోహిత్‌ పరుగులు. ఓ సిరీస్‌లో 500 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన భారత ఓపెనర్లలో అతనిది ఐదో స్థానం. గావస్కర్‌ (774)ది అగ్రస్థానం.

బ్రాడ్‌మన్‌ను దాటేశాడు.. 

ఓపెనర్‌ అవతారంలో పరుగుల వరద పారిస్తున్న రోహిత్‌ శర్మ రికార్డులూ   కొల్లగొడుతున్నాడు. కనీసం పది ఇన్నింగ్స్‌ ఆడిన వారిలో సొంతగడ్డ అత్యధిక సగటు కలిగిన బ్యాట్స్‌మన్‌గా అతడు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. రోహిత్‌ ఇప్పటివరకు 18 ఇన్నింగ్స్‌ల్లో 99.84 సగటుతో 1298 పరుగులు సాధించాడు. బ్రాడ్‌మన్‌ 50 ఇన్నింగ్స్‌ల్లో 98.22 సగటుతో 4322 పరుగులు చేశాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.