close
నాడు వద్దన్నోడే

ఠాకూర్‌ తిలక్‌వర్మ.. రెండేళ్ల కిందటి వరకు ఎవరికీ తెలియని పేరు! అలాంటిది ఏకంగా భారత అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టులో చోటు. జట్ల ఎంపికలో అనేక రాజకీయాలకు కేంద్రంగా మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నుంచి ఓ సాధారణ మధ్య తరగతి కుర్రాడు అత్యున్నత స్థాయికి చేరుకోవడం అద్భుతమే!

ఈనాడు - హైదరాబాద్‌

2017 హెచ్‌సీఏ లీగ్స్‌లో తిలక్‌ పేరు తొలిసారిగా వినిపించింది. సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేస్తుండటం.. దండిగా పరుగులు రాబడుతుండటంతో అప్పటి సీనియర్‌ సెలెక్టర్‌ శ్రీనివాస్‌ చక్రవర్తి దృష్టిలో పడ్డాడు. ఎడమచేతి వాటం తిలక్‌లోని సహజ ప్రతిభను గుర్తించిన చక్రవర్తి అతడిని ప్రోత్సహించాడు. తిలక్‌ను హైదరాబాద్‌ అండర్‌-16 జట్టుకు ఎంపిక చేయించాడు. ఫలితమే అఖిల భారత విజయ్‌ మర్చంట్‌ అండర్‌-16 క్రికెట్‌ టోర్నీలో తొలిసారిగా హైదరాబాద్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది. కోచ్‌ అనిరుధ్‌సింగ్‌ మార్గనిర్దేశనంలో రాణించిన తిలక్‌ 690 పరుగులతో జాతీయ స్థాయిలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆ వెంటనే 2017లో మొయినుద్దౌలా గోల్డ్‌కప్‌ టోర్నీ. అప్పటి రంజీ ఛాంపియన్‌ విదర్భ, బరోడా, ఎయిరిండియా, గోవా, కేరళ వంటి జట్లు పాల్గొన్న టోర్నీలో హైదరాబాద్‌కు తిలక్‌ను ఎంపిక చేయడానికి పెద్ద యుద్ధమే జరిగింది! 15 ఏళ్ల కుర్రాడిని రంజీ ఛాంపియన్‌తో తలపడే జట్టుకు ఎలా ఎంపిక చేస్తారంటూ హెచ్‌సీఏ పెద్దలతో సహా అందరూ వ్యతిరేకించారు! అయినా సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ రమేశ్‌, సెలెక్టర్‌ చక్రవర్తి పట్టుబట్టి మరీ తిలక్‌ను హైదరాబాద్‌కు ఎంపిక చేశారు. రంజీ శిబిరంలో రాయుడు, ఇతర సీనియర్‌ క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్‌ చేసిన తిలక్‌ అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు. అతడి బ్యాటింగ్‌ మరింత మెరుగైంది. నిరుడు రంజీ ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో అరంగేట్రం చేసిన తిలక్‌.. ఇటీవల విజయ్‌ హజారే వన్డే టోర్నీలో బరిలో దిగి సత్తాచాటాడు. అండర్‌-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీ సాధించాడు. ఛాలెంజర్‌ ట్రోఫీలో ఇండియా-బి తరఫున ఆడాడు. సీనియర్‌, అండర్‌-19 విభాగాల్లో నిలకడగా రాణిస్తున్న  17 ఏళ్ల తిలక్‌కు ఊహించినట్లే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కింది. అత్యంత కీలకమైన వన్‌డౌన్‌ స్థానంలో తిలక్‌ ఆడే అవకాశముంది.

తిలక్‌ తండ్రి చిన్న కంపెనీలో చిరుద్యోగి. కోచ్‌ సలాం దగ్గర శిక్షణకు చేరినప్పుడు తిలక్‌కు పదేళ్లు. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో సలాం ఇల్లు. 40 కిలోమీటర్ల దూరంలో లింగంపల్లిలో అతని అకాడమీ. సలాంతో కలిసి రోజూ 80 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోచ్‌తోనే ఉంటూ క్రికెట్‌ నేర్చుకున్నాడు తిలక్‌. కుమారుడిలో ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు తిలక్‌ను ప్రోత్సహించారు. కోచ్‌ పాఠాలు.. సెలెక్టర్‌ అండదండలతో అతితక్కువ కాలంలోనే తిలక్‌ ఈస్థాయికి చేరుకోగలిగాడు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.