close

ప్రధానాంశాలు

Updated : 15/09/2020 16:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌కు ముందు...

కరీబియన్‌ లీగ్‌లో ఏం చేశారంటే..!

కరోనా ముప్పుతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ స్తంభించింది. ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియాను మినహా మరే జట్టూ నాలుగు నెలలుగా మైదానంలో అడుగుపెట్టలేదు. బయోబుడగ సృష్టించిన ఇంగ్లాండ్‌తోనే మిగతా మూడు జట్లూ ఆడటం గమనార్హం. మరి ప్రపంచంలోనే అత్యుత్తమ పోటీఉండే ఐపీఎల్‌కు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ తప్పనిసరి. ఈ మధ్యే ముగిసిన కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కొందరు ఆటగాళ్లకు ఆ అదృష్టం దక్కింది. ఇంతకీ లీగ్‌లో వారి ప్రదర్శన ఎలాగుందో చూసేద్దామా!


తాహిర్‌ తాండవం

చెన్నై సూపర్‌కింగ్స్‌లోని ముగ్గురు ఆటగాళ్లు సీపీఎల్‌లో ఆడారు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు డ్వేన్‌బ్రావో, బార్బడోస్‌ ట్రిడెంట్స్‌కు మిచెల్‌ శాంట్నర్‌, గయానా అమెజాన్‌ వారియర్స్‌కు ఇమ్రాన్‌ తాహిర్‌ ప్రాతినిధ్యం వహించారు. వయసు మీదపడుతున్న బ్రావో ఈ మధ్యే టీ20ల్లో 500 వికెట్ల ఘనత అందుకున్న సంగతి తెలిసిందే. అతడు లీగ్‌లో 10 మ్యాచులాడి 7.50 ఎకానమీతో 9 వికెట్లు తీశాడు. 2/7 అత్యుత్తమ ప్రదర్శన. ఫిట్‌నెస్‌ స్థాయులు అత్యుత్తమంగా కనిపించలేదు. న్యూజిలాండ్‌ ఫింగర్‌ స్పిన్నర్‌ మిచెల్‌ శాంట్నర్‌ 9 మ్యాచుల్లో 5.59 ఎకానమీతో 6 వికెట్లు తీశాడు. బ్యాటుతోనూ ఫర్వాలేదనిపించాడు. గతేడాది ఐపీఎల్‌లో పర్పుల్‌ క్యాప్‌ విజేత ఇమ్రాన్‌ తాహిర్‌. 40 ఏళ్లు దాటినా అతడింకా హవా కొనసాగిస్తూనే ఉన్నాడు. 11 మ్యాచుల్లో 5.82 ఎకానమీతో 15 వికెట్లు తీసి అదరగొట్టాడు. 3/12 అత్యుత్తమ ప్రదర్శన. స్పిన్‌కు అనుకూలించే యూఏఈ పిచ్‌లపై అతడు రాణించగలడు.


పొలార్డ్‌ పొలికేక

ముంబయి ఇండియన్స్‌లో స్వదేశీ క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్ల హవా కొనసాగుతుంది. ఆ జట్టుకు చెందిన కీరన్‌ పొలార్డ్‌ (ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌), క్రిస్‌లిన్‌ (సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌), షెర్ఫాన్‌ రూథర్‌పర్డ్‌ ఈ లీగ్‌లో ఆడారు. సారథిగా నైట్‌రైడర్స్‌కు కీరన్‌ ట్రోఫీ అందించాడు. ఒక్క మ్యాచులోనూ ఓటమి లేదు. అటు నాయకుడిగా ఇటు ఆటగాడిగా విజయవంతం అయ్యాడు. సెయింట్‌ లూసియాపై ఫైనల్లో 4 వికెట్లు తీశాడు. 11 మ్యాచుల్లో 7.43 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు. 51.75 సగటుతో 207 పరుగులు చేశాడు. ఆసీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌లిన్‌ ఆకట్టుకోలేదు. 9 మ్యాచుల్లో 17.25 సగటుతో 138 పరుగులే చేశాడు. స్పిన్‌లో విఫలమయ్యాడు. స్పిన్‌లో 85 బంతులు ఎదుర్కొని 73 పరుగులే చేసి ఆరుసార్లు ఔటయ్యాడు. ఇలాగైతే దుబాయ్‌లో రాణించడం కష్టమే. రూథర్‌ఫర్డ్‌ 7 మ్యాచుల్లో 5.57 సగటుతో 39 పరుగులే చేయడం గమనార్హం.


అఫ్గాన్‌ ద్వయం అదుర్స్‌

రషీద్‌ ఖాన్‌ (బార్బడోస్‌ ట్రిడెంట్స్‌), మహ్మద్‌ నబి (సెయింట్‌ లూసియా జౌక్స్‌), ఫాబియన్‌ అలన్‌ (సెయింట్‌ కిట్స్‌) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆణిముత్యాలు. బ్యాటు, బంతితో రాణించిన నబి తన జట్టు ఫైనల్‌ చేరుకొనేందుకు కృషి చేశాడు. తన ఆఫ్‌స్పిన్‌తో 12 మ్యాచుల్లో 5.10 ఎకానమీతో 12 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఎడమచేతి వాటం బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 5/15 అత్యుత్తమ ప్రదర్శన. 19.50 సగటుతో 156 పరుగులూ చేశాడు. లీగ్‌లో రషీద్‌ ఖాన్‌ స్పిన్‌ మాయాజాలం పనిచేసినట్టు లేదు! బ్యాట్స్‌మెన్‌ అతడి బౌలింగ్‌లో రిస్క్‌ చేయకుండా సింగిల్స్‌ తీసుకుంటూ ఆడేస్తున్నారు. 10 మ్యాచుల్లో అతడు 6.85 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. 2/24 అత్యుత్తమ ప్రదర్శన. బ్యాటుతోనూ 60 పరుగులు చేశాడు. విమానం మిస్సవ్వడంతో ఫాబియన్‌ అలన్‌ లీగ్‌లో ఆడలేకపోయాడు.


