close

ప్రధానాంశాలు

పట్టువదలని ఫజల్‌

అజేయ శతకంతో మెరిసిన కెప్టెన్‌
ఆధిక్యం దిశగా విదర్భ.. ప్రస్తుతం 242/4
హైదరాబాద్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌

రంజీ ట్రోఫీలో చివరి మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌కు భంగపాటు తప్పదా? ఏడో ఓటమి హైదరాబాద్‌ ఖాతాలో చేరనుందా? ఆఖరి మ్యాచ్‌లో కనీసం ఆధిక్యం దక్కే అవకాశాలు కూడా లేవా? అంటే ఔనన్న సమాధానాలే  వినిపిస్తున్నాయి! విదర్భ కెప్టెన్‌ ఫయాజ్‌ ఫజల్‌ (126 బ్యాటింగ్‌; 209 బంతుల్లో 15×4, 3×6) పట్టువదలని విక్రమార్కుడిలా ఆడుతుండటంతో ఆతిథ్య జట్టు మరో పరాభవం దిశగా పయనిస్తోంది!

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో విదర్భ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఫయాజ్‌ ఫజల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన వేళ.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 239/7తో గురువారం ఉదయం ఆట కొనసాగించిన హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 94.5 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు ప్రతీక్‌రెడ్డి (83; 181 బంతుల్లో 9×4) రాణించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 242 పరుగులు సాధించింది. మరో 31 పరుగులు చేస్తే విదర్భకు ఆధిక్యం లభిస్తుంది. ఫామ్‌లో ఉన్న ఫజల్‌ క్రీజులో ఉండటం విదర్భకు కలిసొచ్చే అంశం. మూడో రోజు ఆటలో విదర్భ 100 పరుగుల పైచిలుకు ఆధిక్యం సంపాదిస్తే మ్యాచ్‌పై హైదరాబాద్‌ ఆశలు వదులుకోవాల్సిందే!

33 పరుగులు.. 3 వికెట్లు: విదర్భ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని ఆశలు రేపిన ప్రతీక్‌రెడ్డి, మెహదీ హసన్‌ (30) రెండో రోజు నిరాశ పరిచారు. గురువారం ఆట ప్రారంభమవగానే హసన్‌ ఔటయ్యాడు. ఆదిత్య తకారె (3/70) బౌలింగ్‌లో అక్షయ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కొద్దిసేపటికే ప్రతీక్‌రెడ్డి అదే తరహాలో నిష్క్రమించాడు. అయితే పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (22; 14 బంతుల్లో 4×4, 1×6) ఆఖర్లో అలరించాడు. బౌండరీలు, సిక్సర్‌తో అదరగొట్టాడు. భారీషాట్‌కు ప్రయత్నించే క్రమంలో ఆదిత్య బౌలింగ్‌లో ఫయాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. గురువారం 8.5 ఓవర్లాడిన హైదరాబాద్‌ మరో 33 పరుగులు జోడించి మిగతా 3 వికెట్లు కోల్పోయింది.

కెప్టెన్‌ ఇన్నింగ్స్‌: హైదరాబాద్‌ను కట్టడి చేసిన ఆనందంలో తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన విదర్భకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పేసర్‌ రవికిరణ్‌ (2/19) కొత్త బంతితో నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌.. తన రెండో ఓవర్లోనే ఓపెనర్‌ అక్షయ్‌ కోల్హర్‌ (3)ను ఔట్‌ చేసి హైదరాబాద్‌ శిబిరంలో ఉత్సాహం నింపాడు. రవికిరణ్‌ సంధించిన ఇన్‌స్వింగర్‌కు అక్షయ్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. కొద్దిసేపటికే అనిరుద్ధ చౌదరి (4)ని కూడా రవికిరణ్‌ వెనక్కి పంపాడు. రవికిరణ్‌ వేసిన బంతి అనిరుద్ధ బ్యాట్‌ అంచును తాకుతూ వికెట్‌ కీపర్‌ సుమంత్‌ చేతుల్లోకి వెళ్లింది. అప్పటికి విదర్భ స్కోరు 24/2. పది ఓవర్లలోపే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న విదర్భను ఫజల్‌, గణేశ్‌ సతీశ్‌ (65; 153 బంతుల్లో 9×4, 1×6) ఆదుకున్నారు. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టుకు అండగా నిలిచారు. దాదాపు రెండు సెషన్‌ల పాటు హైదరాబాద్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఫజల్‌, సతీశ్‌ల అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. వీరిద్దరి భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. ఈ జోడీని విడదీసేందుకు ఐదుగురు ప్రధాన బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకపోయింది. చివరికి కొత్త కుర్రాడు అనికేత్‌రెడ్డి (1/45) హైదరాబాద్‌ శిబిరంలో ఆనందం నింపాడు. అనికేత్‌ బౌలింగ్‌లో భారీషాట్‌ కోసం వికెట్ల ముందుకొచ్చిన సతీశ్‌ను సుమంత్‌ స్టంపౌట్‌ చేశాడు. ఫజల్‌, సతీశ్‌ మూడో వికెట్‌కు 124 పరుగులు జోడించారు. అనంతరం ఫజల్‌కు సిద్ధేశ్‌ వాత్‌ (28) జతకలిశాడు. సిద్ధేశ్‌ అండగా ఫజల్‌ చెలరేగాడు. దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. 182 బంతుల్లో సెంచరీ సాధించి ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 21వ శతకాన్ని నమోదు చేశాడు. క్రీజులో కుదురుకున్న సిద్ధేశ్‌ను సిరాజ్‌ (1/70) ఔట్‌ చేశాడు. ఫజల్‌, సిద్ధేశ్‌ నాలుగో వికెట్‌కు 72 పరుగులు జతచేశారు. అక్షయ్‌ (9 బ్యాటింగ్‌)తో కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 22 పరుగులు జోడించిన ఫజల్‌ మరో వికెట్‌ పడకుండా రెండో రోజును ముగించాడు.

హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: 272
విదర్భ తొలి ఇన్నింగ్స్‌: ఫజల్‌ బ్యాటింగ్‌ 126; అక్షయ్‌ కోల్హర్‌ (ఎల్బీ) (బి) రవికిరణ్‌ 3; అనిరుద్ధ చౌదరి (సి) సుమంత్‌ (బి) రవికిరణ్‌ 4; గణేశ్‌ సతీశ్‌ (స్టంప్డ్‌) సుమంత్‌ (బి) అనికేత్‌రెడ్డి 65; సిద్ధేశ్‌ వాత్‌ (సి) సుమంత్‌ (బి) సిరాజ్‌ 28; అక్షయ్‌ వడ్కర్‌ బ్యాటింగ్‌ 9; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (75 ఓవర్లలో 4 వికెట్లకు) 242
వికెట్ల పతనం: 1-16, 2-24, 3-148, 4-220
బౌలింగ్‌: మహ్మద్‌ సిరాజ్‌ 17-3-70-1; రవికిరణ్‌ 13-6-19-2; సీవీ మిలింద్‌ 13-3-44-0; రవితేజ 7-1-26-0; మెహదీ హసన్‌ 10-2-34-0; అనికేత్‌రెడ్డి 15-3-45-1

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.