close

కథనాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గెలిచేందుకు వికెట్లు పారేసుకున్న జట్టు

వినూత్నంగా ఆలోచించిన జట్టు కెప్టెన్‌

(ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం)

1887 నాటి క్రికెట్‌ ముచ్చట ఇది. ప్రత్యర్థితో తలపడుతున్న ఓ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. విజయం సాధించాలంటే రెండో జట్టును ఛేదనకు దించి ఆలౌట్‌ చేయాలి. అప్పటికి ఇంకా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసే నిబంధన రాలేదు. మరి గెలుపు కోసం మొదటి జట్టు ఏం చేసిందో తెలుసా?


సర్రే × నాటింగ్‌హామ్‌

బ్రిటన్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌ ఇంకా అధికారికంగా మొదలవ్వలేదు. అయినప్పటికీ కౌంటీ జట్లు టోర్నీల్లో తలపడేవి. 1887, జూన్‌ 1న ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా నాటింగ్‌హామ్‌ షైర్‌తో సర్రే తలపడింది. ఈ రెండు జట్ల మధ్య పోటీ తీవ్రత ఎక్కువ. విలియమ్‌ అటెవెల్‌ (5/36) జాక్‌ మీ (3/52) దెబ్బకు తొలుత బ్యాటింగ్‌ చేసిన సర్రే 27 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ క్రమంలో మారిస్‌రీడ్‌తో కలిసి హ్యారీవుడ్‌ 53 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు. జాన్‌ బ్యూమాంట్‌ సైతం పోరాడటంతో సర్రే 115 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ ముగించింది.


రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు

బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ బౌలింగ్‌లో సర్రే జట్టు రాణించింది. బ్యాటింగ్‌కు దిగిన నాటింగ్‌హామ్‌ షైర్‌ను 89 పరుగులకే కుప్పకూల్చింది. జార్జ్‌ లోహ్‌మన్‌ (5/39), థామస్‌ బౌలీ (4/25) ప్రత్యర్థి నడ్డి విరిచారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు దిగిన సర్రేకు శుభారంభం లభించింది. కింగ్స్‌మిల్‌ కీ (42), బాబీ అబెల్‌ (44), విలియమ్‌ రోలర్‌ (53) రాణించారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సరికి 157/3తో నిలిచింది. వాల్టర్‌, మావురిస్‌ క్రీజులో ఉన్నాడు. రీడ్స్‌ విజృంభించడంతో మూడో రోజు ఉదయానికి సర్రే 264 పరుగులు చేసింది. 292 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అప్పుడే మొదలైంది హరాకిరీ.


మొదలైన హరాకిరీ

భారీ స్కోరు చేసిన సర్రేకు ఓ సమస్య వచ్చిపడింది. విజయం సాధించాలంటే తమ బౌలర్‌ లోహ్‌మన్‌ను రంగంలోకి దించాలి. కానీ ఎలా? ఇన్నింగ్స్‌ ఇంకా ముగియలేదు కదా. అప్పటికి డిక్లేర్‌ చేసే నిబంధన లేదు. అందుకే నిబంధనలకు కాదు గానీ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఆలోచించింది. త్వరగా ఆలౌట్‌ అవ్వాలని సర్రే కెప్టెన్‌ జాన్‌ షూటర్‌ నిర్ణయించాడు. మీ వేసిన బంతికి మౌరిస్‌ బౌల్డ్‌ అయ్యాడు. విల్‌ఫ్రెడ్‌ ఓవర్లో వాల్టర్‌ లాంగ్‌స్లిప్‌లో ఫ్రెడ్‌ బట్లర్‌కు చిక్కాడు. అప్పటికి స్కోరు 264/5. క్రీజులో ఉన్న కెప్టెన్‌ జాన్‌ షూటర్‌తో కలిసి ఆడేందుకు లోహ్‌మన్‌ వచ్చాడు.


సర్రే  కెప్టెన్‌ వింత ఆలోచన

షూటర్‌ వేగంగా 10 పరుగులు చేసి మీ బౌలింగ్‌లో బ్యాటును వికెట్లకు తాకించేశాడు. ఇది చూసి ప్రేక్షకులు వింతగా అనుకున్నారట. కానీ సర్రే అసలైన ప్రణాళికేంటో తర్వాత గానీ వారికి తెలియలేదు. జార్జ్‌ జోన్స్‌ సైతం అదే పనిచేశాడు. ఇక వుడ్‌, బ్యూమాంట్‌ మరో మార్గం ఎంచుకున్నారు. బంతిని కావాలనే ఆడకుండా మిస్సైనట్లు నటించారు. క్రీజు బయటకు వచ్చి ప్రత్యర్థి సారథి మారర్డెకాయ్‌ షెర్విన్‌ చేతిలో స్టంపౌట్‌ అయ్యారు. ఆఖర్లో లోహ్‌మన్‌ ఓ ఫ్రెండ్లీ క్యాచ్‌ ఇచ్చాడు. మొత్తానికి సర్రే 289 పరుగులకు ఆలౌటైంది. నాటింగ్‌హామ్‌ 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. లోహ్‌మన్‌ (5/39) టాప్‌ఆర్డర్‌ను  కుప్పకూల్చడంతో నాటింగ్‌హామ్‌ 38/4తో నిలిచింది.


ప్చ్‌.. నాటింగ్‌హామ్‌

బిల్లీ గన్‌ (72) పోరాడినా మరోవైపు వికెట్లు పడటంతో నాటింగ్‌ స్కోరు 157/7కు చేరుకుంది. అప్పటికి మ్యాచ్‌ ముగిసేందుకు మరో 25 నిమిషాలే సమయం ఉంది. కీలక సమయంలో గన్‌ను లోహ్‌మన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ వెంటనే షాక్‌లోక్‌ ఔటయ్యాడు. షెర్‌విన్‌ సైతం లోహ్‌మన్‌కే దొరికిపోయాడు. గడియారం సాయంత్రం 6.17 గంటల సమయాన్ని చూపించింది. మరో 13 నిమిషాలు ఉండగానే సర్రే విజయం సాధించింది.


ఈ టోర్నీలో సర్రే అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌ జరిగిన రెండేళ్లకు 1889లో డిక్లరేషన్‌ నిబంధన తీసుకురావడం విశేషం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.