close

ప్రధానాంశాలు

ఈ జట్టుకు ఆ దమ్ముందా?

మహిళల టీ20 ప్రపంచకప్‌ రేపటి నుంచే

డజను వన్డే ప్రపంచకప్‌లు.. అరడజను టీ20 ప్రపంచకప్‌లు.. ఒక్కటంటే ఒక్కటీ సొంతం కాలేదు. భారత అమ్మాయిల ఖాతా ఖాళీ! ఒకప్పుడైతే మన అమ్మాయిలా.. కప్పు గెలవడమా అన్నట్లుండేది! గత కొన్నేళ్లలో పరిస్థితి మెరుగుపడింది. అయినా కప్పు మాత్రం కలే!

కానీ ఈసారి ఆశలు, అంచనాలు ఎక్కువే ఉన్నాయి. టోర్నీ అత్యుత్తమ జట్లలో ఒకటిగా భారత్‌ను పరిగణిస్తున్నారు. కప్పు కల నెరవేర్చుకోవడానికి ఇదే సరైన తరుణం అంటున్నారు.

మరి ఈసారి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ అవకాశాలెలా ఉన్నాయి? మన జట్టు బలాలేంటి.. బలహీనతలేంటి? నిజంగా హర్మన్‌ సేనకు కప్పు గెలిచే సత్తా ఉందా?చూద్దాం పదండి.

ఈనాడు క్రీడావిభాగం

ప్రస్తుతం మహిళల క్రికెట్‌ మేటి జట్లలో భారత్‌ ఒకడనంలో సందేహం లేదు. మహిళల క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న ఆస్ట్రేలియాకు ఎదురు నిలిచే సత్తా ఉన్న జట్టు భారతే. ఇంగ్లాండ్‌ సహా మిగతా జట్లను దాటి భారత్‌ ముందుకొచ్చింది. ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియాతో ఫైనల్‌కు అర్హత సాధించింది. మునుపటిలా కంగారూ జట్టును చూసి భారత్‌ భయపడే పరిస్థితి లేదు. 2017 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆ జట్టును భారత్‌ ఎలా కంగు తినిపించిందో తెలిసిందే. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడూ ఆసీస్‌ను ఓడిస్తూనే ఉంది. టోర్నీలో టైటిల్‌కు భారత్‌కు ఆస్ట్రేలియానే అడ్డుగా నిలవొచ్చు. సమష్టిగా సత్తా చాటితే ఆ జట్టును అధిగమించి కప్పు గెలవడానికి అవకాశాలున్నాయి. జట్టు గతంతో పోలిస్తే బలపడింది. ఫామ్‌ బాగుంది. కాబట్టి  ఆత్మవిశ్వాసంతో, సామర్థ్యానికి తగ్గట్లు ఆడితే మాత్రం కప్పు గెలవడం కష్టమేమీ కాదు.


సమస్యంతా అక్కడే

భారత్‌ను కలవరపెడుతున్నది పేస్‌ విభాగం. జులన్‌ గోస్వామి తర్వాత పేస్‌ దళాన్ని నడిపించే బౌలర్‌ కరవయ్యారు. ఆమెకు దగ్గరగా వచ్చే బౌలర్‌ కూడా ఎవరూ లేరు. ప్రస్తుత ప్రధాన పేసర్‌ అయిన శిఖా పాండే 45 టీ20 మ్యాచ్‌లాడి పడగొట్టిన వికెట్లు 29. జట్టులో నం.1 పేసర్‌ ప్రదర్శనే ఇలా ఉందంటే.. భారత పేస్‌ బలం ఎలాంటిదో అంచనా వేయొచ్చు. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి (20 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు).. కొత్త బౌలర్‌ పూజా వస్త్రాకర్‌ (18 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు)ల ప్రదర్శనా అంతంతమాత్రమే. మొత్తంగా పేస్‌ విభాగంపై ఆశలైతే పెద్దగా లేవు. స్పిన్నర్ల మీదే జట్టు ఆధారపడబోతోంది. మరి స్పిన్నర్లు విఫలమైతే ఏంటి పరిస్థితి అన్నది చూడాలి. బ్యాటింగ్‌పై ఏమాత్రం నమ్మకం పెట్టుకోలేని వికెట్‌ కీపర్‌ తానియా భాటియా (45 మ్యాచ్‌ల్లో 139 పరుగులు) జట్టుకు మరో బలహీనత. షఫాలీ, స్మృతి, హర్మన్‌, జెమీమా వెనుదిరిగితే.. నిలబడి ఆడి గెలిపించేవాళ్లే లేరు. మిగతా బ్యాటర్లందరి గణాంకాలూ పేలవం. మొత్తంగా చూస్తే.. ఆస్ట్రేలియా తరహా ఆల్‌రౌండ్‌ బలం కొరవడటం భారత్‌కు బలహీనతగా కనిపిస్తోంది.


గతం గతః

గత ప్రదర్శన చూస్తే.. టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టుది అంత గొప్ప ప్రదర్శనా కాదు. అలాగని తీసిపడేయదగ్గదీ కాదు. ఆరు ప్రపంచకప్‌ల్లో మూడుసార్లు సెమీస్‌ చేరింది. అయితే 2009, 2010 టోర్నీల్లో సెమీస్‌ చేరినా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ లాంటి జట్లను దాటి భారత్‌ టైటిల్‌ గెలుస్తుందన్న అంచనాలు లేవు! ఏ విభాగంలోనూ అంత బలంగా లేని అప్పటి జట్టు సెమీస్‌ చేరడాన్నే గొప్పగా భావించారు. తొలి రెండు టోర్నీల తర్వాత మూడు పర్యాయాలు భారత్‌ది పేలవ ప్రదర్శన. ఒక్కసారీ గ్రూప్‌ దశ దాటలేదు. 2016లో సొంతగడ్డపై జరిగిన టోర్నీలో సెమీస్‌ కూడా చేరలేకపోవడం అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే గత టోర్నీలో భారత్‌ బాగానే ఆడింది. ముందు ఏడాది వన్డే ప్రపంచకప్‌లో టైటిల్‌కు అత్యంత చేరువగా వెళ్లి త్రుటిలో ఓడిన జట్టు.. ఆ స్ఫూర్తితో టీ20 ప్రపంచకప్‌లో ఆకట్టుకుంది. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్‌ సేన.. సెమీఫైనల్‌కు మిథాలీ రాజ్‌ను పక్కన పెట్టడం విజయావకాశాల్ని దెబ్బ తీసింది. ఆమె టోర్నీలో బాగానే ఆడుతున్నప్పటికీ, స్లో పిచ్‌పై తన అవసరం ఉన్నప్పటికీ తుది జట్టులో చోటివ్వకపోవడం వివాదాస్పదమైంది. మిథాలీ ఉంటే భారత్‌ ఫైనల్‌ చేరేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదం మహిళల క్రికెట్‌ను కొన్ని రోజుల పాటు కుదిపేసింది. కొన్ని నెలలకు దీన్నుంచి బయటపడి.. 2020 ప్రపంచకప్‌ సన్నాహాలు మొదలుపెట్టింది భారత్‌. ఇప్పుడు గతం గతః అనుకుని అందరూ ఈసారి హర్మన్‌ బృందం కప్పు తెస్తుందన్న ఆశతో ఉన్నారు.


ఈసారి అదే ఆశ..

ఈసారి ప్రపంచకప్‌ ఫేవరెట్లలో భారత్‌ ఒకటిగా విశ్లేషకులు పరిగణిస్తుండటానికి ప్రధాన కారణాలు రెండు.. బ్యాటింగ్‌, స్పిన్‌. చాలా ఏళ్లు బ్యాటింగ్‌లో మిథాలీ లాంటి ఒకరిద్దరు స్టార్లనే నమ్ముకుని సాగిన భారత్‌.. గత కొన్నేళ్లలో స్టార్లను తీర్చిదిద్దుకుంది. జట్టులో మ్యాచ్‌ విన్నర్లు పెరిగారు. హర్మన్‌ప్రీత్‌ ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకరిగా ఎదగడం భారత్‌కు అతి పెద్ద సానుకూలత. ఒత్తిడిలో భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా ఆమె సొంతం. పురుషుల స్థాయిలో ఆమె విధ్వంసం సృష్టించగలదు. హర్మన్‌ లక్షణాలున్న మరో మేటి బ్యాటర్‌ స్మృతి మంధాన. ఓపెనర్‌ అయిన స్మృతి జట్టుకు శుభారంభాలందించడంలో కీలకంగా ఉంటోంది. వీళ్లిద్దరికీ తోడు.. షఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ లాంటి యువ సంచలనాలు భారత బ్యాటింగ్‌ను బలోపేతం చేస్తున్నారు. జెమీమా మిడిలార్డర్లో నిలకడగా ఆడుతుండగా.. షఫాలి ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటోంది. నిమిషాల్లో ఫలితాలు మార్చేయగల షఫాలి లాంటి హిట్టర్‌ లేకపోవడం ఇన్నేళ్లు భారత్‌కు పెద్ద బలహీనతగా ఉండేది. ఆమె రాకతో లోటు తీరిపోయింది. ప్రపంచకప్‌లో షఫాలి అత్యంత కీలకం కాగలదని అంచనా. ఇక దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌, రాజేశ్వరి గైక్వాల్‌, రాధ యాదవ్‌, హర్లీన్‌ డియోల్‌.. ఇలా స్పిన్‌ వనరులకు లోటే లేదు. టోర్నీలో అత్యుత్తమ స్పిన్‌ దళం ఉన్నది భారత్‌కే. ఆస్ట్రేలియా పిచ్‌లు గతంతో పోలిస్తే స్పిన్‌కు బాగానే అనుకూలిస్తున్న నేపథ్యంలో భారత స్పిన్నర్లు ప్రత్యర్థులకు సవాలు విసరగలరని అంచనా.


టీ20ల్లో భారత్‌

మ్యాచ్‌లు: 118
విజయాలు: 63
ఓటములు: 53
ఫలితం తేలనివి: 2
అత్యధిక స్కోరు: 198/4 (2018లో ఇంగ్లాండ్‌పై)
అత్యల్పం: 62 (2011లో ఆస్ట్రేలియాపై)
టీ20 ర్యాంకు: 4


గత 10 మ్యాచ్‌ల్లో:

ఓటమి, గెలుపు,
ఓటమి, ఓటమి,
గెలుపు, గెలుపు,
గెలుపు, గెలుపు,
గెలుపు, గెలుపు.


ప్రపంచకప్‌లో భారత్‌ మ్యాచ్‌లు (గ్రూప్‌-ఎ)

ఫిబ్రవరి21 : ఆస్ట్రేలియాతో (సిడ్నీలో)
26 : థాయిలాండ్‌తో (మనుక ఓవల్‌లో)
28 : పాకిస్థాన్‌తో (మనుక ఓవర్‌లో)
మార్చి 1 : వెస్టిండీస్‌తో (సిడ్నీలో)


టీ20 ప్రపంచకప్‌లో భారత్‌

2009: సెమీస్‌
2010: సెమీస్‌
2012: గ్రూప్‌ దశ
2014: గ్రూప్‌ దశ
2016: గ్రూప్‌ దశ
2018: సెమీస్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.