close

కథనాలు

కెప్టెన్‌గా  రాహుల్‌.. వైస్‌ కెప్టెన్‌గా విరాట్‌

నయా వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌కే ‘ఫాంటసీ’ మద్దతు

ఏంటీ..! కెప్టెన్‌గా కేఎల్‌ రాహులా..? వైస్‌ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీనా..?? శీర్షిక చూడగానే మీకొచ్చిన సందేహం ఇదే కదా. అవును..! సారథిగా రాహులే. నియమించింది మాత్రం  బీసీసీఐ కాదు. ఆ జట్టూ టీమ్‌ఇండియా కాదు. అందులో ఉండే ఆటగాళ్లు అంతా భారతీయులే కాదు. హా..! అంటే కింగ్స్‌ XI పంజాబ్‌ కదా అనుకోవచ్చు. అలాగైతే ఆర్‌సీబీ నాయకుడు వైస్‌ కెప్టెన్‌ ఎలా అవుతాడు? విషయం ఏంటో తెలుసుకోవాలన్న ఆత్రుతగా ఉందా? ఐతే ఈ కథనం చదవాల్సిందే!!


ఇంటర్నెట్‌ వ్యాప్తితో.. 

ఐపీఎల్‌ వేలం ముగిసిన వెంటనే సారథిగా కేఎల్‌ రాహుల్‌ను నియమిస్తున్నామని కింగ్స్‌ XI పంజాబ్‌ చెప్పేసింది. ఏప్రిల్‌ వరకు అతడి నాయకత్వ ప్రదర్శనను చూసే అవకాశం లేదు. మరి ఈ కర్ణాటక కుర్రాడిని కెప్టెన్‌గా నియమించిది ఎవరు? ఏ జట్టుకు? అనేగా మీ సందేహం. తక్కువ ఖర్చుతో నిరంతరాయంగా ఇంటర్నెట్‌ వ్యాప్తిలోకి రావడంతో ఫాంటసీ క్రికెట్‌పై అందరికీ ఆసక్తి పెరిగింది. వందల ఖర్చుతో వేల నుంచి లక్షల రూపాయల వరకు జాక్‌పాట్‌ కొట్టే అవకాశం ఉండటంతో యువత సరదాగా వీటిని ప్రయత్నిస్తోంది. తమ క్రికెట్‌ బుర్రను పరీక్షించుకుంటోంది. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో, స్టార్‌ ఇండియా నుంచి ఎన్‌డీటీవీ వరకు ప్రతిష్ఠాత్మక సంస్థలు ఫాంటసీ క్రికెట్‌ను నిర్వహిస్తుండటం గమనార్హం.


ఫాంటసీ క్రికెట్‌కు ఆదరణ

 

డ్రీమ్‌ 11, మై టీమ్‌ 11, హలాప్లే, ప్లేయర్జ్‌పాట్‌, భల్లేబాజి, ఫ్యాన్‌మోజా, 11 వికెట్స్‌, ఫ్యాన్‌ఫైట్‌ వంటి ఫాంటసీ క్రికెట్‌ యాప్‌లు, సైట్లను అభిమానులు అధికంగా వినియోగిస్తున్నారు.  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌, మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ వీటిలో కొన్నింటికి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ క్రికెట్‌ ఆదరణకు వీరి స్టార్‌డమ్‌ బాగా ఉపయోగపడుతోంది. అందుకే ఈ సంస్థల ఆదాయం ప్రస్తుతం కోట్లలో ఉంది. క్రికెట్‌కు సంబంధించి ఈ మధ్యన ఇంటరాక్షన్‌ చాలా పెరిగింది. అభిమానులు సోషల్‌ మీడియాలో సొంత జట్లు ప్రకటిస్తున్నారు. ఆ ఆటగాడి రికార్డిది, అతడి పరుగులు ఇన్ని, ఈ మైదానంలో ఆ యువ క్రికెటర్‌ సగటు ఇంత.. అంటూ రికార్డులు పంచుకుంటున్నారు. క్రికెట్‌ విశ్లేషణ చేస్తున్నారు. ఇదే పరిజ్ఞానాన్ని ఫాంటసీ జట్లను ఎంపిక చేసేందుకు ఉపయోగించుకొని కొద్ది మొత్తంలో ఆర్జిస్తున్నారు. కొందరికి లక్షల రూపాయాల్లో జాక్‌పాట్‌ తగులుతోంది.


వందల్లో ఖర్చు.. వేలల్లో ప్రైజ్‌మనీ

 

మైదానంలో రెండు జట్లు పోటీపడితే ఫాంటసీ క్రికెట్లో తలపడే జట్ల సంఖ్య లక్షలు, కోట్లలో ఉంటుంది. చాలా అరుదుగా జట్లను పోలిన జట్లు కనిపిస్తాయి. కెప్టెన్‌, వికెట్‌కీపర్‌, ఓపెనర్లు, బ్యాట్స్‌మెన్‌, బౌలర్‌, ఆల్‌రౌండర్ల విభాగాలతో ఆటగాళ్లను ఎంచుకోవాలి. అందుకు ముందుగా ఇచ్చిన పాయింట్లను వినియోగించుకోవాలి. ఖర్చైపోతే మళ్లీ డబ్బులు పెట్టి పాయింట్లు కొనుగోలు చేయొచ్చు. మైదానంలో పోటీ రెండు జట్ల నుంచే 11 మందిని ఎంచుకోవాలి. వాస్తవంగా మ్యాచులో వారి ప్రదర్శనల ఆధారంగా స్కోర్లు వస్తాయి. న్యూజిలాండ్‌ × భారత్‌ వన్డే సిరీసుకు సంబంధించి కెప్టెన్‌గా 95% మంది రెడ్‌హాట్‌ ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌నే ఎంచుకున్నారు. వైస్‌ కెప్టెన్‌గా కోహ్లీని తీసుకున్నారని తెలిసింది. ఎందుకంటే..?


రాహుల్‌ నామ సంవత్సరం


 

ఫాంటసీ లీగులో కెప్టెన్‌గా ఎంచుకున్న వ్యక్తి పరుగులు లేదా వికెట్లు తీస్తే 2 రెట్లు, వైస్‌ కెప్టెన్‌కు 1.5 రెట్లు పాయింట్లు వస్తాయి. అందుకే చాలామంది రాహుల్‌ను ఎంచుకున్నారు.  ఫిబ్రవరి మొదలై ఇంకా 15 రోజులు గడవలేదు. అప్పుడే 2020ని రాహుల్‌ నామ సంవత్సరం అనేస్తున్నారు. అతడి ఆటసైతం అలాగే ఉంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌, పిచ్‌, దేశంతో సంబంధం లేకుండా పరుగులు వరద పారిస్తున్నాడు. ఆ జోరును చూసే ఫాంటసీ క్రికెట్లోనూ అతడి పేరు మార్మోగుతోంది. ఈ ఏడాది 6 వన్డేల్లో 70 సగటుతో రాహుల్‌ 350 పరుగులు చేశాడు.  అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. నిలకడకు మారుపేరైన కోహ్లీ 6 వన్డేల్లో 43 సగటుతో 258 పరుగులతో నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం.


రెడ్‌ హాట్‌ ఫామ్‌లో కేఎల్‌, శ్రేయస్‌ 

తనకిష్టమైన టీ20ల్లో రాహుల్‌ దుమ్ము రేపుతున్నాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 53.83 సగటుతో 323 పరుగులు చేశాడు. జాబితాలో అందరికన్నా ముందున్నాడు. ఈ ఏడాది ఇలాంటి గణాంకాలు మరెవ్వరికీ లేవు. ఇక 6 ఇన్నింగ్స్‌లో 32 సగటుతో 166 పరుగులు చేసిన విరాట్‌ ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు. టీమ్‌ఇండియాలో నాలుగో స్థానంలో సంచలనాలు సృష్టిస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌ పైనా ఫాంటసీ క్రికెట్‌ అభిమానులు విశ్వాసం ఉంచుతున్నారు. బ్యాట్స్‌మెన్‌గా రాస్‌టేలర్‌తో అతడికీ అవకాశం ఇచ్చారు. 7 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 38.20 సగటుతో 191 పరుగులతో రెండో స్థానంలో, 6 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 54.40 సగటుతో 272 పరుగులు మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అందుకే అభిమానులు వీరిపై ఎక్కువగా విశ్వాసం  ఉంచుతున్నారు. ఇదండీ కెప్టెన్‌గా రాహుల్‌, వైస్‌ కెప్టెన్‌గా కోహ్లీ సంగతి!!!

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.