close
ఇంకో 120 ఖాయమేనా?

బంగ్లాతో తొలి టెస్టు నేటి నుంచే
కోహ్లీసేనను ఆపడం కష్టమే
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పాయింట్లపై భారత్‌ కన్ను
ఉదయం 9.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో
ఇండోర్‌

32 మ్యాచ్‌లు.. 26 విజయాలు.. 5 డ్రాలు.. ఒకే ఒక్క ఓటమి (అది కూడా ఆస్ట్రేలియా చేతిలో). సొంతగడ్డపై ఆరేళ్లుగా సాగుతున్న టీమ్‌ఇండియా ఆధిపత్యానికి ఈ గణాంకాలే రుజువు. విదేశాల్లోనూ అరుదైన విజయాలు సాధిస్తున్న కోహ్లీసేనకు స్వదేశంలో ఎదురు నిలిచే జట్టే   కనిపించడం లేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మొదలయ్యాక మరింత కసిగా ఆడుతూ ప్రత్యర్థుల్ని కుదేలు చేస్తున్న భారత్‌.. ఇప్పుడు బలం తగ్గి, ఆత్మవిశ్వాసం లోపించిన బంగ్లాదేశ్‌ పని పట్టడానికి సిద్ధమైంది. ముఖాముఖి రికార్డు, బలాబలాలు, ఫామ్‌.. ఎందులో చూసినా రెండు జట్లకూ అసలు పోలికే లేదు. అంచనాల ప్రకారం చూస్తే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ ద్వారా కోహ్లీసేన ఖాతాలో ఇంకో 120 ఛాంపియన్‌షిప్‌ పాయింట్లు చేరడం లాంఛనమే కావాలి. మరి బంగ్లా ఏమైనా అద్భుతాలు చేసి దీనికి అడ్డం పడుతుందా?

టీ20ల్లో బంగ్లాదేశ్‌ విసిరిన సవాల్‌ను కాచుకుని సిరీస్‌ గెలిచిన టీమ్‌ఇండియా.. టెస్టుల్లో ఆ జట్టుకు పెను సవాల్‌ విసిరేందుకు సిద్ధమైంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ గురువారం ఇండోర్‌లో ఆరంభం కానుంది. పొట్టి క్రికెట్లో కాస్త కాలం కలిసొచ్చి ఓ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించిన బంగ్లా పులులకు సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీసేనను ఎదుర్కోవడం మామూలు సవాలు కాదు. మహా మహా జట్లే టీమ్‌ఇండియా దాని సొంతగడ్డపై ఎదుర్కోలేక చేతులెత్తేశాయి. ఈ మధ్యే దక్షిణాఫ్రికా జట్టు కోహ్లీసేన ధాటికి ఎలా విలవిలలాడిందో తెలిసిందే. అలాంటిది షకిబ్‌ అల్‌హసన్‌, తమీమ్‌ లాంటి పెద్ద ఆటగాళ్లు లేకుండా, ఎనిమిది టెస్టుల అనుభవమున్న కొత్త కెప్టెన్‌ మొమినుల్‌ హక్‌ సారథ్యంలో బరిలోకి దిగుతున్న బంగ్లా.. ఆతిథ్య జట్టు దెబ్బకు ఏమాత్రం నిలుస్తుందన్నది సందేహం. షకిబ్‌ ఉండగానే, సొంతగడ్డపై చివరగా ఆడిన టెస్టు మ్యాచ్‌లో బంగ్లా.. అఫ్గానిస్థాన్‌ చేతిలో పరాజయం పాలవడం గమనార్హం. మరి ఇన్ని ప్రతికూలతల మధ్య బంగ్లా.. టీమ్‌ఇండియాను ఏమేర నిలువరిస్తుందో చూడాలి.

