close
మ్యాచ్‌ విన్నర్లను తీసుకువచ్చాడు..!

జట్టును బలోపేతం చేయడంలో ఎమ్మెస్కేది కీలకపాత్ర

గత కొన్నేళ్లుగా భారత జట్టు ఎంతో నిలకడగా ప్రదర్శన చేస్తూ అద్భుత విజయాలతో దూసుకెళ్తోంది. యువకులకు పెద్దపీట వేస్తూ అన్ని ఫార్మాట్లలో పటిష్ఠంగా నిలుస్తుంది. దీనిలో సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పాత్ర కీలకమైనది. తెర వెనుక ఉంటూ కొత్త రక్తాన్ని పరిచయం చేస్తూ జట్టును బలోపేతం చేయడంలో తనదైన పాత్ర పోషిస్తున్నాడు. 2016లో చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అతడు వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ వరకు పదవీలో ఉంటాడని భావిస్తున్నారంతా.  పాత రాజ్యాంగం ప్రకారమే పదవీ కాలంలో ఎమ్మెస్కే ఉంటాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ కూడా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో తన పదవీ కాలంలో అతడు పరిచయం చేసిన కీలక ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం!

ధోనీ వారసుడి కోసం..
ప్రతిభ కలిగిన ఎంతో మంది యువ ఆటగాళ్లను ఎమ్మెస్కే ప్రసాద్‌ పరిచయం చేశాడు. అందులో రిషభ్‌ పంత్‌ ఎంపిక ఎంతో కీలకం. ధోనీ తర్వాత అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరూ అని వేధించిన ప్రశ్నకు అతడు పంత్‌ రూపంలో సమాధానమిచ్చాడు. 2017లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ను మొదలుపెట్టిన పంత్‌ అసాధారణ ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. తన సహజ శైలి దూకుడుతో ఎన్నో మ్యాచుల్లో జట్టుకు విజయాలు అందించాడు. అన్ని ఫార్మాట్లలోనూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కానీ పంత్‌ గత కొంత కాలంగా నిలకడలేమి ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. పేలవమైన షాట్లతో పెవిలియన్‌కు చేరుతున్నాడు. దీంతో మూడు ఫార్మాట్లలో పంత్‌కు పనిభారం పెరుగుతుందని ప్రత్యామ్నాయాలు కూడా ఎమ్మెస్కే సిద్ధం చేస్తున్నాడు. గాయం నుంచి తిరిగి కోలుకున్న వృద్ధిమాన్‌ సాహాకు టెస్టుల్లో అవకాశం ఇచ్చాడు. పరిమిత ఓవర్లలో సంజు శాంసన్‌ను కూడా ఎంపిక చేశాడు. యువ వికెట్‌కీపర్‌ కేఎస్‌ భరత్‌కు కూడా టీమ్‌ఇండియాలో అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. గుంటూరులో జన్మించిన ఎమ్మెస్కే తన పదవీ కాలం ముగిసేలోపు తెలుగు కుర్రాడు భరత్‌కు అవకాశం ఇస్తాడని భావిస్తున్నారంతా.    

చైనామన్‌ బౌలర్‌ను తీసుకువచ్చాడు
నాలుగో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ సరైనోడని ఎమ్మెస్కే భావిస్తున్నాడు. దీనికి తగ్గట్టుగా అతడికి అవకాశాలు కూడా ఇస్తున్నాడు. 2017లో శ్రీలంక మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ను ఆరంభించిన శ్రేయస్‌ ఇప్పటివరకు 9 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. వీటిలో ఐదు టీ20లు, మూడు వన్డేలు గత రెండు నెలల్లోనే ఆడాడు. జట్టు అవసరాలను బట్టి సంయమనంగా, దూకుడుగా ఆడుతూ అతడు మాజీల ప్రశంసలు అందుకుంటున్నాడు. మ్యాచ్ విన్నర్‌గా ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న అతడు భవిష్యత్తులో జట్టుకు వెన్నెముకగా మారతాడనడంలో సందేహం లేదు. 

