close
12 బంతుల్లో..

 లాంఛనం పూర్తి
 మూడో టెస్టులో భారత్‌ ఘనవిజయం
 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌
 ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చిత్తు
రాంచి

కేవలం 12 బంతుల్లో లాంఛనం ముగిసింది. ఆ రెండు వికెట్లను రెండు ఓవర్లలోనే చేజిక్కించుకున్న టీమ్‌ ఇండియా మూడో టెస్టులో ఇన్నింగ్స్‌ 202 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఖాతాలో మరో 40 పాయిట్లు వేసుకున్న భారత్‌.. ఐసీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో తన అగ్రస్థానాన్ని (240 పాయింట్లు) మరింత బలోపేతం చేసుకుంది. కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీకి ఇది 11వ సిరీస్‌ విజయం. స్వదేశంలో భారత్‌కు ఇది వరుసగా 11వ సిరీస్‌. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం టీమ్‌ఇండియాకు ఇదే మొదటిసారి. తాజా సిరీస్‌ టెస్టుల్లో భారత జట్టు తిరుగులేని ఆధిపత్యాన్నే కాదు.. పడిపోతున్న దక్షిణాఫ్రికా క్రికెట్‌ ప్రమాణాలనూ సూచిస్తోంది. షమి (సిరీస్‌లో 13 వికెట్లు) నేతృత్వంలో భారత పేస్‌ దాడిని ఎదుర్కోవడంలో సఫారీ జట్టు పూర్తిగా విఫలమైంది. ఎప్పట్లాగే స్పిన్నర్లు మాయ చేశారు. నాలుగో రోజు దక్షిణాఫ్రికా కథ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఫాలో ఆన్‌ ఆడుతూ ఓవర్‌నైట్‌ స్కోరు 132/8తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ జట్టు మరో పరుగు జోడించి 133 పరుగులకు ఆలౌటైంది. మంగళవారం రెండో ఓవర్లో నదీమ్‌ (2/18) వరుస బంతుల్లో డిబ్రుయిన్‌ (30), ఎంగిడి (0)లను ఔట్‌ చేశాడు. డబుల్‌ సెంచరీ (212) కొట్టిన రోహిత్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును అందుకున్నాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు కూడా అతడికే దక్కింది. భారత జట్టు తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో, రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 497/9 డిక్లేర్డ్‌
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 162
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: 133 (డికాక్‌ 5, ఎల్గర్‌ 16, హంజా 0, డుప్లెసిస్‌ 4, బవుమా 0, క్లాసెన్‌ 5, లిండె 27, పీట్‌ 23, డిబ్రుయిన్‌ 30; షమి 3/10, ఉమేశ్‌ యాదవ్‌ 2/35, నదీమ్‌ 2/18)

‘‘భారత్‌ నిర్దాక్షిణ్యంగా ఆడింది. స్పిన్‌ బౌలింగ్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌.. చివరికి ఫీల్డింగ్‌లోనూ మాపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత జట్టును ఓడించడం చాలా కష్టం’’

- డుప్లెసిస్‌

6

3 లేదా అంతకన్నా ఎక్కువ టెస్టుల సిరీస్‌లో సొంతగడ్డపై భారత్‌కు ఇది ఆరో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.

35

ఈ సిరీస్‌లో భారత బౌలర్లు, దక్షిణాఫ్రికా బౌలర్లు పడగొట్టిన వికెట్ల మధ్య తేడా. ఇంతకన్నా అంతరం ఎక్కువగా ఉన్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లు మూడే ఉన్నాయి. భారత బౌలర్లు 60, దక్షిణాఫ్రికా బౌలర్లు 25 వికెట్లు తీసుకున్నారు.
* వరుసగా రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్‌ ఓటములు చవిచూడడం 1935-36 (ఆస్ట్రేలియాపై) తర్వాత దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి.
* దక్షిణాఫ్రికాపై ఇది (ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడా) భారత్‌కు అతి పెద్ద విజయం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.