close
ఓహో గులాబీ బాలా..!

ఈనాడు క్రీడావిభాగం

శంఖంలో పోస్తేనే తీర్థం అయినట్లుగా.. ప్రపంచ క్రికెట్లో కొత్తగా ఏ ప్రయోగం జరిగినా సరే.. అది భారత్‌లో అడుగు పెడితేనే విజయవంతం అయినట్లు! మన దేశంలో క్రికెట్‌కున్న క్రేజ్‌ దృష్ట్యా ఒక ఆకర్షణీయ ప్రయోగం ఏదైనా ఇక్కడ మొదలుపెడితే.. అది జనాలకు నచ్చితే దానికి జరిగే ప్రచారం వేరు, దక్కే ఆదరణ వేరు. అందుకే ఇప్పుడు భారత్‌లో జరగబోయే తొలి డే/నైట్‌ టెస్టు కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ మ్యాచ్‌ అంచనాలకు తగ్గట్లు సాగితే.. మున్ముందు డే/నైట్‌ టెస్టుల కళే వేరుగా ఉంటుందని ఆశిస్తోంది ఐసీసీ.

నానాటికీ ఆకర్షణ కోల్పోతున్న టెస్టులకు ఆదరణ పెంచే ఉద్దేశంతో డే/నైట్‌ టెస్టుల ఆలోచన తెచ్చింది ఐసీసీ. సాయంత్రం వేళ స్టేడియాలకు వచ్చి సేదదీరడం క్రికెట్‌ ప్రేమికులకు ఇష్టం కాబట్టి.. డే/నైట్‌లో నిర్వహిస్తే టెస్టులకూ వీక్షకులు పెరుగుతారని ఆశించింది. 2015లో ఆస్ట్రేలియాలో గులాబి బంతితో మొట్ట మొదటి డే/నైట్‌ టెస్టు జరిగింది. ఆ మ్యాచ్‌కు అనుకున్నట్లే మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత గత నాలుగేళ్లలో మరో పది గులాబి టెస్టులు జరిగాయి. అన్నింటికీ మంచి ఆదరణే లభించింది. ఈ మ్యాచ్‌లన్నింట్లోనూ ఫలితం రావడం విశేషం. కానీ కొత్త ప్రయోగాల్ని అంత సులభంగా స్వీకరించని భారత్‌.. డే/నైట్‌ టెస్టుల విషయంలోనూ వెనుకంజ వేసింది. ఒకప్పుడు టీ20లు ఆడటంలోనూ భారత్‌ అంత సానుకూలంగా స్పందించలేదు. మిగతా జట్లన్నీ ప్రయత్నించాక చివరగా టీ20 క్రికెట్‌ను అందిపుచ్చుకుంది. తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ గెలవడం, ఈ ఫార్మాట్లోనే ఐపీఎల్‌ ఆరంభించడంతో ప్రపంచ క్రికెట్‌ ముఖచిత్రమే మారిపోయింది. ఒకప్పుడు వన్డేలకు ఆదరణ పెరిగింది కూడా భారత్‌ అందులో భాగం కావడంతోనే. టెస్టుల్లో సమీక్ష పద్ధతి వినియోగించడంలో ఒకప్పుడు విముఖత ప్రదర్శించి.. ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకుంది భారత్‌. టీమ్‌ఇండియా ఆడే టెస్టుల్లో డీఆర్‌ఎస్‌ వినియోగంతో ఆ పద్ధతి ప్రాచుర్యం పొందింది. ఇలా భారత్‌ అనుసరిస్తేనే ఏ ప్రయోగమైనా విజయవంతమవుతుందన్నది స్పష్టం.


మ్యాచ్‌లు పెరుగుతాయా?

