
అండర్-19 టోర్నీ కోసం రెండు జాబితాల ప్రకటన
ముదిరిన అంతర్గత పోరు
అయోమయంలో క్రికెటర్లు
ఈనాడు, హైదరాబాద్
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో అంతర్గత పోరు పతాక స్థాయికి చేరుకుంది. కొత్తగా ఎన్నికైన హెచ్‌సీఏ ఎపెక్స్ కౌన్సిల్ రెండు వర్గాలుగా చీలిపోయింది. టీమ్ఇండియా మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ ఒకవైపు.. మిగతా వాళ్లంతా మరోవైపు నిలిచి నిర్ణయాలు తీసుకుంటుండటంతో క్రికెట్ సంఘం గందరగోళంగా తయారైంది. తాజాగా అఖిల భారత కూచ్ బెహార్ ట్రోఫీ అండర్-19 క్రికెట్ టోర్నీ కోసం ఎవరికి వారు ప్రాబబుల్స్‌ను ఎంపిక చేయడంతో హైదరాబాద్ క్రికెట్ సంక్షోభంలో చిక్కుకుంది.
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అజహర్‌కు క్రికెట్ నిర్వహణలో సవాళ్లు ఎదురవుతున్నాయి. తానొకటి అనుకుంటే.. ఎపెక్స్ కౌన్సిల్‌లోని మిగతా సభ్యులంతా మరొకటి తలుస్తుండటంతో అంతర్గత పోరు ముదురుతోంది. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి హెచ్‌సీఏ ప్రతినిధి ఎంపిక దగ్గర మొదలైన విభేదాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. బోర్డు ఏజీఎంకు శివలాల్‌యాదవ్‌ను పంపించాలని ఎపెక్స్ కౌన్సిల్‌లోని సభ్యులంతా గట్టిగా పట్టుబట్టినా అజహర్ పట్టించుకోలేదు. స్వయంగా తానే వెళ్తానంటూ భీష్మించిన అజహర్ చివరికి పంతం నెగ్గించుకున్నాడు. క్రికెట్ వ్యవహారాల్లోనూ అజహర్‌కు మిగతా సభ్యులకు మొదట్నుంచీ పొసగడం లేదు. తాజాగా అండర్-19 టోర్నీకి అజహర్, హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్ అధ్యక్షతన జూనియర్ సెలెక్షన్ కమిటీ విడివిడిగా ప్రాబబుల్స్‌ను ఎంపిక చేయడంతో అంతర్గత పోరు కాస్తా బహిర్గతమైంది. ఈనెల 22న కర్ణాటకలో కూచ్ బెహార్ టోర్నీ ప్రారంభంకానుంది. ఈనెల 11న ఉప్పల్ స్టేడియంలో విజయానంద్ అధ్యక్షతన జూనియర్ సెలెక్షన్ కమిటీ సమావేశమైంది. ఛైర్మన్ నోయల్ డేవిడ్.. సెలెక్టర్లు శివాజీయాదవ్, అబ్దుల్ అజీమ్, రాజేశ్‌యాదవ్, వివేక్ జైసింహలు 40 మంది ఆటగాళ్లతో ప్రాబబుల్స్ జాబితాను సిద్ధం చేయగా.. వాళ్లంతా కోచ్ అనిరుధ్సింగ్కు రిపోర్ట్ చేయాలని విజయానంద్ ప్రకటించాడు. విదేశాల్లో ఉన్న అజహర్ ఈ జాబితాపై అసంతృప్తి వ్యక్తంజేశాడు. 30 మంది ఆటగాళ్లతో తానూ ఒక జాబితా పంపించాడు. గౌస్ బాబాను హైదరాబాద్ అండర్-19 జట్టుకు కోచ్‌గా ఎంపిక చేశాడు. ఆటగాళ్లంతా గౌస్ బాబాకు రిపోర్ట్ చేయాలని స్పష్టంచేశాడు.
ఇటు అధ్యక్షుడు.. అటు కార్యదర్శి ఆదేశాల మేరకు హెచ్‌సీఏ సిబ్బంది రెండు జాబితాల్లోని ఆటగాళ్లకు సమాచారం అందించారు. రెండు జాబితాలలో చోటు సంపాదించిన 17 మంది ఆటగాళ్లతో పాటు మిగతా క్రికెటర్లు బుధవారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. రెండు జాబితాలు.. ఇద్దరు కోచ్‌లతో ఉప్పల్ స్టేడియంలో గందరగోళం తలెత్తింది. ఎవరి జాబితా సరైనదో.. ఏ కోచ్ సరైనాడో తెలియక ఆటగాళ్లు అయోమయానికి లోనయ్యారు. స్టేడియంలో హెచ్‌సీఏ పెద్దలంతా ఉన్నా ఏం జరుగుతుందో అర్థంకాక క్రికెటర్ల తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు. మరో 9 రోజుల్లో కూచ్ బెహార్ టోర్నీ ప్రారంభంకానున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ఆటగాళ్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హెచ్‌సీఏ పెద్దలు తమ భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని యువ క్రికెటర్లు ఆవేదన వ్యక్తంజేస్తున్నారు. అజ్జూ సారథ్యంలో కొత్త కార్యవర్గం ఏర్పాటై నెలన్నర రోజులు గడవకముందే హెచ్‌సీఏలో తీవ్ర గందరగోళం తలెత్తడంపై మాజీ క్రికెటర్లు, క్లబ్‌ల కార్యదర్శులు సైతం ఆశ్చర్యం వ్యక్తంజేస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి హెచ్‌సీఏను బయటపడేసి క్రికెట్‌ను గాడినపెట్టాలంటున్నారు. విదేశాల్లో ఉన్న అజహర్‌ను ఈ విషయంపై సంప్రదించే ప్రయత్నం చేయగా అతను అందుబాటులోకి రాలేదు.
సెలెక్టర్లదే సరైన జాబితా
‘‘నా సమక్షంలోనే సెలెక్షన్ కమిటీ సమావేశం జరిగింది. మేమిచ్చిన గణాంకాల ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేశారు. సెలెక్టర్లు ఎంపిక చేసిన జాబితానే సరైనది. నిబంధనల ప్రకారం ఆ జాబితానే చెల్లుతుంది. వేరే జాబితా సంగతి నాకు తెలియదు. కోచ్‌గా అనిరుధ్‌సింగ్ కొనసాగుతున్నాడు. గౌస్ బాబా సేవల్ని మరో రకంగా వాడుకుంటాం’’
- విజయానంద్, హెచ్‌సీఏ కార్యదర్శి
ప్రధానాంశాలు
దేవతార్చన

- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు