close

ప్రధానాంశాలు

పేస్‌కు పడిపోయారు

భారత్‌ 263 ఆలౌట్‌
న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో వార్మప్‌ మ్యాచ్‌
ఆదుకున్న విహారి, పుజారా

5 పరుగులకే 3 వికెట్లు..
4 వికెట్లకు 233 పరుగులు.. 263 ఆలౌట్‌..
ఇదీ న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో తొలి రోజు భారత ఇన్నింగ్స్‌ సాగిన తీరు! పచ్చిక పిచ్‌పై తడబడిన బ్యాట్స్‌మెన్‌ చేజేతులా వికెట్లు అప్పగించేశారు. కివీస్‌తో తొలి టెస్టులో ఓపెనింగ్‌ స్థానానికి పోటీలో ఉన్న పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌..  ప్రత్యర్థి పేసర్ల ధాటికి రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. పిచ్‌ బౌన్స్‌, స్వింగ్‌కు అనుకూలిస్తున్న పరిస్థితుల్లోనూ గొప్ప సంయమనంతో బ్యాటింగ్‌ చేసిన హనుమ విహారి శతకంతో జట్టును ఆదుకోగా.. చెతేశ్వర్‌ పుజారా కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌
గౌరవప్రదమైన స్కోరుతో ముగించింది.

హామిల్టన్‌

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ముంగిట కివీస్‌ ఎలెవన్‌తో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్‌కు పేస్‌ దెబ్బ! పచ్చిక పిచ్‌పై తడబడే బలహీనతను టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ మరోసారి బయటపెట్టుకున్న వేళ.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 263 పరుగులే చేయగలిగింది. అయితే ఆ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే హనుమ విహారి (101; 182 బంతుల్లో 10×4 3×6), చెతేశ్వర్‌ పుజారా (93; 211 బంతుల్లో 11×4, 1×6)ల పోరాట ఫలితమే. శుక్రవారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో భారత్‌ను న్యూజిలాండ్‌ పేసర్లు దెబ్బ తీసినా.. వీరి పట్టుదలతో పుంజుకుంది. కెప్టెన్‌ కోహ్లి మ్యాచ్‌లో ఉన్నా బ్యాటింగ్‌కు దిగలేదు.

5 పరుగులకే 3 వికెట్లు: అలా భారత్‌ ఇన్నింగ్స్‌ మొదలైందో లేదో ఇలా వికెట్లు టపటపా పడిపోయాయి. తొలి ఓవర్లో పేసర్‌ కుగెలీన్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ బంతికి ఓపెనర్‌ పృథ్వీ షా (0).. షార్ట్‌ లెగ్‌లో రవీంద్రకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో కుగెలీన్‌ రెండు వికెట్లు తీసి గట్టి దెబ్బ కొట్టాడు. ఆఫ్‌స్టంప్‌పై పడిన బంతిని వెంటాడిన మయాంక్‌ (1) స్లిప్‌లో క్లీవర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగగా.. శుభ్‌మన్‌ గిల్‌ (0) కూడా కుగెలీన్‌ ఉచ్చులో చిక్కుకుని ఔటయ్యాడు. గత మూడు ఫస్ట్‌క్లాస్‌ ఇన్నింగ్స్‌ల్లో (83, 204 నాటౌట్‌, 136) సత్తా చాటిన గిల్‌.. షార్ట్‌ పిచ్‌ బంతిని పుల్‌ చేయబోయి గల్లీలో సీఫర్ట్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆరంభంలోనే భారత్‌ కష్టాల్లో పడింది. పుజారాతో కలిసి నాలుగో వికెట్‌కు 33 పరుగులు జోడించిన రహానె (18) కూడా స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో టీమ్‌ఇండియా 38/4తో నిలిచింది.

నిలిచిన విహారి, చెతేశ్వర్‌: ఒకవైపు తక్కువ స్కోరుకే నాలుగు వికెట్లు పడడం, బంతి స్వింగ్‌ అవుతున్న స్థితిలో బరిలో దిగిన విహారి.. పుజారాతో కలిసి సంయమనంతో బ్యాటింగ్‌ చేశాడు. కివీస్‌ పేసర్ల షార్ట్‌ పిచ్‌ బంతులకు నిలిచిన ఈ యువ ఆటగాడు.. ఆఫ్‌ సైడ్‌ ఊరించేలా పడ్డ బంతులను ఆచితూచి ఆడాడు. పాదాల్ని చక్కగా ఉపయోగించుకున్న విహారి.. కుదురుకున్నాక చూడముచ్చటైన షాట్లతో స్కోరు పెంచాడు. ఇష్‌ సోధి బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్‌ లేట్‌ కట్స్‌, డ్రైవ్‌లు కొట్టిన విహారి.. ఆఫ్‌స్పిన్నర్‌ రచిన్‌ రవీంద్ర బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు కొట్డాడు. మరోవైపు పుజారా తన శైలిలో ఆడాడు. ఆరంభంలో పేసర్ల పరీక్షకు నిలిచిన అతను.. ఎప్పట్లాగే క్రీజులో పాతుకుపోయాడు. సోధి బౌలింగ్‌లో షార్ట్‌ బంతులను పుల్‌ చేసిన చెతేశ్వర్‌.. బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌లో చక్కటి సిక్స్‌ బాదాడు. అడ్డంగా షాట్లు ఆడకుండా.. నేరుగానే ఎక్కువగా స్ట్రోక్స్‌ కొట్టిన ఈ జోడీ నాలుగో వికెట్‌కు 195 పరుగులు జత చేసి భారత్‌ను మంచి స్థితిలో నిలిపింది. టీ విరామానికి ముందు విహారి కొట్టిన షాట్‌ టాప్‌ ఎడ్జ్‌ తీసుకున్నా.. అది ఫీల్డర్‌కు దొరకలేదు. ఇదే జోరులో అతను 180 బంతుల్లో శతకం సాధించాడు. వెంటనే అతను రిటైరై వెనుదిరిగాడు.

