close

ప్రధానాంశాలు

ఔరా మొతెరా..!

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం ఏది? ఆ స్టేడియం ఏ దేశంలో ఉంది? అనే ప్రశ్నలకు ఎంసీసీ, ఆస్ట్రేలియా  అన్న జవాబులు ఇంకో పది రోజులే ఉంటాయి. ఈ నెల 24 నుంచి ఆ ప్రశ్నలకు మొతెరా, భారత్‌ అని సమాధానాలు రాసుకోవాల్సి ఉంటుంది. అవును.. ఎంసీసీని తలదన్నే స్టేడియాన్ని భారత్‌ నిర్మించింది. అహ్మదాబాద్‌లోని పురాతన సర్దార్‌ పటేల్‌ స్టేడియాన్ని కూలగొట్టి నిర్మించిన అధునాతన, అద్భుత స్టేడియాన్ని ఈ నెల 24నే ఆవిష్కరించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ స్టేడియాన్ని ఆరంభించనుండటం విశేషం. వచ్చే నెలలోనే ఇక్కడ ఓ మ్యాచ్‌ కూడా జరగబోతోంది. మరి ఈ స్టేడియం నిర్మాణ విశేషాలేంటో.. దీని ప్రత్యేకతలేంటో ఓసారి చూద్దాం పదండి.
* ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియం ఎంసీసీ. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నిర్మితమైన ఈ స్టేడియం సామర్థ్యం 1,00,024. దీన్ని మొతెరా స్టేడియం అధిగమించబోతోంది. 1,10,000 సామర్థ్యంలో అతి  పెద్ద క్రికెట్‌ స్టేడియంగా     అవతరించనుంది.
* ఎంసీసీని డిజైన్‌ చేసిన ఎం.ఎస్‌.పాపులస్‌ అనే ఆర్కిటెక్ట్‌ సంస్థే మొతెరా స్టేడియానికి కూడా రూపకల్పన చేయడం విశేషం.
* ఈ మైదానంలో మొత్తం 11 పిచ్‌లను తయారు చేయడం విశేషం. అందులో కొన్ని ఎర్ర మట్టితో, ఇంకొన్ని నల్లమట్టితో.. మరికొన్ని రెండింటి మిశ్రమంతో తయారు చేశారు. పేసర్లు, స్పిన్నర్లకు సమానంగా పిచ్‌లను తీర్చిదిద్దినట్లు స్టేడియం వర్గాలు చెబుతున్నాయి.
* ఈ మైదానంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎంత వర్షం పడ్డా 30 నిమిషాల్లో మైదానం నుంచి నీరంతా బయటికి వెళ్లిపోయి మ్యాచ్‌ మొదలుపెట్టడానికి అనువుగా తయారవుతుంది.
* ఇంతకుముందు ఇక్కడున్న సర్దార్‌ పటేల్‌ స్టేడియం సామర్థ్యం 53 వేలే. దాన్ని 2015లో కూల్చేసి అదే చోట కొత్త స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు మొదలుపెట్టారు. 2017 జనవరిలో శంఖుస్థాపన జరగ్గా.. ఎల్‌అండ్‌టీ సంస్థ మూడేళ్లలో స్టేడియం నిర్మాణం పూర్తి చేసింది.
* పక్కనే మెట్రో స్టేషన్‌ నుంచి నేరుగా స్టేడియం ఫస్ట్‌ ఫ్లోర్‌కు చేరుకునేలా ఏర్పాట్లున్నాయి. స్టేడియంలో ఏ మూల కూర్చున్నా వీక్షణకు ఏమీ ఇబ్బందుల్లేని విధంగా, ఏదీ అడ్డం పడకుండా స్టేడియాన్ని డిజైన్‌ చేశారు.
* స్టేడియం నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చయింది. ప్రపంచంలోనే అత్యధిక ఖర్చుతో నిర్మించిన క్రికెట్‌ స్టేడియం ఇదే.
* ఇందులో ఆటగాళ్ల సాధన కోసం ఇండోర్‌ నెట్స్‌, 6 పిచ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
* స్టేడియంలో మొత్తం 76 కార్పొరేట్‌ బాక్సులున్నాయి. ఆటగాళ్ల కోసం నాలుగు డ్రెస్సింగ్‌ రూంలు నిర్మించారు. ఇంకా స్టేట్‌ ఆఫ్‌ ద ఆర్ట్‌ క్లబ్‌, ఒలింపిక్‌ సైజు స్విమ్మింగ్‌ పూల్‌ కూడా ఉన్నాయి. 3 వేల కార్లు, 10 వేల ద్విచక్ర వాహనాలు పట్టేలా పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు.
* ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేతుల మీదుగా ఈ స్టేడియాన్ని ఆవిష్కరించనున్నారు. మార్చిలో ఆసియా ఎలెవన్‌, ప్రపంచ ఎలెవన్‌ మధ్య ఎగ్జిబిషన్‌ క్రికెట్‌ మ్యాచ్‌తో ఈ స్టేడియం అందుబాటులోకి వస్తుంది.
* మొత్తం 63 ఎకరాల పరిధిలో ఈ స్టేడియం, ఇతర నిర్మాణాలు విస్తరించి ఉన్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.