close

కథనాలు

0-1తో వెనకబడ్డ ఐదుసార్లు భారత్‌ ఏం చేసింది?

ఓటముల రాజ్‌కోట్‌లో టీమిండియా ఆసీస్‌ను ఓడించేనా?  

సమవుజ్జీల క్రికెట్‌ సమరంలో అసలు సిసలు మజాను ఆస్వాదించొచ్చని భావించారు అభిమానులు. ముంబయి వన్డేలో టీమిండియాపై ఫించ్‌సేన ఆధిపత్యం చూసి నిరాశ చెందారు. కోహ్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పు, పేసర్లు సరైన లెంగ్త్‌ను అందిపుచ్చుకోకపోవడంతో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. అవమానం పొందిన చోటే ఆత్మగౌరవాన్ని చాటుకోవడం భారత్‌కు అలవాటే. మరి శుక్రవారం రాజ్‌కోట్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచులో కోహ్లీసేన నిలుస్తుందా? ఉత్కంఠరేపే విజయాన్ని అందుకుంటుందా??


అప్పుడు విజృంభణ

అవమానం మూటగట్టుకున్న వెంటనే ఆత్మపరిశీలన చేసుకోవడం టీమిండియాకు అలవాటే. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసేది వంద అడుగులు ముందుకు వేసేందుకే అన్నట్టు తర్వాత మ్యాచులో కదం తొక్కుతుంది. ఆకలిగొన్న పులిలా విజృంభిస్తుంది. స్వదేశంలో ఐదుసార్లు మూడు వన్డేల సిరీస్‌లో 0-1తో వెనకబడ్డప్పుడు భారత్‌ పుంజుకొని నాలుగు సిరీసులు గెలిచింది. ఈ మధ్యే వెస్టిండీస్‌పై, 2017లో శ్రీలంక, న్యూజిలాండ్‌పై, 1981-82లో ఇంగ్లాండ్‌పై అలాగే విజయాలు అందుకుంది. ఈ వారసత్వం కోహ్లీసేనకు ఆత్మవిశ్వాసం అందించనుంది.


‘4’ కోహ్లీకి చేటు

బ్యాటింగ్‌ ఆర్డర్లో మార్పులు తొలి వన్డేలో టీమిండియా చేటు చేశాయి. ఏళ్లుగా మూడో స్థానంలో ఆడుతున్న కోహ్లీ నాలుగో స్థానంలో రావడం నష్టం చేసింది. వీవీఎస్‌ లక్ష్మణ్‌, మాథ్యూ హెడేన్‌, షోయబ్‌ అక్తర్‌ సహా మాజీలు కొందరు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. నిజానికి కోహ్లీది సదుద్దేశమే. చాన్నాళ్ల నుంచి బ్యాకప్‌ ఓపెనర్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌ ప్రపంచకప్‌ నుంచి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. నిలకడగా పరుగులు చేస్తున్నాడు. అతడి ఆలోచనా ధోరణిలోనూ మార్పుంది. గాయపడ్డ గబ్బర్‌ కోలుకొని జట్టులోకి వచ్చాకే తలనొప్పి మొదలైంది. ఎవరిని పక్కన పెట్టాలో అర్థంకాని స్థితి. అందుకే కోహ్లీ త్యాగానికి సిద్ధపడ్డాడు. వాంఖడేలో ప్రయోగం విఫలం కావడంతో ఈ సారి ఏం జరుగుందా అని ఆసక్తి ఏర్పడింది.


