close

ప్రధానాంశాలు

గల్లీ ఆట..ఆశలు ఆవిరి!

ఓటమి అంచున హైదరాబాద్‌
ప్లేట్‌కు దిగజారే ప్రమాదం
విజయం దిశగా విదర్భ
రంజీ ట్రోఫీ మ్యాచ్‌

అనుకున్నదే అవుతోంది. ఊహించిందే జరుగుతోంది. హైదరాబాద్‌ ఆట మళ్లీ గాడితప్పింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌.. ఫీల్డింగ్‌లో నానాటికీ తీసికట్టుగా తయారవుతున్న హైదరాబాద్‌ ఆట మరింత దిగజారింది. ఆటగాళ్ల గల్లీ స్థాయి ప్రదర్శనతో ఆతిథ్య జట్టు ఓటమి దిశగా పయనిస్తోంది. ఇప్పటికే ఆరు పరాజయాలు మూటగట్టుకున్న హైదరాబాద్‌ ఏడో ఓటమితో రంజీ ట్రోఫీలో ఎలీట్‌ గ్రూపు నుంచి ప్లేట్‌కు పడిపోయే ప్రమాదంలో చిక్కుకుంది.

ఈనాడు, హైదరాబాద్‌: విదర్భతో రంజీ ట్రోఫీ గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆటగాళ్ల ప్రదర్శనను వర్ణించడానికి ఏ విశేషణాలు వాడాలో! ఆడుతోంది రంజీ ట్రోఫీనా లేక గల్లీ టోర్నీనా అన్నట్లు తయారైన హైదరాబాద్‌ ఆటగాళ్లను ఎంత విమర్శించినా తక్కువేనేమో! ఇప్పటికే ఆరు మ్యాచ్‌ల్లో ఓడి ఎన్నడూ లేనంత అపప్రదను మూటగట్టుకున్న హైదరాబాద్‌ ఆఖరి పోరాటంలోనైనా దమ్ము చూపుతుందనుకున్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. పోరాడకుండానే ఆటగాళ్లు వెన్నుచూపడంతో హైదరాబాద్‌ ఏడో ఓటమికి చేరువైంది. ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో హైదరాబాద్‌ పరాజయం దిశగా పయనిస్తోంది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. విదర్భకు 61 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్న హైదరాబాద్‌ ఖాతాలో ప్రస్తుతం ఉన్నవి 78 పరుగులే. చేతిలో మూడు వికెట్లే ఉన్నాయి. శనివారం ఆటకు చివరి రోజు. విదర్భ చకచకా మూడు వికెట్లు పడగొట్టడం.. వేగంగా లక్ష్యాన్ని ఛేదించడం.. విజయాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది! అదే జరిగితే హైదరాబాద్‌ ఎలీట్‌ గ్రూపు నుంచి ప్లేట్‌కు పడిపోవడం.. ఆతిథ్య జట్టు ప్రతిష్ట మరింత దిగజారడం తథ్యం!

మెరిసిన అనికేత్‌రెడ్డి: ఓవర్‌నైట్‌ స్కోరు 242/4తో మూడో రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన విదర్భ భారీస్కోరు సాధించడం ఖాయమే అనిపించింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ ఫయాజ్‌ ఫజల్‌ (151; 258 బంతుల్లో 19×4, 3×6) క్రీజులో ఉండటమే ఇందుకు కారణం. అయితే కెరీర్‌లో తొలి రంజీ మ్యాచ్‌ ఆడుతున్న ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అనికేత్‌రెడ్డి (4/61) రాణించడంతో పరిస్థితి మారింది. సీనియర్‌ బౌలర్లు సీవీ మిలింద్‌ (1/57), మెహదీ హసన్‌ (1/45)లతో కలిసి అనికేత్‌ విదర్భ పనిపట్టాడు. ఫజల్న్‌ు మిలింద్‌ ఔట్‌ చేయగా.. హసన్‌ బౌలింగ్‌లో అక్షయ్‌ వడ్కర్‌ (43) వికెట్ల ముందు దొరికిపోయాడు. టెయిలెండర్లను అనికేత్‌ అడ్డుకున్నాడు. దీంతో మూడో రోజు 38.4 ఓవర్లాడిన విదర్భ 91 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది.