30 పరుగులకే 5 వికెట్లు: 233/4.. ఒక దశలో భారత్‌ స్కోరిది. 350-400 పరుగులు ఖాయమనిపించిన సందర్భమది. కానీ విహారి రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాక 30 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా తక్కువ స్కోరుకే ఇన్నింగ్స్‌ను ముగించింది. సెంచరీకి ఏడు పరుగుల దూరంలో పుజారా కొట్టిన షాట్‌ టాప్‌ ఎడ్జ్‌ తీసుకోగా.. కీపర్‌ క్లీవర్‌ క్యాచ్‌ పట్టేశాడు. ఇక్కడి నుంచి భారత ఇన్నింగ్స్‌ మరోసారి కుదుపునకు లోనైంది. చెతేశ్వర్‌ వెనుదిరిగిన కాసేపటికే విహారి రిటైర్డ్‌ ఔట్‌గా ఔటయ్యాడు. ఈ స్థితిలో భారత్‌ రెండు ఓవర్ల వ్యవధిలో రిషబ్‌ పంత్‌ (7), సాహా (0), అశ్విన్‌ (0) వికెట్లు కోల్పోయి 250/9తో నిలిచింది. సోధి ఒకే ఓవర్లో పంత్‌, అశ్విన్‌లను ఔట్‌ చేయగా.. సాహా వికెట్‌ను గిబ్సన్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఉమేశ్‌ (9 నాటౌట్‌)తో కలిసి కాసేపు నిలిచిన జడేజా (8).. సోధి బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరడంతో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ ముగిసింది.

భారత్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీషా (సి) రవీంద్ర (బి) కుగెలీన్‌ 0; మయాంక్‌ (సి) క్లీవర్‌ (బి) కుగెలీన్‌ 1; పుజారా (సి) క్లీవర్‌ (బి) గిబ్సన్‌ 93; శుభ్‌మన్‌ గిల్‌ (సి) సీఫర్ట్‌ (బి) కుగెలీన్‌ 0; రహానె (సి) బ్రూస్‌ (బి) నీషమ్‌ 18; విహారి రిటైర్డ్‌ ఔట్‌ 101; పంత్‌ (సి) కుగెలీన్‌ (బి) సోధి 7; సాహా (సి) క్లీవర్‌ (బి) గిబ్సన్‌ 0; అశ్విన్‌ ఎల్బీ (బి) సోధి 0; ఉమేశ్‌ నాటౌట్‌ 9; జడేజా (సి) అలెన్‌ (బి) సోధి 8; ఎక్స్‌ట్రాలు 26 మొత్తం: (78.5 ఓవర్లలో ఆలౌట్‌) 263
వికెట్ల పతనం: 1-0, 2-5, 3-5, 4-38, 5-233, 6-245, 7-246, 8-246, 9-250
బౌలింగ్‌: కుగెలీన్‌ 14-2-40-3; టిక్నర్‌ 15-3--37-0; మిచెల్‌ 7-1-15-0; నీషమ్‌ 13-3-29-1; గిబ్సన్‌ 10-1-26-2; ఇష్‌ సోధి 14.5-0-72-3; రవీంద్ర 5-1-30-0


అవసరమైతే ఓపెనింగ్‌ చేస్తా

హామిల్టన్‌: జట్టు అవసరాల కోసం ఓపెనింగ్‌ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని హనుమ విహారి అన్నాడు. ప్రస్తుతం మిడిలార్డర్లో ఆడుతున్న విహారికి టెస్టుల్లో ఓపెనర్‌గా దిగిన అనుభవమూ ఉంది. రోహిత్‌, ధావన్‌ గాయాలతో జట్టుకు దూరం కావడం.. ఓపెనింగ్‌ స్థానాలకు పోటీలో ఉన్న మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో విఫలం కావడంతో కివీస్‌తో తొలి టెస్టులో ఎవరు ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో విహారి మాట్లాడుతూ.. ‘‘ఆటగాడిగా ఏ స్థానంలో దిగడానికైనా సిద్ధంగా ఉన్నా. ఏ స్థానంలో రావాలన్నది ఎవరూ చెప్పలేదు. ఒకవేళ జట్టు యాజమాన్యం కోరుకుంటే ఓపెనర్‌గా కూడా ఆడతా. జట్టు కూర్పును అర్ధం చేసుకోవాలి. ఫలానా స్థానంలో బ్యాటింగ్‌ చేయట్లేదే అని నిరాశ పడకూడదు. న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో వార్మప్‌ మ్యాచ్‌ తొలి రోజు ఆరంభంలో అదనపు బౌన్స్‌ ఇబ్బంది పెట్టింది. భారత్‌-ఏ తరఫున కివీస్‌-ఎతో రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడడం వల్ల ఇక్కడ పిచ్‌ పరిస్థితులపై అవగాహన వచ్చింది. మొదట పేస్‌కు అనుకూలించినా..తర్వాత బ్యాటింగ్‌కు ఇబ్బంది ఉండదు’’ అని చెప్పాడు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.