close

ప్రధానాంశాలు

Published : 02/12/2020 02:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ ఒక్కటైనా..

ఆసీస్‌తో భారత్‌ చివరి వన్డే నేడు
సిరీస్‌ చేజారినా.. పోరు కీలకమే
ఉదయం 9.10 నుంచి
కాన్‌బెర్రా

సిరీస్‌ ఫలితం ముందే తేలిపోయాక.. ఓ మ్యాచ్‌ మిగిలిందంటే అది నామమాత్రమే! కానీ ఆస్ట్రేలియాతో మూడో వన్డే మాత్రం టీమ్‌ఇండియాకు అలాంటి పోరు కాదు. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి ఇప్పటికే సిరీస్‌ కోల్పోయినప్పటికీ.. ఈ మ్యాచ్‌లో గెలవడం కోహ్లీసేనకు అత్యావశ్యకం. ఇంకా టీ20, టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో.. ఈ ఒక్క వన్డే అయినా గెలవకపోతే జట్టు ఆత్మవిశ్వాసం మరింత సన్నగిల్లడం ఖాయం.
ఎన్నో ఆశలు, అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగు పెట్టి, వరుసగా రెండు పరాజయాలతో డీలా పడ్డ టీమ్‌ఇండియా.. మరో కీలక సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌ బుధవారమే. సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయినప్పటికీ..  చివరి వన్డేలో గెలవడం ద్వారా వైట్‌వాష్‌ తప్పించుకుని తర్వాత జరగబోయే టీ20 సిరీస్‌ను ఆశావహ దృక్పథంతో ఆరంభించాలన్నది కోహ్లీసేన ఆలోచన. తొలి మ్యాచ్‌లో పరాజయం తర్వాత ఆటతీరులో ఏమాత్రం మార్పు చూపించలేకపోయినా భారత్‌.. ఈ మ్యాచ్‌లోనూ మారకుంటే పర్యటనలో మున్ముందు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి కోహ్లీసేన అత్యవసరంగా మేల్కోవాల్సిందే.


ఆసీస్‌.. భిన్నంగా!

ఇప్పటికే సిరీస్‌ గెలిచినప్పటికీ ఆస్ట్రేలియా ఆటలో తీవ్రత తగ్గకపోవచ్చు. కానీ ఆ జట్టు గత మ్యాచ్‌లతో పోలిస్తే భిన్నంగా కనిపించబోతోంది. గాయంతో వార్నర్‌ దూరం కాగా.. కమిన్స్‌కు విశ్రాంతినిచ్చారు. వార్నర్‌ స్థానంలోకి వేడ్‌ లేదా డార్సీ షార్ట్‌ రావచ్చు. కమిన్స్‌ స్థానాన్ని సీన్‌ అబాట్‌ భర్తీ చేయనున్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న వార్నర్‌ లేకపోవడం కచ్చితంగా భారత్‌కు ఊరటనిచ్చేదే. ఓపెనింగ్‌ చేయాలని ఆశపడుతున్న లబుషేన్‌కు ఆ అవకాశం దక్కుతుందేమో చూడాలి. బౌలింగ్‌లో హేజిల్‌వుడ్‌, జంపాలతో ముప్పు పొంచి ఉంది. స్టార్క్‌ విఫలమవుతున్నప్పటికీ అతడి గత ప్రదర్శనలు దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాల్సిందే. అలాగే అబాట్‌ను సైతం తేలిగ్గా తీసుకోవడానికి లేదు.


మార్పులు తప్పవు..

ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే జట్టు మారాలి. అలాగే ఆటతీరు, వ్యూహాలూ మారాలి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమైన ఫాస్ట్‌బౌలర్‌ సైని, లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌ను పక్కన పెట్టక తప్పదు! ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన చేసిన నటరాజన్‌ను తుది జట్టులోకి తీసుకురావాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. అతను ఫామ్‌లో ఉన్నాడు, పైగా ఎడమచేతి వాటం కావడం వల్ల బౌలింగ్‌కు వైవిధ్యం వస్తుంది. చాహల్‌ ఐపీఎల్‌లో రాణించినప్పటికీ.. ప్రస్తుత సిరీస్‌లో తేలిపోతున్నాడు. పైగా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ గతంలో కంగారూలను ఇబ్బంది పెట్టాడు. ఇక జట్టు ఆటతీరు విషయానికొస్తే.. బౌలర్ల నుంచి ఇలాంటి ప్రదర్శనను ఎవ్వరూ ఊహించలేదు. ముఖ్యంగా బుమ్రా తేలిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భుజం గాయం నుంచి కోలుకున్నాక అతను వన్డేల్లో ప్రభావవంతంగా బౌలింగ్‌ చేయట్లేదు. మళ్లీ గాయపడతానన్న భయం వల్లో ఏమో.. శరీరం మీద ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నంలో అతడి బౌలింగ్‌ గాడి తప్పిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షమి తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నా.. తర్వాతి మ్యాచ్‌లో సాధారణంగా మారిపోయాడు. గత మ్యాచ్‌లో అనుకోకుండా బౌలింగ్‌ చేసిన హార్దిక్‌తో ఈసారి కోహ్లి పూర్తి కోటా వేయిస్తాడా అన్నది ఆసక్తికరం. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ వ్యూహాల విషయంలో తీవ్ర విమర్శలెదుర్కొంటున్న విరాట్‌.. ఈ మ్యాచ్‌లో ఏం చేస్తాడో చూడాలి. పవర్‌ప్లేలో వికెట్లు తీయడం.. స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌లకు అడ్డుకట్ట వేయడం కీలకం. బ్యాటింగ్‌లో టాప్‌ఆర్డర్‌ నుంచి జట్టు ఎంతో ఆశిస్తోంది. మొదట బ్యాటింగ్‌ చేసే అవకాశమొస్తే కంగారూల ముందు భారీ లక్ష్యాన్ని నిలపాల్సిన బాధ్యత బ్యాట్స్‌మెన్‌ మీద ఉంది. అయ్యర్‌ వైఫల్యాల బాట వీడకుంటే అతడి స్థానం  ప్రశ్నార్థకంగా మారొచ్చు. టీ20ల్లో మనీష్‌ పాండే వైపు జట్టు చూడాల్సి రావచ్చు.

23

వన్డేల్లో వేగంగా 12 వేల పరుగులు సాధించిన సచిన్‌ తెందుల్కర్‌ రికార్డు (300 ఇన్నింగ్స్‌)ను బద్దలు కొట్టేందుకు కోహ్లికి అవసరమైన పరుగులు. విరాట్‌ ఇప్పటిదాకా 241 ఇన్నింగ్స్‌లో 11977 పరుగులు చేశాడు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన