close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భారత  హాకీ  బంగారం

అది 1948, ఆగస్టు 12.. తొలి స్వాతంత్య్ర దినోత్సవ వార్షిక వేడుకలకు మరో మూడు రోజులు ఉండగా.. దేశమంతా పండగ వాతావరణం నెలకొంది.. మరోవైపు లండన్‌లో భారత హాకీ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. దాదాపు రెండు వందల ఏళ్లు తమ ప్రజలను బానిసలుగా చేసి.. దేశ సంపద కొల్లగొట్టిన ఆంగ్లేయుల జట్టుతో యుద్ధంలో తలపడేందుకు తయారైంది. ఒలింపిక్స్‌ పురుషుల హాకీ ఫైనల్‌ మ్యాచ్‌ దానికి వేదికగా నిలిచింది. పట్టుదలతో కదిలిన మన కుర్రాళ్లు బ్రిటన్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది.. దేశ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ బహుమతిని అందించింది.. బల్బీర్‌ సింగ్‌ సీనియర్‌. స్వతంత్ర భారతావని తొలితరం క్రీడా దిగ్గజం అతను. హ్యాట్రిక్‌ ఒలింపిక్స్‌ స్వర్ణాలు సాధించిన హాకీ యోధుడతను. దేశ క్రీడా చరిత్రలో ఎప్పటికీ వెలిగిపోయే ధ్రువతార అతను.
 

ఈనాడు క్రీడావిభాగం

కొంతమంది ఆట వల్ల అందలం ఎక్కుతారు.. మరికొందరేమో తమ నైపుణ్యాలతో ఆటనే అందలం ఎక్కిస్తారు. ఆ రెండో కోవకు చెందినవాడే బల్బీర్‌ సింగ్‌ సీనియర్‌గా పేరెన్నికగన్న బల్బీర్‌ సింగ్‌ దోసాంజ్‌. సెంటర్‌ ఫార్వార్డ్‌ ఆటగాడిగా.. భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించి దేశ క్రీడా రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. 1923లో అప్పటి పంజాబ్‌లోని హరిపూర్‌ ఖల్సా గ్రామంలో పుట్టిన బల్బీర్‌ను.. 1936 ఒలింపిక్స్‌ హాకీలో భారత జట్టు విజయం ఆటవైపు నడిపించింది. అప్పటి ఖల్సా కళాశాల జట్టు కోచ్‌ హర్‌బెయిల్‌ సింగ్‌ అతనిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. కెప్టెన్‌గా పంజాబ్‌ విశ్వవిద్యాలయాన్ని వరుసగా మూడుసార్లు జాతీయ విశ్వవిద్యాలయాల ఛాంపియన్‌గా నిలిపాడు. రాష్ట్ర జట్టు జాతీయ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత జాతీయ శిక్షణ శిబిరంలో చేరాడు.


ఆ మూడు ఒలింపిక్స్‌

1948 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత రెండో మ్యాచ్‌ (అర్జెంటీనాతో)తో అరంగేట్రం చేసి ఆరు గోల్స్‌తో సత్తాచాటాడు. ఆడుతున్నది తొలి మ్యాచ్‌.. అది కూడా ఒలింపిక్స్‌ లాంటి ప్రఖ్యాత టోర్నీలో అనే ఒత్తిడి లేకుండా హాకీ స్టిక్‌తో మాయ చేశాడు. గ్రేట్‌ బ్రిటన్‌తో తుది సమరంలో తొలి రెండు గోల్స్‌తో జట్టుకు అదిరే ఆరంభాన్ని అందించాడు. అదే జోరులో జట్టు 4-0తో విజయాన్ని అందుకుంది. తొలిసారి త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుండగా.. జాతీయ గీతం వినిపిస్తుండగా.. పతకాలు అందుకోవడం జీవితకాల అనుభమని ఓ సారి బల్బీర్‌ చెప్పాడు. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌ సెమీస్‌లో బ్రిటన్‌పై హ్యాట్రిక్‌ కొట్టి జట్టును ఫైనల్‌ చేర్చిన అతను పసిడి పోరులో నెదర్లాండ్స్‌పై స్టిక్‌ను మంత్రదండంలా మార్చి.. అయిదు గోల్స్‌తో గెలుపునందించాడు. ఒలింపిక్స్‌ హాకీ ఫైనల్లో అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాడిగా అతను సృష్టించిన రికార్డు చెక్కుచెదరలేదు. 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో ఈ సారి కెప్టెన్‌గా జట్టును గెలిపించాడు. మొత్తం 8 ఒలింపిక్స్‌ మ్యాచ్‌లు ఆడి 22 గోల్స్‌ చేశాడు. 1957లో పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించిన అతను క్రీడారంగంలో ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా నిలిచాడు. 1958 ఆసియా క్రీడల్లో రజతం గెలిచాడు.


