close

ప్రధానాంశాలు

Published : 17/09/2020 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముంబయి.. దడ పుట్టిస్తుంది

ఐపీఎల్‌ మరో 2 రోజుల్లో

జట్టు నిండా అగ్రశ్రేణి ఆటగాళ్లు.. పోరాట యోధులు.. జట్టును ఓటమి నుంచి విజయం వైపు నడిపే వీరులు.. వెన్నుదన్నుగా నిలిచే ఆల్‌రౌండ్‌ హీరోలు.. వీటన్నింటినీ మించి అత్యుత్తమ కెప్టెన్‌.. అండగా ఉండే కోచింగ్‌ సిబ్బంది.. ఇదీ క్లుప్తంగా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ నేపథ్యం. ప్రతిసారీ టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలో దిగే ఆ జట్టు.. ఈ సీజన్‌లోనూ అదే పట్టుదలతో అడుగుపెట్టనుంది.

ఈనాడు క్రీడావిభాగం

మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో నాలుగు సార్లు టైటిల్‌ నెగ్గిన ఘనత ముంబయిది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తూ.. విజయాల బాటలో దూసుకెళ్తోంది. 2008, 2009లో ప్లేఆఫ్‌ చేరలేని ఆ జట్టు.. 2010లో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాతి రెండు సీజన్లలో ప్లేఆఫ్‌ దశ నుంచే నిష్క్రమించింది. 2013లో తొలిసారి ట్రోఫీ సొంతం చేసుకున్న ముంబయి.. ఆ తర్వాత ఆ సంఖ్యను నాలుగుకు పెంచింది. అయితే ఆ జట్టు వరుసగా రెండు సార్లు ఎప్పుడూ టైటిల్‌ గెలవలేదు. యాదృచ్చికమో ఏమో కానీ.. ఓ సీజన్‌లో విజేతగా నిలిస్తే.. ఆ తర్వాతి ఏడాది పేలవంగా ముగించింది. 2013లో నెగ్గిన ఆ జట్టు ఆ తర్వాతి సీజన్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. 2015, 2017, 2019లో మళ్లీ గెలిచిన ముంబయి.. 2016, 2018లో లో ప్లేఆఫ్‌ కూడా చేరలేకపోయింది. అదే ఆనవాయితీని కొనసాగించి ఈ సీజన్‌లో నిరాశపరుస్తుందా? లేదా సంప్రదాయాన్ని చెరిపేస్తుందా చూడాలి.

బలాలివీ..: కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆ జట్టుకు పెద్ద బలం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ మేటి ఆటగాడిగా ఎదిగిన అతని కళాత్మక బ్యాటింగ్‌ విధ్వంసం కన్నుల పండగే. ఆటగాడిగానే కాదు కెప్టెన్‌గానూ అతని ప్రస్థానం గొప్పగా సాగుతోంది. ఇప్పటికే కెప్టెన్‌గా మూడు సార్లు కప్పు అందించిన అతను.. మరోసారి ట్రోఫీ దిశగా జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. ఇక బ్యాటింగ్‌లో జట్టుకు తిరుగులేదు. రోహిత్‌, డికాక్‌, సూర్య కుమార్‌కు అదనంగా క్రిస్‌ లిన్‌ కూడా జత కలవడంతో దుర్భేద్యంగా మారనుంది. హార్దిక్‌ పాండ్య, పొలార్డ్‌ రూపంలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లున్నారు. కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో కెప్టెన్‌గా తన జట్టును విజేతగా నిలిపిన పొలార్డ్‌పై భారీ ఆశలున్నాయి. బౌలింగ్‌లో బుమ్రాను ఆపడం ప్రత్యర్థికి సవాలే. బౌల్ట్‌ రాకతో పేస్‌ విభాగం బలంగా మారింది. ఎన్నో ఏళ్లుగా కలిసి ఆడుతున్న ఈ ఆటగాళ్లు జట్టుగా బాగా కలిసిపోయారు. అన్నింటికి మించి జట్టులోనే గెలుపు కసి ఉంది. సీజన్‌ తొలి అర్ధభాగంలో వెనకబడ్ఢా. రెండో అర్ధభాగంలో పుంజుకొని వరుస విజయాలతో ప్లేఆఫ్‌ చేరడం.. టైటిల్‌ కొట్టడం పరిపాటిగా మార్చుకుంది. ప్రధాన కోచ్‌గా జయవర్ధనె, బ్యాటింగ్‌ మార్గనిర్దేశకుడిగా సచిన్‌, బౌలింగ్‌ కోచ్‌గా షేన్‌ బాండ్‌, క్రికెట్‌ వ్యవహారాల డైరెక్టర్‌గా జహీర్‌ఖాన్‌ లాంటి దిగ్గజాలు ఆ జట్టుకు అండగా ఉన్నారు.

ఇవీ బలహీనతలు..: ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు (170) తీసిన బౌలర్‌గా ఉన్న మలింగ ఈ సీజన్‌కు అందుబాటులో లేకపోవడం పెద్ద దెబ్భ అతను లేని సీజన్లలో (2008, 2016, 2018) ఆ జట్టు అయిదో స్థానంలో నిలిచింది. మలింగ స్థానంలో జట్టులోకి వచ్చిన ప్యాటిన్సన్‌తో పాటు బౌల్ట్‌, బుమ్రా, మెక్లనగన్‌, కౌల్టర్‌నైల్‌తో కూడిన పేస్‌ విభాగం ఎలా రాణిస్తుందో చూడాలి. స్పిన్‌ విభాగంలోనూ సీనియర్‌, నాణ్యమైన బౌలర్లు కనిపించడం లేదు. స్లో పిచ్‌లపై రాహుల్‌ చాహర్‌, జయంత్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్య ఏ మేరకు ప్రభావం చూపుతారో చూడాలి. మరోవైపు 2014లో యూఏఈలో ఆడిన అయిదు మ్యాచ్‌ల్లోనూ జట్టు ఓడిపోయింది.


జట్టు

స్వదేశీ ఆటగాళ్లు: రోహిత్‌, ఆదిత్య తారె, అన్మోల్‌ప్రీత్‌, అనుకుల్‌, ధావల్‌, దిగ్విజయ్‌, హార్దిక్‌, ఇషాన్‌, బుమ్రా, జయంత్‌, కృనాల్‌, మోసిన్‌ ఖాన్‌, బల్వంత్‌, రాహుల్‌, సౌరభ్‌, సూర్యకుమార్‌

విదేశీయులు: బౌల్ట్‌, రూథర్‌ఫర్డ్‌, డికాక్‌, కౌల్టర్‌నైల్‌, పొలార్డ్‌, మెక్లనగన్‌, ప్యాటిన్సన్‌, క్రిస్‌ లిన్‌

ఉత్తమ ప్రదర్శన: నాలుగు సార్లు ఛాంపియన్‌ (2013, 2015, 2017, 2019)


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.