
ప్రధానాంశాలు
భారతావని.. నిన్ను మరువదని
ఈనాడు క్రీడావిభాగం
అది 2008 డిసెంబర్ నెల.. తెల్లవారుజామున వేళ్లు ముడుచుకుపోయే చలిలో కోల్‌కతాలోని విమానాశ్రయం నుంచి ఓ హోటల్ వరకూ వేలాది మంది రోడ్డుకిరువైపులా నిలబడి ఉన్నారు. వాళ్లు ఎదురుచూస్తున్న వ్యక్తి రాగానే కేరింతలు, అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఆ వచ్చిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు కాదు.. భారత ప్రధాని కాదు.. వేరే దేశానికి అధిపతో.. దిగ్గజ క్రికెటరో.. సినిమా సెలబ్రిటీనో కాదు.. ఆ వ్యక్తిది అసలు మన దేశమే కాదు. అంతగా కోల్‌కతా జనం అభిమానాన్ని చూరగొన్న ఆ వ్యక్తి పేరు.. డీగో మారడోనా! నాడు అతడికి కోల్‌కతాలో లభించిన జన నీరాజనం చూసి చెప్పేయొచ్చు.. ఇక్కడి అతడికున్న ఆదరణ ఎలాంటిదని!
కాళ్లకు చక్రాలు చేర్చి.. బంతికి పరుగులు నేర్పి.. ఫుట్‌బాల్‌కు పర్యాయపదంగా మారిన మారడోనా అంటే భారత అభిమానులకు ఎంతో ఇష్టం. మైదానంలో అతని నైపుణ్యాలకు ఫిదా అయిన జనం తనను గుండెల్లో పెట్టుకున్నారు. అతనికి కూడా భారత్‌పై ప్రత్యేక అభిమానం ఉండేది. అందుకే మిగతా అగ్రశ్రేణి ఫుట్‌బాల్ ఆటగాళ్ల కంటే ఎక్కువగా అతను మూడుసార్లు మన దేశానికి వచ్చాడు. 2008లో ఓ ప్రైవేట్ అకాడమీ ప్రారంభోత్సవంతో పాటు ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు కోల్‌కతా వచ్చాడు. అప్పుడు తనకు దక్కిన ఆదరణకు పొంగిపోయిన అతను.. ‘‘ఇప్పుడు నాకు అమెరికా అధ్యక్షుడిననిపిస్తోంది’’ అని అన్నాడు. ఆ పర్యటన సందర్భంగా మదర్ థెరిసా ఇంటిని సందర్శించి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనవంతు సాయం చేశాడు. తన జ్ఞాపకాలను వేలం వేస్తున్న సమయంలో చివరగా పుట్‌బాల్ వంతు వచ్చింది. ఆ వేలానికి వస్తున్న స్పందన చూసి.. వెంటనే అతను.. తను వేసుకున్న బ్లేజర్, టైని విప్పి బంతికి చుట్టి వేలాన్ని కొనసాగించమన్నాడు.
ఆ కేకు కోయనన్నాడు: ఆటగాడిగా, కోచ్‌గా తన జీవితాన్ని పూర్తిగా ఫుట్‌బాల్‌కే అంకితం చేసిన మారడోనాకు ఆటపై ఉన్న ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ఫుట్‌బాల్ మైదానం, ఆ బంతి తనకు ఆప్త మిత్రులు. అందుకే 2012లో ఓ కార్యక్రమం కోసం కేరళ వచ్చిన అతను ఫుట్‌బాల్ మైదానం, దానిపై బంతి ఉన్నట్లుగా తయారుచేసిన కేకును కోసేందుకు తిరస్కరించాడని భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ విజయన్ తాజాగా వెల్లడించాడు. ‘‘ మైదానం, బంతికి మారడోనా ఎంతటి ప్రాధాన్యతనిస్తాడో అప్పుడే తొలిసారిగా నాకు తెలిసింది. చివరకు కేకు కొనలను మాత్రమే కోశాడు’’ అని విజయన్ వెల్లడించాడు. కన్నూర్ మైదానంలో బంతులను అభిమానుల్లోకి పంపించిన అతను.. పాటలు పాడి వాళ్లను హుషారు పరిచాడు. తనతో కలిసి మారడోనా స్పానిష్ పాట పాడాడని 14 భాషల్లో పాటలు పాడే ఛార్లెస్ ఆంటోనీ పేర్కొన్నాడు. కన్నూర్‌లోని హోటల్ బ్లూ నైల్లో 309 నంబరు గదిలో మారడోనా తాకిన వస్తువులను జాగ్రత్తగా పదిలపరుస్తామని ఆ హోటల్ యజమాని చెప్పడం విశేషం.
తన విగ్రహాన్ని చూసి..: మారడోనా చివరగా 2017లో కోల్‌కతా వచ్చాడు. ఆ సందర్భంగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్గంగూలీ, మారడోనా జట్ల మధ్య జరిగిన ఛారిటీ మ్యాచ్ అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ఆ మ్యాచ్ ముగిశాక కూడా చిన్నారులతో కలిసి మైదానంలోనే గడిపిన అతను పూర్తిగా చెమటతో తడిచిపోయాడు. అనంతరం నగరంలో శ్రీభూమికి సమీపంలో ఏర్పాటు చేసిన తన 12 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన మారడోనాకు దాన్ని చూసి మాటలు రాలేదు. 1986 ప్రపంచకప్‌ను చేతుల్లో పట్టుకున్నట్లుగా ఉన్న ఆ విగ్రహం వంక అలాగే కాసేపు చూస్తుండి పోయాడు. భారత ఫుట్‌బాల్‌ను అభివృద్ధి చేయాల్సి ఉందని, తాను మళ్లీ వస్తానని చెప్పివెళ్లిన అతను.. ఆ మాట నిజం చేయకుండానే దివికేగాడు.
కడసారి చూసేందుకు..
బ్యూనస్ ఎయిర్స్: తమ ఆరాధ్య ఆటగాడు మారడోనాను చివరి సారిగా చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వారిని అదుపు చేయడం చాలా కష్టమై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం గుండెపోటుతో మృతి చెందిన మారడోనా పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం గురువారం ఉదయం అర్జెంటీనా అధ్యక్ష భవనానికి తరలించారు. అక్కడి అధ్యక్ష కార్యాలయంలోని ప్రధాన లాబీలో అతని భౌతిక కాయం ఉన్న శవపేటికను ఉంచారు. దానిపై అర్జెంటీనా జాతీయ పతాకంతో పాటు ఆ దేశ జట్టు తరపున అతను ధరించిన 10వ నంబర్ జెర్సీని కప్పి ఉంచారు. మొదట కుటుంబ సభ్యులు, సన్నిహితులు, 1986 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యులు అతనికి నివాళులు అర్పించారు.
ప్రధానాంశాలు
సినిమా
- భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి
- అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్
- నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్
- భారత్‌తో పోల్చాలంటే భయమేస్తోంది: ఛాపెల్
- అట్టుడుకుతున్న రష్యా!
- పంత్ వచ్చి టీమ్ ప్లాన్ మొత్తాన్ని మార్చేశాడు
- టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య
- నిజమైన స్నేహానికి అర్థం భారత్: అమెరికా
- ఆ రోజు సిరాజ్‌ను ఎందుకు రావొద్దన్నానంటే...
- వేదికపై కళ్లు తిరిగిపడిపోయిన డైరెక్టర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