ముగ్గురు ఫాస్ట్‌బౌలర్లతోనే..: హోల్కర్‌ స్టేడియంలో ఇంతకుముందు జరిగిన ఏకైక టెస్టులో స్పిన్నర్ల ఆధిపత్యం సాగింది. అశ్విన్‌ ఏకంగా 13 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ బంగ్లాతో తొలి టెస్టులో భారత్‌ ముగ్గురు ఫాస్ట్‌బౌలర్లతో బరిలోకి దిగబోతుండటం విశేషం. ఇంతకుముందులా స్వదేశీ టెస్టుల్లో భారత్‌ స్పిన్నర్ల మీద ఆధారపడట్లేదు. పేసర్లే మ్యాచ్‌లు గెలిపిస్తున్నారు. వారికి అనుకూలించే పిచ్‌ల వైపు జట్టు యాజమాన్యం మొగ్గు చూపుతోంది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో పిచ్‌లు పేస్‌కు సహకరించకపోయినా షమి బృందం చెలరేగింది. బంగ్లాతో రెండో టెస్టును గులాబీ బంతితో డే/నైట్‌లో ఆడబోతున్న నేపథ్యంలో పేసర్ల పాత్ర కీలకమవుతుందన్న అంచనాతో తొలి టెస్టులో ముగ్గురు పేసర్లను ఆడించాలని కోహ్లి నిర్ణయించాడు. సఫారీలతో సిరీస్‌లో విఫలమైనప్పటికీ అనుభవజ్ఞుడు ఇషాంత్‌ శర్మకు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వనున్నట్లు కెప్టెన్‌ సంకేతాలిచ్చాడు. పిచ్‌పై ఎక్కువ పచ్చిక ఉన్నట్లుగా చెబుతున్న నేపథ్యంలో పేసర్లు బాగానే ప్రభావం చూపించే అవకాశముంది. ఫామ్‌లో ఉన్న షమి, ఉమేశ్‌లకు తోడు ఇషాంత్‌ సైతం సత్తా చాటితే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. స్పిన్‌ బాధ్యతల్ని అశ్విన్‌, జడేజా పంచుకుంటారు. పిచ్‌ స్పిన్‌కు అనకూలించే అవకాశమున్న నేపథ్యంలో వీళ్లిద్దరూ ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.

రోహిత్‌ కొనసాగిస్తాడా?: బ్యాటింగ్‌లో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది రోహిత్‌ శర్మే. దక్షిణాఫ్రికా సిరీస్‌తో ఓపెనర్‌ పాత్రలోకి మారిన హిట్‌ మ్యాన్‌ పరుగుల వరద పారించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. తర్వాత బంగ్లాతో టీ20ల్లోనూ తనదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అదే జోరును టెస్టు సిరీస్‌లోనూ కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరో ఓపెనర్‌ మయాంక్‌ సైతం ఫామ్‌లో ఉండగా.. విశ్రాంతి తర్వాత జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లి, గత సిరీస్‌తోనే లయ అందుకున్న రహానెలతో భారత బ్యాటింగ్‌ దుర్బేధ్యంగా కనిపిస్తోంది.

100

సాహా ఇంకో ముగ్గురిని ఔట్‌ చేస్తే 100 ఔట్ల మైలురాయిని అందుకుంటాడు. ధోని (294), కిరణ్‌ మోరె (198), నయన్‌ మోంగియా (107) మాత్రమే ముందున్నారు.

1

ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో భారత్‌ ఆడిన టెస్టులు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 321 పరుగుల తేడాతో విజయం సాధించింది. అశ్విన్‌ కెరీర్‌ అత్యుత్తమ మ్యాచ్‌ గణాంకాలు (13/140) నమోదు చేసింది ఈ మ్యాచ్‌లోనే.

6

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన టెస్టులు. అయిదు మ్యాచ్‌ల్లో భారత్‌ గెలవగా.. ఒకటి డ్రా అయింది.

25

టెస్టుల్లో 4 వేల మైలురాయిని అందుకోవడానికి రహానేకు అవసరమైన పరుగులు.

ఇక అంతా అయిపోయిందనుకున్నా

విరాట్‌ కోహ్లి ఉజ్వల కెరీర్లో ఏకైక విఫల పర్యటన 2014 ఇంగ్లాండ్‌దే. నాటి అయిదు టెస్టుల సిరీస్‌లో అతను దారుణమైన ప్రదర్శన చేశాడు. పది ఇన్నింగ్స్‌ల్లో కేవలం 13.4 సగటుతో 134 పరుగులే సాధించాడు. ఆ వైఫల్యాలు తనను మానసికంగా బాగా దెబ్బ తీశాయని అంటున్నాడు విరాట్‌. ఆ సమయంలో అంతా అయిపోయిందన్న భావన కలిగిందని చెప్పాడు. మానసిక సమస్యల కారణంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కొంత కాలం క్రికెట్‌కు దూరం కావడంపై స్పందిస్తూ కోహ్లి ఈ వ్యాఖ్యలు చేశాడు. మ్యాక్స్‌వెల్‌ ఈ నిర్ణయం తీసుకుని క్రికెటర్లందరికీ ఆదర్శంగా నిలిచాడని కొనియాడాడు. ‘‘అంతర్జాతీయ స్థాయిలో జట్టులోని ప్రతి ఆటగాడూ తన ఇబ్బందుల్ని పంచుకునే, ఏ విషయమైనా వెల్లడించే వీలుండాలి. ఈ విషయంలో మ్యాక్స్‌వెల్‌ నిర్ణయం ముఖ్యమైంది. నా కెరీర్లోనూ ఇలాంటి దశను ఎదుర్కొన్నాను. అప్పుడు ప్రపంచం అంతమైపోయిన భావన కలిగింది. 2014 ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా ఏం చేయాలో.. ఎవరికేం చెప్పాలో అర్థం కాలేదు’’ అని కోహ్లి అన్నాడు.

