close
ఎవరి మార్క్‌ ఎంత?

కోహ్లీసేన ఖాతాలో మరో విజయం. కానీ ఇది ఆషామాషీ గెలుపు కాదు. దక్షిణాఫ్రికాపై తొలి క్లీన్‌స్వీప్‌. ఫాస్ట్‌బౌలింగే బలంగా బరిలోకి దిగే సఫారీ జట్టును అదే ఆయుధంతో దెబ్బ కొట్టడం.. అది కూడా భారత గడ్డపై కావడం.. వాళ్ల పేస్‌ను మన బ్యాట్స్‌మెన్‌ తుత్తునియలు చేయడం.. మూడుకు మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించడం.. అక్కడక్కడా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని విజయవంతంగా అధిగమించడం.. ప్రత్యర్థికి అసలు అవకాశమే లేకుండా చేయడం.. ఇలా ఈ సిరీస్‌ విజయాన్ని ప్రత్యేకంగా నిలిపే అంశాలెన్నో. ఈ మరపురాని విజయంలో జట్టు సమష్టి ప్రదర్శన ఉండటం మరో విశేషం. మరి ఇందులో ఎవరి పాత్ర ఏంటో.. తమ బాధ్యతల్ని ఆటగాళ్లు ఎలా నిర్వర్తించారో.. వారి ప్రదర్శనకు మార్కులేస్తే ఎలా ఉంటుందో చూద్దాం పదండి.

ఈనాడు క్రీడావిభాగం

షమి: 9/10

భారత ఫాస్ట్‌బౌలర్ల గణాంకాలు చూస్తే సిరీస్‌ ఏ దక్షిణాఫ్రికాలోనో, ఇంగ్లాండ్‌లోనో ఆడారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా షమి ప్రదర్శన అమోఘం. 3 మ్యాచ్‌లు.. 13 వికెట్లు.. 14.76 సగటు.. అత్యుత్తమ ప్రదర్శన 5/35.. ఇవీ అతడి గణాంకాలు. విశాఖలో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో షమి నిప్పులు చెరిగాడు. మూడుకు మూడు మ్యాచ్‌ల్లోనూ అతను అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రోహిత్‌: 9/10

ఈ సిరీస్‌కు ముందు భారత జట్టులో అత్యంత ఒత్తిడి ఎదుర్కొంది రోహితే. టెస్టుల్లో నిలదొక్కుకోవడానికి అతడికి దక్కిన ఓపెనర్‌ అవకాశాన్ని ఏమేరకు సద్వినియోగం చేసుకుంటాడో అనుకున్నారంతా. అయితే ఆడిన తొలి మ్యాచ్‌లోనే (విశాఖపట్నం) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదేసి ఔరా అనిపించాడు. ఇక భారత్‌కు పేలవ ఆరంభం దక్కిన రాంచి టెస్టులో.. సంయమనంతో ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడమే కాదు, ఏకంగా డబుల్‌ సెంచరీ కొట్టేశాడు. అనేక రికార్డుల్ని బద్దలు కొడుతూ.. 3 మ్యాచ్‌లు, 4 ఇన్నింగ్స్‌ల్లోనే ఏకంగా 529 పరుగులు (సగటు 132.25) సాధించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ కూడా అందుకున్నాడు. సిరీస్‌లో ఇరు జట్లలో అతనే నంబర్‌వన్‌ ఆటగాడు అనడంలో సందేహం లేదు.

కోహ్లి: 8/10

బ్యాట్స్‌మన్‌గా ఎప్పట్లాగే అబ్బురపరిచిన కోహ్లి కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేయడం ఈ సిరీస్‌ ప్రత్యేకత. పుణెలో అద్భుత బ్యాటింగ్‌ విన్యాసాలతో అభిమానుల్ని ఉర్రూతలూగిస్తూ భారీ డబుల్‌ సెంచరీ (254 నాటౌట్‌) బాదాడు విరాట్‌.  ట్రిపుల్‌ సెంచరీ చేసే అవకాశం తన చేతిలోనే ఉన్నా.. జట్టు ప్రయోజనాలే పరమావధిగా డిక్లేర్‌ చేయడం కెప్టెన్‌గా కోహ్లి నిబద్ధతను చాటింది. ఇక కెప్టెన్‌గా బౌలర్లను ఉపయోగించుకున్న తీరు.. ఫీల్డింగ్‌ ఏర్పాట్లు ప్రశంసలందుకున్నాయి. ఫాలోఆన్‌ ఇవ్వడానికి చాలా జట్లు వెనుకంజ వేస్తున్న తరుణంగా బౌలర్లను నమ్మి చివరి రెండు టెస్టుల్లో ఆ సాహసం చేశాడు. బౌలర్లు చెలరేగేందుకు అనువైన అన్ని పరిస్థితులూ కల్పించాడు. అద్భుత ఫలితాలు రాబట్టాడు. కెప్టెన్‌గా రికార్డు విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

ఉమేశ్‌: 8/10

బుమ్రా గాయపడటంతో అనుకోకుండా జట్టులోకి వచ్చిన ఉమేశ్‌కు తొలి టెస్టులో అవకాశం దక్కలేదు. పుణె పిచ్‌ పేసర్లకు అనుకూలమన్న సంకేతాలతో మూడో పేసర్‌గా అతణ్ని తీసుకున్నారు. ఆ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాణించి 6 వికెట్లు తీసిన అతను.. చివరి టెస్టులోనూ సత్తా చాటాడు. 5 కీలక వికెట్లతో ప్రత్యర్థి గట్టి దెబ్బ తీశాడు. 2 మ్యాచ్‌లు.. 11 వికెట్లు.. 12.18 సగటు.. ఇవీ సిరీస్‌లో ఉమేశ్‌ గణాంకాలు.

