close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విరాట్‌ ఉగ్రరూపస్య

మరపురాని మెరుపులు


గత దశాబ్దంలో క్రికెట్లో పరుగుల వేగం ఎంతగానో పెరిగింది. వన్డేల్లో 300 పైచిలుకు లక్ష్యాల ఛేదన మామూలు విషయం అయిపోయింది.  50 ఓవర్లలో 321 పరుగులు చేసి గెలవడమంటే మరీ కష్టమేమీ కాదు. అయితే అదే 321 పరుగుల్ని 40 ఓవర్లలోనే ఛేదించమంటే..? అలా  అయితేనే ఫైనల్‌ ఆశలు సజీవంగా ఉంటాయంటే..? ఈ రోజుల్లో అయినా సరే.. అది కఠిన సవాలే! అలాంటిది ఎనిమిదేళ్ల కిందట ఇలాంటి పరిస్థితి ఎదురైంది టీమ్‌ఇండియాకు! అయితే మన జట్టు అది సాధ్యం కాని పని అని వదిలేయలేదు. ఛేదన అంటేనే చెలరేగిపోయే ఓ మొనగాడు ముందుండి పోరాటాన్ని నడిపించాడు. 60 బంతులుండగా లక్ష్యాన్ని ఛేదించమంటే.. 80 బంతులు మిగిల్చి పని పూర్తి చేశాడు. ఆ మొనగాడు.. విరాట్‌ కోహ్లి. అతను ఉగ్రరూపం దాల్చి లంకేయుల్ని
ఉతికారేసిన ఇన్నింగ్స్‌ విశేషాలు గుర్తు చేసుకుందాం.

2012 కామన్వెల్త్‌ బ్యాంక్‌ సిరీస్‌లో ధోనీసేన అంచనాల్ని అందుకోలేకపోయింది. సిరీస్‌లో ఏడు లీగ్‌ మ్యాచ్‌లాడి రెండే గెలిచింది. ఆస్ట్రేలియా, శ్రీలంక ఫైనల్‌ రేసులో ముందు నిలిచాయి. భారత్‌ ఫైనల్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే లంకతో చివరి లీగ్‌ మ్యాచ్‌లో గెలవడంతో పాటు బోనస్‌ పాయింట్‌ కూడా సాధించాలి. మొదట బ్యాటింగ్‌ చేసిన లంక.. దిల్షాన్‌ (160), సంగక్కర (105) శతకాల సాయంతో 320 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్‌కు బోనస్‌ విజయం దక్కాలంటే లక్ష్యాన్ని 40 ఓవర్లలోనే ఛేదించాలి. ఓపెనింగ్‌లో సెహ్వాగ్‌, సచిన్‌ ఉండటంతో ఈ జోడీ అద్భుతం చేస్తుందేమో అని చూశారు అభిమానులు. వాళ్లిద్దరూ జట్టుకు మెరుపు ఆరంభమే ఇచ్చారు. పది ఓవర్లలోనే స్కోరు 86కు చేరుకుంది. కానీ ఆలోపే ఓపెనర్లిద్దరూ ఔటైపోయారు. గంభీర్‌కు కోహ్లి జతకలిశాడు. అయితే వీళ్లిద్దరూ ఓపెనర్ల జోరును అందుకోలేకపోయారు. సాధించాల్సిన రన్‌రేట్‌ 8కి పైనే ఉండగా.. ఓవర్‌కు అటు ఇటుగా 6 రన్‌రేట్‌తో పరుగులు చేయగలిగారు. గంభీర్‌ 64 బంతుల్లో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లి అర్ధశతకం సాధించింది 46 బంతుల్లో. గంభీర్‌ వెనుదిరిగే సమయానికి భారత్‌ 75 బంతుల్లో 121 పరుగులు చేస్తేనే ఫైనల్‌ రేసులో నిలిచే పరిస్థితి. అప్పటికే క్రీజులో కుదురుకున్న విరాట్‌.. తనలోని విధ్వంసకారుడిని బయటికి తీశాడు. అక్కడి నుంచి మలింగ సహా లంక బౌలర్లందరికీ ఊచకోతే!
7.4 ఓవర్లలో 96.. అప్పటికి ప్రపంచ అగ్రశ్రేణి ఫాస్ట్‌బౌలర్ల ఒకడిగా ఉన్న మలింగ, విరాట్‌ ధాటికి సమర్పించుకున్న పరుగులివి. మేటి బ్యాట్స్‌మెన్‌ను కూడా క్రీజులో నాట్యం చేయించే లసిత్‌.. ఆ రోజు కోహ్లి దెబ్బకు కుదేలయ్యాడు. అర్ధశతకం తర్వాత విధ్వంసక అవతారం ఎత్తిన విరాట్‌.. బౌండరీలతో హోబర్ట్‌ మైదానాన్ని హోరెత్తించాడు. అయితే అతనేమీ అడ్డంగా బాదేయలేదు. క్రికెటింగ్‌ షాట్లతోనే పరుగుల వరద పారించాడు. కవర్స్‌లో అతనాడిన డ్రైవ్‌లు, లాఫ్టెడ్‌ షాట్ల అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. సచిన్‌ తరహాలో కళ్లు చెదిరే లెగ్‌ ఫ్లిక్‌లతోనూ బౌండరీలు సాధించాడు. మలింగ వేసిన ఓ బంతికి మిడ్‌వికెట్‌లో అలవోకగా బాదిన సిక్సర్‌ విస్తుగొలిపేదే. కులశేఖర వేసిన 31వ ఓవర్లో నాలుగు మెరుపు ఫోర్లు కొట్టిన విరాట్‌.. మలింగ వేసిన 34వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా 2, 6, 4, 4, 4, 4తో 24 పరుగులు కొల్లగొట్టాడు. దీంతో అప్పటిదాకా చాలా కష్టంగా కనిపించిన సమీకరణం.. ఒక్కసారిగా తేలికైపోయింది. 40 ఓవర్లలో 321 పరుగులంటే ఎంత బాగా ఆడినా.. చివర్లో ఉత్కంఠ తప్పదనుకున్నారు. కానీ కోహ్లి ధాటికి భారత్‌ చాలా ప్రశాంతంగా ఛేదనను పూర్తి చేసింది. అవసరమైన దాని కంటే 20 బంతులు మిగిలుండగానే భారత్‌ విజయాన్నందుకుంది. మొత్తంగా మిగిలిన బంతులు 80. రైనా (40 నాటౌట్‌) నుంచి కోహ్లికి చక్కటి సహకారం అందింది. 86 బంతుల్లోనే 133 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు విరాట్‌. అర్ధశతకం నుంచి శతకానికి 30 బంతుల్లోనే చేరుకున్న కోహ్లి.. ఇంకో 10 బంతుల్లోనే 33 పరుగులు సాధించడం అతనెలా గేర్లు మార్చాడో తెలియజేస్తుంది. ఈ సంచలన విజయంతో భారత్‌ ఫైనల్‌ ఆశలు సజీవంగా నిలిచాయి కానీ.. తర్వాతి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను శ్రీలంక ఓడించడంతో ఆ రెండు జట్లే ఫైనల్‌ చేరాయి. అయినప్పటికీ విరాట్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో అందించిన ఆ సంచలన విజయం మాత్రం చిరస్మరణీయం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.