బలహీనమే కానీ..

బంగ్లా టెస్టు జట్టు గత కొన్నేళ్లలోనూ ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తోంది. కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా పెట్టని కోట అయిన షకిబ్‌ను కోల్పోవడం జట్టుకు భారీ దెబ్బే. సీనియర్‌ ఓపెనర్‌ తమీమ్‌ సైతం ఇదే సమయంలో అందుబాటులో లేకపోవడంతో జట్టుకు అనుభవ లేమి పెద్ద సమస్యగా మారేలా ఉంది. ఈ స్థితిలో భీకర ఫామ్‌లో ఉన్న ప్రపంచ నం.1 టీంతో సిరీస్‌లో జట్టును నడిపించడం కొత్త కెప్టెన్‌ మొమినుల్‌ హక్‌కు సవాలే. బ్యాటింగ్‌లో అతడికి ముష్ఫికర్‌, మహ్మదుల్లా, లిటన్‌ దాస్‌ల సహకారం ఎంతో అవసరం. షాద్మన్‌ ఇస్లామ్‌, సైఫ్‌ హసన్‌ లాంటి కొత్త కుర్రాళ్లు ఏమేర సత్తా చాటుతారో చూడాలి. ముస్తాఫిజుర్‌ మునుపటి ఫామ్‌లో లేకపోవడం జట్టును కలవరపెడుతోంది.  అతడికి తుది జట్టులో చోటే సందేహంగా ఉంది. స్పిన్నర్లు తైజుల్‌ ఇస్లామ్‌, మెహిదీ హసన్‌లపై బంగ్లా చాలా ఆశలే పెట్టుకుంది. ఐతే ఎన్ని బలహీనతలున్నా బంగ్లా పోరాటపటిమ గురించి తెలిసిందే కాబట్టి కోహ్లీసేన అప్రమత్తంగా ఉండాల్సిందే.

మంచులో గులాబీ ఎలా స్పందిస్తుందో?

డే/నైట్‌ టెస్టుల్లో మంచు కురిసే సమయంలో గులాబీ బంతి ఎలా స్పందిస్తుందో అన్నది అంతుబట్టకుండా ఉందని కోహ్లి అన్నాడు. ఈ నెల 22 నుంచి ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్‌ తొలి డే/నైట్‌ టెస్టు (బంగ్లాదేశ్‌తో) ఆడబోతున్న నేపథ్యంలో విరాట్‌ మాట్లాడాడు. ‘‘టెస్టుల పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగేలా చేస్తుంది గులాబీ బంతి. మంగళవారం ఆ బంతితో సాధన చేశాను. ఎర్ర బంతితో పోలిస్తే ఇది ఎక్కువ స్వింగ్‌ అయింది. దానంత వేగంగా బ్యాట్స్‌మన్‌ను దాటి పోలేదు. అయితే పాతబడ్డాక మంచులో గులాబీ బంతి ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరం. ఈ బంతితో ఆడేటపుడు పిచ్‌ జీవంతో ఉండటం అవసరం’’ అని కోహ్లి అన్నాడు.

‘‘మేమేమీ ఒత్తిడిలో లేం. ఈ సిరీస్‌లో మాపై పెద్దగా అంచనాలు లేవని మాకు తెలుసు. ఉన్నంతలో మెరుగైన క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తాం. కెప్టెన్సీ నా బ్యాటింగ్‌ మీద ప్రభావం చూపిస్తుందని అనుకోను’’

- మొమినుల్‌, బంగ్లాదేశ్‌ కెప్టెన్‌

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌, మయాంక్‌, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానె, జడేజా, సాహా (వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, ఇషాంత్‌, ఉమేశ్‌, షమి
బంగ్లాదేశ్‌: షాద్మన్‌ ఇస్లామ్‌, సైఫ్‌ హసన్‌, మొమినుల్‌ హక్‌ (కెప్టెన్‌), ముష్ఫికర్‌, మహ్మదుల్లా, మిథున్‌, లిటన్‌ దాస్‌ (వికెట్‌ కీపర్‌), మెహిదీ హసన్‌, తైజుల్‌ ఇస్లామ్‌, అబు జాయెద్‌, ముస్తాఫిజుర్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.