మళ్లీ తడ‘బ్యాటు’: ఊహించిన దానికంటే తక్కువ స్కోరుకే విదర్భను ఆలౌట్‌ చేసిన ఆనందం హైదరాబాద్‌ శిబిరంలో ఎక్కువసేపు నిలువలేదు. విదర్భ బౌలర్ల ధాటికి హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. సీనియర్‌ ఆటగాడు అక్షత్‌రెడ్డి (9), కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (8), ఆల్‌రౌండర్‌ రవితేజ (4)లు 11 ఓవర్లలోపే పెవిలియన్‌కు చేరుకున్నారు. అప్పటికి జట్టు స్కోరు 42/3. హైదరాబాద్‌ ఓటమి అప్పుడే ఖరారైంది. అయితే కొత్త కుర్రాళ్లు రాహుల్‌ బుద్ధి (39; 59 బతంఉల్లో 1×4, 3×6), ప్రతీక్‌రెడ్డి (26; 51 బంతుల్లో 1×4, 1×6) కొద్దిసేపు పోరాడారు. విదర్భ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. కానీ వరుస ఓవర్లలో ప్రతీక్‌రెడ్డి, రాహుల్‌ ఔటడంతో హైదరాబాద్‌ కథ మళ్లీ మొదటికొచ్చింది. 3 పరుగుల వ్యవధిలో ప్రతీక్‌, రాహుల్‌, సీవీ మిలింద్‌ (2) ఔటవడంతో హైదరాబాద్‌ కోలుకోలేకపోయింది. 89 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. వికెట్‌ కీపర్‌ సుమంత్‌ (25 బ్యాటింగ్‌; 53 బంతుల్లో 2×4, 1×6), హసన్‌ (24; 57 బంతుల్లో 2×4)లు జట్టును ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 43 పరుగులు జోడించి హైదరాబాద్‌ స్కోరును 100 పరుగులు దాటించారు. చివర్లో హసన్‌ వికెట్‌ను కూడా కోల్పోయిన హైదరాబాద్‌ సుమంత్‌పైనే ఆశలు పెట్టుకుంది. నాలుగో రోజు ఆటలో సుమంత్‌ ఎంతసేపు పోరాడతాడో చూడాలి.

హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: 272
విదర్భ తొలి ఇన్నింగ్స్‌: 333

హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ (బి) సర్వాటె 8; అక్షత్‌రెడ్డి (బి) తకారె 9; రాహుల్‌ (సి) చౌదరి (బి) సర్వాటె 39; రవితేజ (సి) వాత్‌ (బి) సర్వాటె 4; ప్రతీక్‌రెడ్డి (సి) యశ్‌ (బి) వఖారె 26; సుమంత్‌ బ్యాటింగ్‌ 25; మిలింద్‌ (బి) సర్వాటె 2; హసన్‌ (ఎల్బీ) (బి) వఖారె 24; అనికేత్‌రెడ్డి బ్యాటింగ్‌ 1; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం: (49 ఓవర్లలో 7 వికెట్లకు) 139
వికెట్ల పతనం: 1-16, 2-32, 3-42, 4-87, 5-87, 6-89, 7-132
బౌలింగ్‌: రజనీష్‌ గుర్బాని 4-0-21-0; ఆదిత్య తకారె 4-2-8-1; ఆదిత్య సర్వాటె 20-4-68-4; అక్షయ్‌ వఖారె 17-5-36-2; యశ్‌ ఠాకూర్‌ 3-0-4-0; అనిరుద్ధ చౌదరి 1-0-1-0.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.