close

ప్రధానాంశాలు

Updated : 22/11/2020 14:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అతడు యుగానికి ఒక్కడు...

సచిన్‌ గొప్ప పోరాటాలు గుర్తున్నాయా?

సచిన్‌ రమేశ్‌ తెందుల్కర్‌.. క్రికెట్‌ ప్రపంచంలో అతడో సంచలనం. అభిమానులకు ఆరాధ్య దైవం. ఆటే కాదు, అతడి ప్రవర్తన అందరికీ ఆదర్శం.  24 ఏళ్ల తన సుదీర్ఘ క్రికెట్‌లో ఎన్నో వేల పరుగులు, లెక్కకట్టలేని రికార్డులు, క్రికెట్‌ చరిత్రలో తన కంటూ కొన్ని పేజీలు, శతక శతకాలు సాధించిన ఏకైక ఆటగాడు. ఇలా సచిన్‌ సాధించిన ఘనతలు చెప్పుకుంటూ పోతే ఓ రోజు సరిపోదంటే అతియోశక్తి కాదు! 16 ఏళ్ల వయసులోనే రికార్డుల వేటను మొదలు పెట్టిన సచిన్‌కు నేడు ప్రత్యేకమైన రోజు. అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించి నేటితో 31 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో క్రికెట్‌లో యుగానికి ఒక్కడుగా నిలిచిన సచిన్‌ గొప్ప ఇన్నింగ్స్‌లు ఓ సారి గుర్తు చేసుకుందాం!!

పెర్త్ పిచ్‌పై పేసర్లను ఎదుర్కొంటూ..

1992, ఫిబ్రవరి.. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో అయిదో టెస్టు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 346 పరుగులు చేసింది.అనంతరం భారత్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. 69 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో సచిన్‌ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్‌ భీకర పేసర్లు మెక్‌డెర్మాట్‌, మెర్వ్ హ్యూస్‌, పాల్ రీఫెల్‌ నిప్పులు చెరిగే బంతులు విసురుతున్నారు. వాళ్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ బాట పడుతున్నారు. కానీ 19 ఏళ్ల సచిన్‌ వెన్నుచూపని వీరత్వంతో వాళ్ల బంతుల్ని అద్భుతంగా ఎదుర్కొన్నాడు. 161 బంతుల్లో 114 పరుగులు సాధించి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌ టీమిండియా 272 పరుగులు చేసింది. ఈ టెస్టులో భారత్‌ పరాజయాన్ని చవిచూసినా సచిన్‌ తానేంటో క్రికెట్‌ ప్రపంచానికి చాటి చెప్పాడు.


వెన్నునొప్పితో పోరాడాడు..

1999, జనవరి... చెన్నై వేదికగా పాకిస్థాన్‌పై సచిన్‌ ఆడిన ఇన్నింగ్స్‌ను అభిమానులు ఎన్నటికీ మరవలేరు. వెన్నునొప్పితో అతడు ఆడిన తీరు అమోఘం. ఈ మ్యాచ్‌లో 12 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా ఓడినప్పటికీ సచిన్‌ (136) బాదిన సెంచరీ ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 238 పరుగుల చేయగా, భారత్‌ 254 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసి టీమిండియాకు 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే భారత్‌ 82 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ సచిన్‌.. మోంగియా(52)తో కలిసి పాక్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. వెన్నునొప్పితో బాధపడుతూనే శతకం సాధించాడు. అయితే 254 పరుగుల వద్ద సచిన్‌ ఏడో వికెట్‌ రూపంలో ఔటవ్వడంతో భారత్‌ ఓటమి చవిచూసింది.


తండ్రిని కోల్పోయినా..

సచిన్ టాప్‌-5 ఇన్నింగ్స్‌ల్లో.. 1999 ప్రపంచకప్‌లో కెన్యాపై సాధించిన శతకం ప్రత్యేకమైనది. తండ్రిని కోల్పోయిన బాధను దిగమింగి కెన్యాపై శతకం బాది జట్టును గెలిపించాడు. జీవితంలో కష్టమైన దశలో అతడు ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌కు ప్రశంసలు వెల్లువెత్తాయి. 101 బంతుల్లో సచిన్‌ అజేయంగా 140 పరుగులు సాధించాడు. 16 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. దీంతో భారత్ 329/2 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన కెన్యా 235 పరుగులే చేసింది.


అక్తర్‌ బౌలింగ్‌లో అదిరే సిక్సర్‌..

2003, ప్రపంచకప్‌లో పాక్‌పై సచిన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 273 పరుగులు చేసింది. అనంతరం సచిన్ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 75 బంతుల్లో 98 పరుగులు బాదాడు. 12 ఫోర్లు ,ఒక సిక్సర్‌ సాధించాడు. షోయబ్‌ అక్తర్‌ వేసిన షార్ట్‌బాల్‌ను సచిన్‌ డీప్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా సిక్సర్‌ బాదిన తీరు అమోఘం. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.


147 బంతుల్లో ద్విశతకం...

2010, ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై అతడు చేసిన ద్విశతకం క్రికెట్‌ ప్రపంచాన్నే ఊపేసింది. అసాధ్యం అనుకున్న డబుల్‌ సెంచరీని సుసాధ్యం చేసి చూపించాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌ ఉత్కంఠగా సాగింది. 45వ ఓవర్‌లోనే సచిన్‌ 190 పరుగులు చేసినప్పటికీ తర్వాత అతడికి ఎక్కువ స్ట్రైకింగ్‌ లభించలేదు. దీంతో ద్విశతకం సాధిస్తాడో లేదోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కాగా, ఆఖరి ఓవర్‌లో మూడో బంతిని బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా సింగిల్‌ తీసి సచిన్‌ ద్విశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సచిన్ ద్విశతకంతో దక్షిణాఫ్రికాకు భారత్ 402 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 248 పరుగులకే కుప్పకూలింది.

‘‘నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది అభిమానులకి. మీ అందరికీ ధన్యవాదాలు. ‘సచిన్‌.. సచిన్‌..’  అంటూ మీరు చేసే నినాదాలు తుది శ్వాస వరకు నా చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి’’ - సచిన్‌

- ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.