 నరైన్‌, రసెల్‌‌ బాదుడే

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరుపు ముక్క సునిల్‌ నరైన సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ఆడాడు. తొలుత వరుస అర్ధశతకాలు చేసిన అతడు మధ్యలో కొన్ని మ్యాచులు ఆడలేదు. మూత్రపిండాల్లో రాళ్లు తీసేయించుకోవడమే ఇందుకు కారణం. 5 మ్యాచుల్లో 28.80 సగటుతో 144 పరుగులు చేశాడు. 4.55 ఎకానమీతో 6 వికెట్లు తీశాడు. రన్నప్‌లో బంతిని వెనక్కి పెట్టుకొని బ్యాట్స్‌మెన్‌ను తికమకపెట్టాడు. జమైకా టల్లావాస్‌ వీరుడు ఆండ్రి రసెల్‌ సూపర్‌ ఫామ్‌ కొనసాగించాడు. మోకాలు ఇబ్బంది పెట్టినా మూడు అర్ధశతకాలు చేశాడు. 9 మ్యాచుల్లో 44.40 సగటు, 141.40 స్ట్రైక్‌రేట్‌తో 222 పరుగులు చేసిన అతడు ఐదు ఇన్నింగ్సుల్లోనే బౌలింగ్‌ చేశాడు. 13 ఓవర్లు విసిరి 8.84 ఎకానమీతో 3 వికెట్లే తీశాడు. అతడి బౌలింగ్‌ సేవలను కేకేఆర్‌ ఉపయోగించుకోవడం అనుమానమే! అమెజాన్‌ వారియర్స్‌ సారథి క్రిస్‌గ్రీన్‌ 11 మ్యాచుల్లో 5.68 ఎకానమీతో 9 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు అతడు ఐపీఎల్‌ ఆడలేదు.


‘హిట్‌’ లామిచాన్‌

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (అమెజాన్‌ వారియర్స్‌) దుమ్మురేపాడు. మిడిలార్డర్‌లో కీలకంగా ఆడాడు. 11 ఇన్నింగ్సుల్లో 33.37 సగటు, 125.94 స్ట్రైక్‌రేట్‌తో 267 పరుగులు చేశాడు. మూడు అర్ధశతకాలు చేసిన అతడు మరికాస్త తీవ్రంగా ఆడుంటే మరిన్ని విజయాలు అందించేవాడు. నేపాల్‌ కుర్రాడు సందీప్‌ లామిచాన్‌ తన స్పిన్‌ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. జమైకా టల్లావాస్‌కు కీలకంగా నిలలిచాడు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాడు. 11 మ్యాచుల్లో 5.27 ఎకానమీతో 12 వికెట్లు తీశాడు. 2/8 అత్యుత్తమ ప్రదర్శన. ఇక ట్రినిడాడ్‌లో పిచ్‌లు పేస్‌కు సహకరించకపోయినా కీమోపాల్‌ (అమెజాన్‌ వారియర్స్‌) చక్కగానే బౌలింగ్‌ చేశాడు. 10 మ్యాచుల్లో 7.32 సగటుతో 9 వికెట్లు పడగొట్టాడు. వీరంతా దిల్లీ క్యాపిటల్స్‌ సభ్యులన్న సంగతి తెలిసిందే.


పూరన్‌.. దంచెన్‌

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో షెల్డన్‌ కాట్రెల్‌ (సెయింట్‌ కిట్స్‌), ముజీబుర్‌ రెహ్మాన్‌ (జమైకా టల్లావాస్‌‌), నికోలస్‌ పూరన్‌ (అమెజాన్‌ వారియర్స్‌) రాణించడంతో కింగ్స్‌ XI పంజాబ్‌ సంతోషంగా ఉంది. రెహ్మాన్‌ అటు పవర్‌ప్లే, ఇటు మధ్య ఓవర్లలో దుమ్మురేపాడు. లామిచాన్‌తో కలిసి తన జట్టును సెమీస్‌ చేర్చాడు. 11 మ్యాచుల్లో 5.29 ఎకానమీతో ఏకంగా 16 వికెట్లు తీశాడు. టాప్‌ బౌలర్ల జాబితాలో రెండో స్థానం దక్కించుకున్నాడు. 3/11 అత్యుత్తమ ప్రదర్శన. దుబాయ్‌, షార్జా ట్రాకులపై అతడు రాణించడంలో ఎవరికీ సందేహం లేదు. సీపీఎల్‌లో పిచ్‌లు పేస్‌కు సహకరించకపోవడంతో కాట్రెల్‌ 7 మ్యాచుల్లో 5 వికెట్లే తీశాడు. యువ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ దంచికొట్టాడు. ఓ మ్యాచ్‌లో 222.22 స్ట్రైక్‌రేట్‌తో 45 బంతుల్లోరు శతకం బాదేశాడు. స్పిన్‌ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. 11 మ్యాచుల్లో 27.22 సగటుతో 245 పరుగులతో టాప్‌-5లో నిలిచాడు. అతడిపై కింగ్స్‌ భారీ ఆశలే పెట్టుకొంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.