ఆ కోరిక తీరకుండానే..

భారత హాకీ అనగానే ముందుగా వినిపించే పేరు ధ్యాన్‌చంద్‌. స్వాతంత్య్రానికి పూర్వం భారత హాకీకి ధ్యాన్‌చంద్‌ మూల స్తంభమైతే.. స్వతంత్ర భారతాన్ని ఆటలో ముందుకు తీసుకెళ్లింది మాత్రం బల్బీరే. ఇద్దరూ మూడేసి ఒలింపిక్స్‌ స్వర్ణాలు సాధించినవాళ్లే. ధ్యాన్‌చంద్‌ ఆ మెగా క్రీడల్లో (1928, 1932, 1936 ఒలింపిక్స్‌ల్లో) విజయాల బాట పరిస్తే.. ఆ మార్గాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దిన ఆటగాడు బల్బీర్‌. ఇద్దరూ సెంటర్‌ ఫార్వర్డ్‌ ఆటగాళ్లే. అయితే వీళ్లు ఆడిన పరిస్థితులు విభిన్నం. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి.. పాకిస్థాన్‌ ప్రత్యేక దేశంగా ఏర్పడిన తర్వాత చాలా మంది ఉత్తమ ఆటగాళ్లు అక్కడికి వెళ్లిపోయారు. అలాంటి సంక్లిష్ట దశలో బల్బీర్‌ తన అద్భుత నైపుణ్యాలతో జట్టులో ఆత్మవిశ్వాసం నింపి.. అద్భుత విజయాలు సాధించే దిశగా నడిపాడు. అయితే బల్బీర్‌ తన చివరి కోరిక తీరకుండానే చనిపోయాడు. జాతీయ క్రీడా మ్యూజియం కోసం ఒలింపిక్స్‌ పతకాలు, పద్మశ్రీ అవార్డు మినహా మిగతా జ్ఞాపకాలను (మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో ధరించిన బ్లేజర్‌, ఆసియా క్రీడల రజతం సహా ఇతర పతకాలు, అరుదైన ఫోటోలు) 1985లో సాయ్‌కు అందజేశాడు. కానీ ఆ మ్యూజియం ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. దాంతో తన జ్ఞాపకాలను తిరిగి ఇచ్చేయాలంటూ కొన్నేళ్లుగా అతను సాయ్‌ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.


సంకెళ్లతో బంధించారట

హాకీకే తన జీవితాన్ని అంకితం చేసిన అతను ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌ అవతారమెత్తాడు. తన మాటలతో ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. అతని శిక్షణలో భారత జట్టు 1971 ప్రపంచకప్‌ కాంస్యం గెలిచింది. అతను మేనేజర్‌గా ఉన్నపుడు 1975 ప్రపంచకప్‌లో స్వర్ణాన్ని సొంతం  చేసుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకూ భారత్‌ ప్రపంచకప్‌లో పతకం గెలవలేకపోయింది. మరోవైపు 1946లో పంజాబ్‌ పోలీస్‌ హాకీ జట్టు తరపున ఆడాలని కోరితే తిరస్కరించినందుకు బల్బీర్‌ను సంకెళ్లతో బంధించారట! ఆ తర్వాత ఒప్పుకోవడంతో పోలీస్‌ శాఖలో ఉద్యోగం కూడా ఇప్పించారని ఓ సందర్భంలో అతనే చెప్పాడు. తనను అరెస్టు చేసిన జాన్‌ బెనెట్‌.. లండన్‌లో ఒలింపిక్స్‌ కోసం వెళ్లినపుడు బల్బీర్‌ను ఆప్యాయంగా కౌగిలించుకుని స్వాగతం పలికాడు.


‘‘ఆటలో తన అద్భుత ప్రదర్శనలతో పద్మశ్రీ బల్బీర్‌ సింగ్‌ సీనియర్‌ ఎప్పటికీ గుర్తుండిపోతారు. అతను దేశానికి ఖ్యాతి తెచ్చారు. గర్వకారణంగా నిలిచారు. నిస్సందేహంగా ఆయనో గొప్ప హాకీ ఆటగాడు. ఓ మార్గనిర్దేశకుడిగానూ తన ముద్ర వేశాడు. బల్బీర్‌ కన్నుమూశాడనే వార్త బాధను కలిగిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి’’

- ప్రధాని మోదీ

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.