గబ్బర్‌ × రాహుల్‌

ధావన్‌ను పక్కనపెట్టి రోహిత్‌, రాహుల్‌ను ఓపెనింగ్‌ చేయించాలన్నది చాలామంది అభిప్రాయం. తొలి వన్డేలో 91 బంతుల్లో 74 పరుగులు చేసిన గబ్బర్‌ను ఇప్పుడు తొలగించడం కష్టం. పరుగులు చేసినప్పటికీ మొదట్లో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేయడంలో తడబాటు కనిపిస్తోంది. అతనాడిన మొత్తం బంతుల్లో 51 బంతులు డిఫెండ్‌ చేయడమే ఇందుకు నిదర్శనం. నాలుగో స్థానంలో రావడం చేటు చేసిందని ఇప్పటికే కోహ్లీ అంగీకరించాడు. అంటే అతడు వన్‌డౌన్‌లో రావడం ఖాయం. ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధమే అని గబ్బర్‌ ప్రకటించడంతో అతడిని ‘4’లో ఆడించినా ఆశ్చర్యం లేదు. కూర్పులో తేడా వస్తుందనుకుంటే రాహుల్‌ను పంపిస్తారు. పంత్‌ దూరమయ్యాడు కాబట్టి కీపింగ్‌ బాధ్యతలు ఇప్పటికైతే అతడివే. పంత్‌ స్థానంలో కేదార్‌ జాదవ్‌కు అవకాశం ఇవ్వొచ్చు. లేదా శివమ్‌ దూబెను ఆడించొచ్చు. వీరిద్దరూ పార్ట్‌టైమ్‌ బౌలర్లుగా ఉపయోగపడతారు.


లెంగ్త్‌లు ముఖ్యం

కాలక్రమంలో టీమిండియా పేస్‌ దళం అత్యంత ప్రమాదకరంగా మారింది. తొలి వన్డేలో మాత్రం ఇందుకు భిన్నంగా పేసర్ల ప్రదర్శన ఉంది. మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌ లెంగ్త్‌ను దొరకబుచ్చుకోవడంలో ఇబ్బందిపడ్డారు. ఈలోగా ఆసీస్‌ ఓపెనర్లు క్రీజులో పాతుకుపోయారు. మొదట్లో ఓవర్‌ పిచ్‌ బంతులేసిన వీరు ఆ తర్వాత షార్ట్‌పిచ్‌ బంతులు వేశారు. బౌలింగ్‌లో అంత ప్రభావం కనిపించకపోవడంతో వార్నర్‌, ఫించ్‌ విధ్వంసకరంగా ఆడారు. వికెట్టే ఇవ్వలేదు. ఫించ్‌ను కుల్‌దీప్‌ ఇబ్బంది పెట్టడం భారత్‌కు కలిసొచ్చే అంశం.  రెండు సార్లు బంతి ఫించ్‌ బ్యాటు నుంచి ఎడ్జ్‌ తీసుకుంది. దాంతో ఆ తర్వాత అతడు మరింత జాగ్రత్తగా ఆడాడు. రాజ్‌కోట్‌ వన్డేకు బౌలింగ్‌ విభాగంలో బహుశా మార్పులు ఉండకపోవచ్చు. ఇక బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ పరంగా ఆస్ట్రేలియాకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం గమనార్హం. ఐతే భారత్‌ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కమిన్స్‌, స్టార్క్‌, రిచర్డ్‌సన్‌, జంపా నిమిషాల వ్యవధిలో మ్యాచ్‌ను లాగేసుకోగలరు.


బ్యాటింగ్‌కు అనుకూలం

రాజ్‌కోట్‌ చిన్నమైదానం. బౌండరీ సరిహద్దులు దగ్గరగా ఉంటాయి. పిచ్‌ బ్యాటింగ్‌కు ఎక్కువగా అనుకూలిస్తుంది. దేశవాళీల్లో పుజారా, జడేజా ఇక్కడ త్రిశతకాలు బాదారు. గతంలో ఇక్కడ రెండు వన్డేలు జరగ్గా భారీ స్కోర్లు నమోదయ్యాయి. రెండు సార్లూ భారత్‌ లక్ష్యాలను ఛేదించలేకపోయింది. షమి, బుమ్రా, ఠాకూర్‌ చక్కని లెంగ్తుల్లో బంతులు వేస్తేనే భారత్‌కు గెలుపు అవకాశాలు ఉంటాయి. లేదంటే ఫామ్‌లో ఉన్న వార్నర్‌, ఫించ్‌ శతక్కొట్టగలరు. పరుగుల దాహంతో ఉన్న హిట్‌మ్యాన్‌, కోహ్లీ కసిగా ఆడే అవకాశం ఉంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌

ఇవీ చదవండి

కోహ్లీకి అది కూర్చోవాలో.. నిల్చోవాలో.. గెంతేయాలో తెలియని పరిస్థితి

పతంగి వల్ల నిలిచిన క్రికెట్‌ మ్యాచ్‌

భార్యను అడిగి చెబుతానంటున్న డేవిడ్‌ వార్నర్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.