
ప్రధానాంశాలు
నయావాల్.. డీకోడెడ్!
కమిన్స్ బౌలింగ్‌లో వణికిపోతున్న పుజారా
129 బంతుల్లో 19 పరుగులు, 4సార్లు ఔట్
చెతేశ్వర్ పుజారా.. టీమ్ఇండియా నయావాల్! అతడు క్రీజులో నిలిచాడంటే ప్రత్యర్థులకు చుక్కలే. బౌలర్ల సహనానికి పరీక్షే. ఇంకా చెప్పాలంటే మైదానంలోని ఫీల్డర్లు కదలకున్నా సరే అలసిపోతారు. మానసికంగా డస్సిపోతారు. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తున్నప్పుడు అతడు వందల కొద్దీ బంతులు ఆడి పదుల కొద్దీ పరుగులు చేస్తాడు. ఒక్కసారి బంతి పాతబడిందో మెల్లగా వేగం పెంచుతాడు. అర్ధశతకాలను శతకాలుగా.. శతకాలను ద్విశతకాలుగా మలుస్తుంటాడు. గత పర్యటనలో ఇదే పనిచేసి విజయవంతమైన పుజారా ఈసారి మాత్రం విఫలమవుతున్నాడు. ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అతడిని డీకోడ్ చేసినట్టే కనిపిస్తున్నాడు.
అప్పుడు అదుర్స్
గత ఆసీస్ పర్యటనలో పరుగుల వరద పారించాడు పుజారా. 4 మ్యాచుల్లో 7 ఇన్నింగ్సుల్లో 74.43 సగటు, 41.41 స్ట్రైక్‌రేట్‌తో 521 పరుగులు చేశాడు. టోర్నీలో పరుగుల రారాజుగా అవతరించాడు. అడిలైడ్‌లో టెస్టులో అతడు 123 (246 బంతుల్లో); 71 (204 బంతుల్లో)తో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు విఫలమైన తరుణంలో దుర్భేధ్యమైన డిఫెన్స్‌తో ఆసీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. వారి ఓపికను నశింపజేసి శతకంతో రాణించాడు. జట్టుకు విజయం అందించాడు. ఓటమి పాలైన రెండో టెస్టులోనూ అతడిదే వ్యూహం అనుసరించాడు. 103 బంతుల్లో 24, 11 బంతుల్లో 4 పరుగులే చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడి అండతోనే కోహ్లీ శతకం చేశాడు. భారీ విజయం అందుకున్న మెల్బోర్న్లో పుజారా 33.23 స్ట్రైక్‌రేట్‌తో 319 బంతుల్లో 106 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. కానీ, అతడి శతకం, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ విధ్వంసంతోనే టీమ్ఇండియా గెలుపు తలుపు తట్టింది. డ్రాగా ముగిసిన నాలుగో టెస్టులో 373 బంతుల్లో 193 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుందంటే పుజారా చలవే.
కమిన్స్‌కు బెదుర్స్!
నయావాల్ క్రీజులోకి వచ్చాడంటే పరీక్షే అన్న పరిస్థితి ప్రస్తుత సిరీసులో కనిపించడం లేదు. ఒకట్రెండ్ ఇన్నింగ్సుల్లో ‘ప్రత్యర్థి సహనానికి పరీక్ష’ వ్యూహాన్ని అమలు చేసినా అనుకున్నది సాధించలేకపోతున్నాడు. ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అతడిని డీకోడ్ చేసినట్టు కనిపిస్తోంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో పుజారా ఐదు ఇన్నింగ్సులు ఆడగా నాలుగుసార్లు కమిన్స్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. ఇప్పటివరకు అతడి బౌలింగ్‌లో 129 బంతులాడి కేవలం 19 పరుగులే చేయడం గమనార్హం. దుర్భేధ్యమైన అతడి డిఫెన్స్‌ను కమిన్స్ సులువుగా ఛేదించేస్తున్నాడు. బ్యాట్స్‌మన్ పరుగులు చేయడానికి ఇష్టపడటం లేదని గ్రహించిన కమిన్స్ అత్యంత తెలివిగా బంతులు సంధిస్తున్నాడు. పిచ్‌ను బట్టి బ్యాక్ ఆఫ్ ఏ లెంగ్త్, ఫుల్లర్ లెంగ్త్‌తో విసురుతూ కాస్త ఇన్‌స్వింగ్ చేస్తున్నాడు. ఆ బంతులను పుజారా డిఫెండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆఫ్ వికెట్ మీదుగా వస్తున్న బంతులు బ్యాటు అంచుకు తగిలి కీపర్ లేదా స్లిప్‌లో ఫీల్డర్ల చేతుల్లో పడుతున్నాయి.
ఇలా దొరికిపోతున్నాడు
గులాబి టెస్టు: పింక్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 11.2వ బంతికి పుజారాను కమిన్స్ బోల్తా కొట్టించాడు. మిడిల్, ఆఫ్‌స్టంప్ మధ్యలో యాంగిల్ చేస్తూ స్ట్రెయిట్ లెంగ్త్‌లో బంతి విసిరాడు. ఆడక తప్పని పరిస్థితిని పుజారాకు కల్పించాడు. మంచి లెంగ్త్‌లో దేహం మీదకు వచ్చిన బంతిని కాలు కదపకుండా పుజారా ఆడాడు. అంతే.. బ్యాటు అంచుకు తగిలిన బంతి నేరుగా కీపర్ టిమ్‌పైన్ చేతుల్లో పడింది. 8 బంతులాడిన పుజారా డకౌట్‌గా వెనుదిరిగాడు.
మెల్బోర్న్ టెస్ట్: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ ఇంతే. పుజారా వచ్చి అప్పటికే దాదాపు రెండు గంటలవుతోంది. 69 బంతులాడి చేసింది 17 పరుగులు. దాంతో మరోసారి ఆడక తప్పని బంతిని చక్కని లెంగ్త్‌లో విసిరాడు కమిన్స్. పుజారా డిఫెండ్ చేద్దామనుకుంటే బంతి కొద్దిగా పక్కకు జరిగి బ్యాటు అంచుకు తగిలింది. గాల్లోకి లేచిన బంతిని పైన్ కుడివైపు డైవ్ చేసి ఒంటిచేత్తో ఒడిసిపట్టి ప్రశంసలు అందుకున్నాడు.
రెండో ఇన్నింగ్స్: మెల్బోర్న్ రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్ విసిరిన 5.1వ బంతికి పుజారా (3; 4 బంతుల్లో) ఔటయ్యాడు. ఫుల్ లెంగ్త్‌లో పక్కకు వెళ్తున్న బంతిని హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకొని ఆడాడు. డిఫెండ్ చేయాలనుకొని తికమక పడి గల్లీలో డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్‌లో కామెరాన్ గ్రీన్‌కు చిక్కింది.
సిడ్నీ టెస్టు: ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ పుజారా (50; 176 బంతుల్లో 5×4)ను కమిన్స్ మళ్లీ అదే పద్ధతిలో దెబ్బకొట్టాడు. బ్యాక్ ఆఫ్ ఏ లెంగ్త్‌లో వేసిన బంతి వేగంగా బౌన్స్ అయింది. ఆఫ్‌సైడ్ వికెట్ మీదుగా భుజాల వరకు వచ్చిన బంతిని పుజారా డిఫెండ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ నమ్మశక్యం కాని రీతిలో బ్యాటు హ్యాండిల్‌కు తగిలిన బంతి కీపర్ పైన్ చేతుల్లో పడింది.
-ఇంటర్నెట్‌డెస్క్
ప్రధానాంశాలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- మహా నిర్లక్ష్యం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