జడేజా: 8/10

సిరీస్‌లో ఆల్‌రౌండర్‌ పాత్రకు పూర్తి న్యాయం చేసిన ఆటగాడు రవీంద్ర జడేజా. బౌలింగ్‌లో అతను ప్రధాన స్పిన్నర్‌ అశ్విన్‌కు దీటుగా నిలిచాడు. 30.69 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు. విశాఖ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా పతనంలో జడ్డూ (4/87)ది కీలక పాత్ర. తర్వాతి రెండు టెస్టుల్లోనూ జట్టుకు అవసరమైన సమయాల్లో వికెట్లు పడగొట్టాడు. బ్యాటుతోనూ రాణించి 212 పరుగులు సాధించాడు.

మయాంక్‌: 8/10

ఈ సిరీస్‌కు ముందు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడంకెల స్కోరే అందుకోని మయాంక్‌.. ఆరంభ మ్యాచ్‌లోనే ఏకంగా డబుల్‌ సెంచరీ బాదేశాడు. సిరీస్‌ను భారత్‌ భారీ విజయంతో ఆరంభించడానికి రోహిత్‌తో  కలిసి అతడిచ్చిన ఆరంభమే కారణం. రెండో టెస్టులోనూ అతను సెంచరీ సాధించాడు. 3 మ్యాచ్‌ల్లో 85 సగటుతో 340 పరుగులు చేసి సిరీస్‌లో టాప్‌-2 స్కోరర్‌గా నిలిచాడు.

అశ్విన్‌: 7/10

విదేశీ టెస్టుల్లో తుది జట్టులో అవకాశం దక్కక నెమ్మదిగా అభిమానుల దృష్టి నుంచి పక్కకు వెళ్లిపోతున్న అశ్విన్‌.. ఈ సిరీస్‌తో సత్తా చాటాడు. విశాఖ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే 7 వికెట్లు పడగొట్టాడు. పుణె టెస్టులో అశ్విన్‌ (4/69, 2/45) ఇంకా మెరుగైన ప్రదర్శన చేశాడు. చివరి టెస్టులో విఫలమైనప్పటికీ 3 మ్యాచ్‌ల్లో  15  వికెట్లు పడగొట్టి సిరీస్‌లో అశ్వినే అత్యధిక వికెట్ల వీరుడిగా నిలవడం విశేషం.

రహానె: 6/10

రెండేళ్ల సెంచరీ కరవును తీర్చుకుంటూ వెస్టిండీస్‌ పర్యటనలో మూడంకెల స్కోరును అందుకున్న రహానె.. ప్రస్తుత సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనే చేశాడు. పుణె టెస్టులో కోహ్లికి సహకారమందిస్తూ అర్ధశతకం (59) సాధించిన అతను.. చివరి టెస్టులో జట్టు 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ స్థితిలో విలువైన ఇన్నింగ్స్‌ (115) ఆడాడు. రహానె కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ల్లో ఇదొకటి.  అతను 4 ఇన్నింగ్స్‌లో 72 సగటుతో 216 పరుగులు చేశాడు.

సాహా: 5/10

గాయం నుంచి కోలుకుని చాన్నాళ్ల తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన సీనియర్‌ వికెట్‌ కీపర్‌ సాహా.. పంత్‌ స్థానంలో తనను తుది జట్టులోకి ఎంపిక చేయడం సరైందేనని రుజువు చేశాడు. అతను వికెట్ల వెనుక అద్భుత నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. పుణె టెస్టులో అతడి విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సాహాకు రెండుసార్లు చివర్లో బ్యాటింగ్‌ అవకాశం రాగా..  20+ ప్లస్‌ స్కోర్లతో పర్వాలేదనిపించాడు.

పుజారా: 4/10

గత ఏడాది విదేశాల్లో గోడలా నిలబడి జట్టును రక్షించిన, గెలిపించిన పుజారా.. ఆశ్చర్యకరంగా ఇప్పుడు స్వదేశంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అతను 36.25 సగటుతో 145 పరుగులే చేశాడు. అందులో రెండు అర్ధశతకాలున్నాయి.  భారత్‌ తరఫున మూడు డబుల్‌ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదైన సిరీస్‌లో పుజారా ఒక్కసారీ మూడంకెల స్కోరు అందుకోలేకపోవడం ఆశ్చర్యకరమే.

ఇషాంత్‌: 2/10

ఓవైపు షమి, మరోవైపు ఉమేశ్‌ పిచ్‌లతో సంబంధం లేకుండా అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకోగా.. ఇషాంత్‌ మాత్రం వారిలా మెప్పించలేకపోయాడు. రెండు టెస్టుల్లో రెండే వికెట్లు పడగొట్టాడు. అయితే అవి రెండూ ముఖ్యమైన వికెట్లే. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో బవుమా (18)ను, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మార్‌క్రమ్‌ (0)ను ఔట్‌ చేశాడు.
* చివరి టెస్టుకు అనుకోకుండా అవకాశం దక్కించుకున్న స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌.. అరంగేట్ర టెస్టులో 4 వికెట్లతో పర్వాలేదనిపించాడు. విహారికి విశాఖలో మాత్రమే ఆడే అవకాశం దక్కగా 10 పరుగులే చేశాడు. రిషబ్‌ పంత్‌కు ఒక్క మ్యాచూ ఆడే అవకాశం రాలేదు. మూడో టెస్టులో సాహా గాయపడటంతో ఓ గంట సేపు వికెట్‌కీపింగ్‌ చేశాడంతే. శుభ్‌మన్‌ గిల్‌, కుల్‌దీప్‌లకూ మ్యాచ్‌ ఛాన్స్‌ రాలేదు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.