close
మైదానంలో నాగిని బుసలు!!

అంతకు ముందు, ఆ తర్వాత ఏం జరిగింది?

క్రికెట్‌ సమరంలో ప్రత్యర్థిపై పైచేయి సాధించాలని ఆటగాళ్లు కసిగా ఆడుతుంటారు. జట్టును గెలిపించాలని మైదానంలో ప్రాణంపెట్టి పోరాడుతారు. వికెట్‌ పడగొట్టినా, క్యాచ్‌ అందుకున్నా, శతకం బాదినా, బంతిని స్టేడియం అవతలకి తరలించినా తమదైన రీతిలో సంబరాలు చేసుకుంటారు. కానీ, బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల నాగిని డ్యాన్స్‌ క్రికెట్‌ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. వారు చేసిన నాగిని డ్యాన్స్‌ అందరికీ కొత్తగా, గమ్మత్తుగా అనిపించింది. పెళ్లిల్లో, ఇతర వేడుకల్లో సాధారణంగా చేసే నాగిని డ్యాన్స్‌ అసలు అంతర్జాతయ క్రికెట్‌లోకి ఎలా వచ్చింది?

సెలబ్రేషన్స్‌లో ఒక్కో ఆటగాడికి ఒక్కో శైలి ఉంటుంది. భారత ఓపెనర్ శిఖర్‌ ధావన్ క్యాచ్ పడితే.. తొడగొట్టి ప్రత్యర్థిని సాగనంపుతాడు. టీమ్‌ఇండియా పేసర్ మహ్మద్‌ షమి 360 డిగ్రీలు గాల్లో తిరిగి సంబరాలు జరుపుకుంటాడు. ఇక వెస్టిండీస్‌ ఆటగాళ్లు విన్నూతంగా సెలబ్రేషన్స్‌ చేసుకుంటారు. డ్వేన్‌ బ్రావో డ్యాన్స్‌ వేస్తే.. షెల్డన్‌ కాట్రెల్‌ కవాతు చేసి సెల్యూట్‌తో బ్యాట్స్‌మెన్‌కు టాటా చెబుతాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్‌ తాహిర్‌ గురించి అందరికీ తెలిసిందే.  వికెట్‌ పడగొట్టగానే.. మైదానంలో తనని అందుకోలేని వేగంతో పరుగెత్తి సంబరాలు చేసుకుంటాడు. ఇలా విన్నూతంగా సంబరాలు జరుపుకొని ఇమేజ్‌ను సంపాదించుకున్న ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ, మ్యాచ్‌ గెలిస్తే బంగ్లా ఆటగాళ్లు చేసే సంబరాలు విచిత్రంగా, హాస్యాస్పదంగా అనిపిస్తాయి.


అక్కడే మొదలైంది!
2018, ఫిబ్రవరిలో శ్రీలంక.. బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లింది. రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో, రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. సొంతగడ్డపై తీవ్రంగా పోరాడినా బంగ్లా ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. కానీ, క్రికెట్‌ ప్రపంచానికి విన్నూత సంబరాలను పరిచయం చేసింది. తొలి టీ20లో ఉపుల్ తరంగను ఔట్‌ చేసిన బంగ్లా బౌలర్‌ నజ్ముల్ ఇస్లామ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు నాగిని డ్యాన్స్‌ పరిచయం చేశాడు. తరంగ మైదానాన్ని వీడుతుండగా నాగిని డ్యాన్స్‌ వేస్తూ అతడిని కవ్వించాడు. అతడికి ఇదే తొలి అంతర్జాతీయ వికెట్‌. ఈ సెలబ్రేషన్స్‌ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కానీ, బంగ్లా అభిమానులకు నజ్ముల్‌ నాగిని డ్యాన్స్‌ సుపరిచితమే. బంగ్లా ప్రీమియర్‌ లీగ్‌లో అతడి సిగ్నేచర్‌ సెలబ్రేషన్స్‌గా అభిమానులు ఆస్వాదించేవారు.  