డే/నైట్‌ టెస్టులు నిర్వహించిన ప్రతిచోటా సానుకూల స్పందనే వచ్చింది. ఆటగాళ్లూ ఈ అనుభవం బాగుందన్నారు. వీక్షకులూ కొత్త అనుభూతి పొందారు. అయినప్పటికీ నాలుగేళ్ల వ్యవధిలో 11 గులాబి టెస్టులే జరగడం గమనార్హం. భారత్‌ ముందే ఈ మ్యాచ్‌ల్లో భాగమై ఉంటే ఈపాటికి కథే వేరుగా ఉండేదేమో. అయితే గులాబి బంతి నాణ్యతపై సందేహాలు, ప్రాక్టీస్‌ కొరవడటం లాంటి కారణాలతో వెనుకంజ వేస్తూ వచ్చిన భారత్‌.. ఎట్టకేలకు బీసీసీఐ కొత్త అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ చొరవతో డే/నైట్‌ టెస్టుకు అంగీకారం తెలిపింది. స్వల్ప వ్యవధిలో ఆటగాళ్లు మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నారు. చారిత్రక ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్‌ జరుగుతుండటం ఆసక్తిని మరింత పెంచేదే. స్టేడియాలకు వెళ్లి చూసేవాళ్లే కాదు.. టీవీ వీక్షకులు సైతం ఈ మ్యాచ్‌ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మ్యాచ్‌ అంచనాలకు తగ్గట్లే ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా సాగి సానుకూల స్పందన వస్తే.. మున్ముందు టీమ్‌ఇండియా మరిన్ని గులాబి టెస్టులు ఆడటం ఖాయం. ఆ క్రమంలో ప్రపంచ క్రికెట్లో మొత్తంగా డే/నైట్‌ టెస్టులు పెరిగే అవకాశమూ ఉంటుంది. అయితే మన ఆటగాళ్లు చాలామందికి కొన్ని రోజుల ముందు వరకు గులాబి బంతితో పరిచయమే లేని నేపథ్యంలో మ్యాచ్‌లో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో.. భారత్‌లో వినియోగించే ఎస్జీ గులాబీ బంతుల నాణ్యతపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో.. ఇక్కడి వాతావరణం బంతిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఈ సవాళ్లను అధిగమించి మ్యాచ్‌ విజయంతమైతే.. టెస్టు క్రికెట్లో గులాబి విప్లవం మొదలవడం ఖాయం.


ఈడెన్‌ సిద్ధం

గులాబి బంతితో బంగ్లాదేశ్‌తో ఈ నెల 22న ఆరంభమయ్యే డే/నైట్‌ టెస్టు సమరానికి ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ సిద్ధమైంది. ఇటీవల కురిసి వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురైనా పిచ్‌ను మ్యాచ్‌కు సిద్ధం చేశామని క్యురేటర్‌ సుజన్‌ ముఖర్జీ చెప్పాడు. ‘‘గత వారం కురిసిన వర్షాల వల్ల పిచ్‌ను సిద్ధం చేయడంలో సవాళ్లు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు వాతావరణం బాగుంది. పిచ్‌ మంచి స్థితిలో ఉంది. మ్యాచ్‌కు సిద్ధంగా ఉంది. ఈడెన్‌లో మంచి మ్యాచ్‌ను చూడొచ్చు. అందుకోసం నేను చేయగలిగిందంతా చేస్తా’’ అని అన్నాడు. ఈ పిచ్‌ను పరీక్షించడానికి.. ఓ స్థానిక మ్యాచ్‌ ఆడించాలనుకున్నా వర్షం వల్ల కుదరలేదని ముఖర్జీ తెలిపాడు. ‘‘మ్యాచ్‌కు ఉపయోగించే ఈ పిచ్‌ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడం కోసం ఓ స్థానిక మ్యాచ్‌ ఆడించాలనుకున్నాం. కానీ తుపాను కారణంగా అది కుదరలేదు. అయితే ఈ పిచ్‌ నుంచి ప్రతి ఒక్కరికీ అంతో ఇంతో సహకారం లభిస్తుందని ఆశిస్తున్నా. కాస్త పచ్చిక ఉంటుంది. బౌన్స్‌ లభిస్తుంది’’ అని చెప్పాడు. ఇండోర్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఈడెన్‌లోనూ భారత్‌కు ఎదురుండదని భావిస్తున్నారు. కొన్ని రోజుల కిందే ఈడెన్‌కు గులాబి బంతులు వచ్చాయి. పిచ్‌పై ముఖర్జీ వాటిని పరీక్షించనున్నాడు. ‘‘నేనింకా గులాబి బంతులను పరీక్షించలేదు. వచ్చే రోజుల్లో పరీక్షిస్తా. అయితే గులాబి బంతి వల్ల పరిస్థితిలో మార్పేమీ ఉండదు. పిచ్‌ ఎప్పటిలానే ఉంటుంది’’ అని అన్నాడు.


గులాబి శోభితం..

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.