చైనామన్ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌, ఆల్‌రౌండర్ విజయ్‌ శంకర్‌ను కూడా ఎమ్మెస్కే భారత జట్టులోకి తీసుకవచ్చాడు. కేవలం తొమ్మిది వన్డేలే ఆడిన విజయ్‌ శంకర్‌కు ప్రపంచకప్‌లో చోటు కల్పించినందుకు ఎమ్మెస్కే ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తాయి. కానీ పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి తన ఎంపిక సరైనదేనని విజయ్‌ శంకర్‌ నిరూపించాడు. ఆ తర్వాత గాయంతో ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన అతడికి ఇప్పటివరకు మరో అవకాశం రాలేదు. ఎమ్మెస్కే హయాంలోనే స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ టీమ్ఇండియాలోకి వచ్చాడు. స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌తో కలిసి కుల్‌దీప్ ప్రత్యర్థులను కట్టడిచేసేవాడు. బంతిని గింగరాలు తిప్పడంతో పాటు వైవిధ్యంతోనూ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడతాడు. కానీ ఇటీవల అతడికి ఎక్కువ అవకాశాలు దక్కట్లేదు. యువస్పిన్నర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అతడికి విశ్రాంతి ఇస్తున్నారు.

మయాంకం మొదలైంది అతడి ఖాతాలోనే
సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత జట్టును ఎమ్మెస్కే దుర్బేధ్యంగా మార్చాడు. టెస్టుల్లో జస్ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య, మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారి ఎమ్మెస్కే నేతృత్వంలోనే ఎంపికయ్యారు. మయాంక్‌, విహారి అందివచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్నారు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌పై మయాంక్‌ ద్విశతకాలతో చెలరేగాడు. హనుమ విహారి వెస్టిండీస్‌ పిచ్‌లపై శతకం బాది తన సత్తా ఏంటో నిరూపించాడు. టెస్టు ఓపెనర్‌గా రోహిత్‌ కూడా విజృంభించడంతో టీమ్‌ఇండియా టెస్టు బ్యాటింగ్‌ మరింత పటిష్ఠంగా మారింది. ఎమ్మెస్కే చేసిన ఎంపికల్లో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి బుమ్రాను తీసుకరావడం గొప్ప ఎంపిక. అతడి రాకతో భారత పేస్‌ దళం మునుపు ఎన్నడూ లేనంత బలంగా మారింది. 12 టెస్టులు ఆడిన బుమ్రా 62 వికెట్లతో టెస్టు ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.    

టీ20ల్లో యువ జోరు!
పొట్టిఫార్మాట్‌లో యువఆటగాళ్లకు ఎమ్మెస్కే పెద్దపీట వేస్తున్నాడు. కృనాల్‌ పాండ్య, శివమ్‌ దూబే, దీపక్‌ చాహర్‌, రాహుల్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైని, వాషింగ్టన్‌ సుందర్‌, ఖలీల్‌ అహ్మద్‌ వంటి యువఆటగాళ్లను పరిచయం చేశాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని జట్టును సమతూకం చేస్తున్నాడు. తమపై సెలక్టర్లు ఉంచిన నమ్మకాన్ని ఆటగాళ్లు కూడా కాపాడుకుంటున్నారు. బుమ్రా, షమి లేకపోయినా వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, బంగ్లా టీ20 సిరీసుల్లో దీపక్‌ చాహర్, ఖలీల్‌ అహ్మద్‌ భారత పేస దళాన్ని నడిపించారు. వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌లో కృనాల్ పాండ్య మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్ అందుకోగా, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో దీపక్‌ సంచనలన ప్రదర్శన చేశాడు. సుందర్‌ బంతితో పాటు బ్యాటుతోనూ ఆకట్టుకుంటున్నాడు. మొత్తంగా టీ20ల్లో యువఆటగాళ్లు జోరు కొనసాగుతోంది. పొట్టి ప్రపంచకప్‌లో ఎదురులేని జట్టుగా టీమ్‌ఇండియా బరిలోకి దిగేలా ఎమ్మెస్కే ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. అతడి హయాంలో ఎంతో మంది మ్యాచ్‌ విన్నర్లు భారత జట్టులోకి వచ్చారు.  

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.