నెట్టింట్లో నాగినీ మోత
సొంతగడ్డపై ఘోరపరాజయాన్ని చవిచూసిన బంగ్లాదేశ్‌ నెల విరామం తర్వాత నిదహాస్‌ ట్రోఫీ కోసం శ్రీలంకలో పర్యటించింది. ఈ పొట్టిఫార్మాట్‌ సిరీస్‌లో భారత్‌ కూడా బరిలోకి దిగింది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లా 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయం సాధించింది. ముష్ఫికర్‌ (72*) ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అనంతరం అతడు నాగిని డ్యాన్స్‌తో సంబరాలు జరుపుకున్నాడు. మరోవైపు టీమ్‌ఇండియా మూడు విజయాలు సాధించి ఆరు పాయింట్లతో ఫైనల్‌కు చేరింది. శ్రీలంక, బంగ్లా రెండేసి పాయింట్లతో సమంగా నిలిచి ఫైనల్‌ బెర్తు కోసం పోరుకు సన్నద్ధమయ్యాయి. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక ఏడు వికెట్లకు నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేధనకు దిగిన బంగ్లా 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన గత మ్యాచ్‌ హీరో ముష్ఫికర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ లంక బౌలర్ అమిలా అపోన్సో అతడిని బోల్తా కొట్టించాడు. గత మ్యాచ్‌లో అతడు చేసిన నాగిని డ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ అమిలా నాగస్వరం ఊదుతూ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఇరు జట్ల మధ్య పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బంగ్లా 107 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కానీ, మహ్మదుల్లా (43*) అద్భుతంగా పోరాడాడు. ఆరు బంతుల్లో విజయానికి 12 పరుగులు అవసరం. తొలి రెండు బంతుల్లో బంగ్లా రెండు వికెట్లు కోల్పోయింది. ఇక బంగ్లా కథ ముగిసిందని భావించారంతా. కానీ, మహ్మదుల్లా ఫోర్‌, సిక్సర్‌ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో బంగ్లా ఆటగాళ్లు ఫైనల్‌కు చేరిన ఆనందంతో మైదానంలోకి దూసుకొచ్చారు. అందరూ కలిసి నాగిని డ్యాన్స్‌ వేస్తూ విజయాన్ని ఆస్వాదించారు. ఇలాంటి సంబరాలను అప్పటివరకు చూడని క్రికెట్‌ ప్రపంచానికి విచిత్రంగా అనిపించింది.


భారత్‌ విజయం కోసం లంక అభిమానులు..

బంగ్లా సంబరాలను జీర్ణించుకోలేని లంక అభిమానులంతా ఫైనల్లో భారత్‌కు అండగా నిలిచారు. స్టేడియానికి వచ్చి మరీ బంగ్లా పతనం కోసం ఎదురుచూశారు. ఇరుజట్ల మధ్య ఫైనల్‌ హోరాహోరీగా సాగింది. భారత్‌ విజయానికి ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం. భారత అభిమానులతో పాటు లంకేయులు టీమ్ఇండియానే విజయం సాధించాలని ప్రార్థిస్తున్నారు. సౌమ్య సర్కార్ వేసిన ఆఖరి బంతిని కార్తీక్‌ ఎక్సట్రా కవర్‌ మీదుగా సిక్సర్‌ బాదాడు. అంతే, ఒక్కసారిగా స్టేడియం మొత్తం దద్దరిల్లింది. లంక అభిమానులంతా నాగిని డ్యాన్స్‌ వేయడం మొదలుపెట్టారు. కామెంటరీ బాక్సులో ఉన్న భారత మాజీ ఆటగాడు సునిల్‌ గావాస్కర్‌ సైతం నాగిని స్టెప్పులు వేశాడు. బంగ్లా నాగిని డ్యాన్స్‌ను అడ్డుకున్న కార్తీక్‌పై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు జల్లు కురిసింది. మొత్తంగా బంగ్లా ఆటగాళ్లు సంబరాల్లో శృతి మించినా వారు చేసిన నాగిని డ్యాన్స్‌ను క్రికెట్‌ ప్రపంచాన్ని ఊపేసింది. దీన్ని క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆస్వాదించారు. బంగ్లా జట్టు అంటే ప్రతి క్రికెట్‌ అభిమానికి వెంటనే గుర్తొచ్చేది నాగిని డ్యాన్స్‌ అంటే అతియోశక్తి కాదు. అంతలా నాగినీ ప్రాముఖ్యత సంతరించుకుంది!!

- ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.