36/9 ఊహించలేదు: బుద్ధిని వాడాలి!
close

ప్రధానాంశాలు

Published : 22/12/2020 02:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

36/9 ఊహించలేదు: బుద్ధిని వాడాలి!

టీమ్‌ఇండియాకు గుండప్ప సూచనలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టుల్లో మరోసారి 42 కన్నా తక్కువ స్కోరుకు కుప్పకూలుతుందని తానెప్పుడూ అనుకోలేదని టీమ్‌ఇండియా ఒకప్పటి దిగ్గజం గుండప్ప విశ్వనాథ్‌ అన్నారు. ఆసీస్‌తో గులాబి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 36కే పరిమితమవ్వడం బాధించిందని పేర్కొన్నారు. అయితే ఈ మ్యాచు గురించి ఆటగాళ్లు మరిచిపోయి మిగతా టెస్టుల్లో రాణించాలని కోరారు. ఓటమి పాలైన పోరుకు సమష్టిగా బాధ్యత వహించాలని సూచించారు. ఒకప్పుడు ఇంగ్లాండ్‌తో పోరులో 42కే ఆలౌటైన జట్టులో గుండప్ప సభ్యుడన్న సంగతి తెలిసిందే.


పెరిగిన పిచ్‌ వేగం

‘అడిలైడ్‌లో మూడోరోజు పిచ్‌ వేగం అనూహ్యంగా పెరిగింది. ఆసీస్‌ బౌలర్లు నిలకడగా అద్భుతంగా బంతులు విసిరారు. లార్డ్స్‌లోనూ ఇలాగే జరిగింది. బ్యాట్స్‌మెన్‌ బంతిని డిఫెండ్‌ చేసినా బ్యాటు అంచుకు తగిలి ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లింది. పేసర్లంతా బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోనే ఉంచారు. పుజారా ఆడింది చక్కని బంతి. మయాంక్‌ సైతం అంతే. రహానె క్రీజులోంచి ఆడాడు. కోహ్లీ దూరంగా వెళ్తున్న బంతిని కొట్టాడు. బహుశా వేగంగా పరుగులు చేసి ఒత్తిడి తగ్గించాలన్నది అతడి ఆలోచన కావొచ్చు. అయితే జట్టులోని ఎక్కువ మందికి 60-70 టెస్టుల అనుభవం ఉండటంతో సిరీసులో పుంజుకోవడం కష్టమేమీ కాదు. రహానె గతంలోనూ తెలివిగా సారథ్యం వహించి గెలిపించాడు’ అని గుండప్ప అన్నారు.


మార్పులు తప్పవు

‘జట్టులో కొన్ని మార్పులు అవసరం. పృథ్వీషా స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌ రావాలి. ఇందులో మరో ఆలోచన లేదు. కోహ్లీ బదులు రాహుల్‌ వస్తాడు. షమి గాయం తీవ్రత గురించి నాకు తెలియదు. రోహిత్‌ శర్మ చివరి రెండు టెస్టులకు అందుబాటులోకి వస్తాడు. ఫీల్డింగ్‌ మెరుగుపడాలి. అడిలైడ్‌లోనే కాదు ఇప్పటి వరకు పర్యటనలో చాలా క్యాచులు వదిలేశారు. లేదంటే తొలి టెస్టులో 100+ ఆధిక్యం లభించేది. అప్పుడు ఆట మరోలా ఉండేది. రహానె టెక్నిక్‌, బ్యాటింగ్‌లో ఇబ్బందేమీ లేదు. సానుకూలంగా ఆడితే సరిపోతుంది. ఇక టెస్టులు ఆడుతున్నప్పుడు చేతి-కంటి సమన్వయం, బ్యాటు వేగం, క్రీజును ఉపయోగించడం ఎవరికివారే విశ్లేషించుకోవాలి. బ్యాటు, ప్యాడ్ల మధ్య బంతి వెళ్లకుండా ఆడాలి. బంతికి దగ్గరగా ఆడాలి. స్వింగ్‌ అయితే బంతి పిచ్‌ అయ్యే చోటుకు వెళ్లి ఎదుర్కోవాలి. బంతి లెంగ్త్‌ను ముందుగానే పసిగట్టి ఆడాలి. ఇక స్పిన్‌, బౌన్స్‌ అయితే ఫుట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలి’ అని గుండప్ప తెలిపారు.


బుద్ధిని ఉపయోగించాలి

‘టీమ్‌ఇండియా ఆటగాళ్లు హార్డ్‌ హ్యాండ్స్‌తో ఆడుతున్నారని అనుకోను. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువ బంతులు స్లిప్‌, కీపర్‌ వద్దకు వెళ్లలేదు. నేనిచ్చే సలహా ఒక్కటే. మంచి ఫుట్‌వర్క్‌తో బంతిని దగ్గరగా ఆడండి. ఇది వన్డే, టీ20 క్రికెట్‌ కాదు. సుదీర్ఘ ఫార్మాట్‌ అని గుర్తించాలి. అయినా ఇప్పుడు టెస్టులు ఐదు రోజుల వరకు వెళ్లడం లేదు. 3/4 రోజుల్లోనే ముగుస్తున్నాయి. భారత్‌ జట్టు ఒక్కరిదే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య. ఇందుకు టీమ్‌ఇండియా ఆటగాళ్లనూ నిందించొద్దు. నిజానికి వారికి రంజీలు ఆడేంత సమయం చిక్కడం లేదు. టెస్టు క్రికెట్‌ బుద్ధితో ఆడేది. ఆటగాళ్లు తెలివిని ప్రదర్శించాలి. పరిస్థితులకు అనుకూలంగా ఆడాలి’ అని గుండప్ప సూచించారు.

ఇవీ చదవండి
నిన్నెప్పటికీ ప్రేమిస్తుంటా: రోహిత్‌ శర్మ
బాక్సింగ్‌ డే టెస్టుకు ‘ఆ నలుగురు’ 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన