close

ప్రధానాంశాలు

Updated : 16/10/2020 10:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పంజాబ్‌కు ఏమైంది?

చివర్లో తడబడుతున్న రాహుల్‌ టీమ్‌

 

యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్‌లో అన్ని జట్లది ఒక పరిస్థితి అయితే, పంజాబ్‌ది మరో పరిస్థితి. గెలవాల్సిన మ్యాచ్‌లను చేజేతులా ప్రత్యర్థులకు అప్పగించేలా కనపడుతోంది రాహుల్‌ టీమ్‌. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ అవకాశాలపై ఆశలు సన్నగిల్లిన నేపథ్యంలో గతరాత్రి బెంగళూరుపై విజయం సాధించి అభిమానుల్లో ఇంకా ఆశలు రేకెత్తిస్తోంది. అయితే, ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆ జట్టు మూడింటిలో గెలిచే అవకాశం ఉన్నా చివర్లో చేతులెత్తేసి ఓటమిపాలైంది. తాజాగా బెంగళూరుతో తలపడిన రెండో పోరులోనూ తేలిగ్గానే విజయం సాధించాల్సి ఉన్నా చివరి బంతి వరకూ తీసుకెళ్లి మ్యాచ్‌పై ఉత్కంఠ కలిగించింది. ఈ నేపథ్యంలోనే ఆ జట్టు పరిస్థితిని ఓసారి పరిశీలిద్దాం.

ఆ మూడు మ్యాచ్‌లు..
ఈ సీజన్‌లో దిల్లీతో ఆడిన తన తొలి పోరులోనే పంజాబ్ గెలవాల్సింది. 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించినా 157 పరుగులే చేయడంతో స్కోర్లు సమమై ఫలితం సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. అక్కడా దంచికొట్టే అవకాశం ఉన్నా 2 పరుగులే చేసి ఓటమిపాలైంది. తర్వాత రాజస్థాన్‌పై 223/2 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించడం ఏ జట్టుకైనా అంత తేలిక కాదు. చివరి 5 ఓవర్లలో రాజస్థాన్‌ విజయానికి 83 పరుగులు అవసరమైన వేళ పంజాబ్‌ బౌలర్లు పట్టు కోల్పోయారు. డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేసే కాట్రెల్‌ను రాహుల్‌ తెవాతియా(53; 31 బంతుల్లో 7x6) 18వ ఓవర్‌లో ఉతికి ఆరేశాడు. ఐదు సిక్సులు బాది మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. దాంతో పంజాబ్‌ ఓటమిపాలైంది. ఈ విజయంతో రాజస్థాన్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. ఇక కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో రాహుల్ టీమ్‌ కేవలం 2 పరుగుల దూరంలో ఓటమిపాలైంది. దీన్ని బట్టే ఆ జట్టు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 165 పరుగుల మోస్తారు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రాహుల్‌(74), మయాంక్‌(56) తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించారు. 15 ఓవర్లకు జట్టు స్కోర్‌ 117/1తో నిలిచింది. చేతిలో 9 వికెట్లు ఉండగా చివరి 5 ఓవర్లలో 48 పరుగులు చేయాల్సి ఉంది. అలాంటి స్థితిలో ఎవరైనా పంజాబే గెలుస్తుందని అనుకున్నారు. కానీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు 162/5తో నిలిచి అనూహ్య ఓటమి చవిచూసింది.

బెంగళూరుతోనూ ఓటమి అంచుల దాకా..
తాజాగా బెంగళూరుతో రెండోసారి తలపడిన సందర్భంగా తేలిగ్గానే విజయం సాధించేలా కనిపించింది. తొలుత కోహ్లీసేన 171/6 పరుగులు చేయగా ఛేదనలో రాహుల్‌(61*), మయాంక్‌(45) తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించారు. మయాంక్‌ ఔటయ్యాక క్రిస్‌గేల్‌(53)తో జోడీ కట్టిన కెప్టెన్‌ మ్యాచ్‌ను తేలిగ్గా గెలిపించేలా కనిపించాడు. వీరిద్దరూ సిక్సర్లతో చెలరేగడంతో 18 ఓవర్లలోనే పంజాబ్‌ విజయం సాధించేలా కనిపించింది. కానీ ఆఖర్లో బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బంతులేసి వారిద్దరినీ పరుగులు తీయడంలో కట్టడి చేశారు. అయినా పంజాబ్‌ విజయానికి 18 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రిస్‌మోరిస్‌ మాయ చేశాడు. ఆ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. ఆపై ఇసురు ఉడాన 19వ ఓవర్‌లో 5 పరుగులిచ్చాడు. అయినా చివరి ఓవర్‌లో రాహుల్‌ టీమ్‌ విజయానికి 2 పరుగులే అవసరమయ్యాయి. కానీ ఆ రెండు పరుగులు తీయడానికి కూడా గేల్‌, రాహుల్‌ తడబడ్డారు. చాహల్‌ వేసిన ఫైనల్‌ ఓవర్‌లో గేల్‌ తొలి రెండు బంతులను వృథా చేశాడు. ఆపై మూడో బంతికి సింగిల్‌ తీయడంతో స్కోర్లు సమానమయ్యాయి. రాహుల్‌ నాలుగో బంతిని ఆడలేకపోవడంతో ఐదో బంతికి సింగిల్‌ తీసి విజయాన్ని అందుకోవాలని చూశాడు. కానీ బెంగళూరు ఫీల్డర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ వెంటనే త్రో విసరడంతో గేల్‌ రనౌటయ్యాడు. దీంతో ఒక్కసారిగా పంజాబ్‌ విజయంపై అనుమానాలు రేకెత్తాయి. చివరి బంతికి పూరన్‌ సిక్సర్‌ బాదడంతో సరిపోయింది.

చివర్లోనే ఒత్తిడి..
ఇన్ని రోజులు ఆ జట్టు బ్యాటింగ్‌లో ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ మాత్రమే రాణించారు. మధ్యలో పూరన్‌ ఒకసారి అర్ధశతకంతో మురిపించినా సీజన్‌ మొత్తంలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. మరోవైపు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతడిని తొలగించాలని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్‌ ఎట్టకేలకు యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అతడు ఈ మ్యాచ్‌లో మొదట తడబడ్డా తర్వాత కుదురుకొని స్వేచ్ఛగా ఆడాడు. సిక్సర్లతో అలరించడమే కాకుండా అర్ధశతకం బాది తనలో ఇంకా పరుగులు చేసే సత్తా ఉందని నిరూపించాడు. కానీ ఆఖర్లో పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డాడు. కెప్టెన్‌ రాహుల్‌ సైతం ఆది నుంచీ దూకుడుగా ఆడినా ఆఖర్లో నెమ్మదించాడు. దీంతో పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌పై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా తమ ఆటలో మార్పులు చేసుకోలేకపోతే ఆ జట్టును ఎవరూ కాపాడలేరు.

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.