close

ప్రధానాంశాలు

Updated : 29/11/2020 04:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోహ్లి-రోహిత్‌ మాట్లాడుకోరా?

 వీరిద్దరి మధ్య ఏం జరిగింది?

ఈనాడు క్రీడావిభాగం

టీమ్‌ఇండియాకు రెండు ప్రధాన స్తంభాలైన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ మధ్య మాటలు లేవా? ఒకరి సమాచారం ఇంకొకరు తెలుసుకోవడం లేదా? ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారా? ఇటీవల జరుగుతున్న నాటకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఐపీఎల్‌ సందర్భంగా రోహిత్‌ గాయంతో మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు కోహ్లి, రోహిత్‌కు మధ్య ఏం జరిగిందనే విషయం మీద స్పష్టత లేదు.
‘‘రోహిత్‌ గాయం గురించి స్పష్టత, సమాచారం నాకు లేదు. గాయంతో ఉన్నప్పటికీ సాహా లాగా అతను కూడా జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కు వెళ్లకుండా నేరుగా ఆస్ట్రేలియా రావాల్సింది. ఎందుకు రాలేదో తెలీదు’’.. ఇవీ ఇటీవల రోహిత్‌ గురించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు. వీటిని బట్టి చూస్తుంటే రోహిత్‌ గురించి కోహ్లికి ఎలాంటి సమాచారం లేనట్లు తెలుస్తోంది. జట్టుకు కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌లైన వీళ్లిద్దిరి మధ్య మాటలు లేవని, అందుకే ఒకరి గురించి మరొకరి తెలియడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే గత పదేళ్లుగా కలిసి ఆడుతూ.. జట్టులో కీలక ఆటగాళ్లుగా ఎదిగిన వీళ్ల మధ్య ఒకరి గురించి ఒకరు చెప్పుకునే, అడిగే చనువు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కలిసి ఆడే ఆటగాళ్లు మాట్లాడుకోకపోవడమేంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ల గాయాలు, ప్రయాణ వివరాలు, జట్టుకు అందుబాటులో ఉంటారో లేదో అనే విషయాలు కూడా ఒకరికొకరు చెప్పుకోకపోవడం జట్టుపై ప్రభావం చూపిస్తోంది. ఐపీఎల్‌ సమయంలోనూ వాళ్లు మాట్లాడుకున్నట్లు కనిపించలేదు. కెప్టెన్‌గా సహచర ఆటగాడు ఎలా ఉన్నాడని తెలుసుకునే బాధ్యత కోహ్లికి లేదా? రోహిత్‌ గాయంతో బాధపడుతున్నాడని ప్రపంచమంతా తెలుసు.. అలాంటి పరిస్థితుల్లో జట్టులోని ప్రధాన ఆటగాడి ఆరోగ్యం గురించి విరాట్‌ ఎందుకు అడగట్లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసేందుకే యూఏఈ నుంచి రోహిత్‌ స్వదేశానికి వచ్చాడని బీసీసీఐ చెప్పేంతవరకూ ఆ విషయం కోహ్లికి తెలీదు. మరోవైపు గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే ఐపీఎల్‌లో ఆడిన రోహిత్‌.. ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. తన గాయం తీవ్రతను అతను ఎందుకు గుర్తించలేకపోయాడు? కోహ్లితో ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదు? భారత్‌కు తిరిగి వెళ్తున్నానని కోహ్లీకి ఎందుకు చెప్పలేదు? ఈ విషయాలన్నీ చూస్తుంటే వాళ్లిద్దరి మధ్య చాన్నాళ్లుగానే స్తబ్దత నెలకొందని తెలుస్తోంది. గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత వీళ్లిద్దరి మధ్య విభేధాల గురించి వార్తలు వచ్చాయి. ఆ టోర్నీలో రోహిత్‌ అత్యుత్తమ ప్రదర్శనతో 5 శతకాలు బాదినప్పటికీ.. జట్టు సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడడం అతణ్ని తీవ్రంగా బాధించింది. దీంతో జట్టు ఎంపికపై అతను అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కోహ్లి, రోహిత్‌ వర్గాలుగా జట్టు రెండుగా చీలిపోయిందనే మాటలూ వినిపించాయి. జట్టు ఎంపికలో కోహ్లి కొంతమంది ఆటగాళ్ల పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. మరోవైపు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఏదో ఒక ఫార్మాట్లో రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించాలని డిమాండ్‌ కూడా బలంగా వినిపిస్తోంది. రోహిత్‌లోనూ ఆ కోరిక ఉండటం కూడా ఇద్దరి మధ్య అంతరం రావడానికి కారణమనిపిస్తోంది. ఇప్పుడు కీలకమైన ఆసీస్‌తో సిరీస్‌కు రోహిత్‌ దూరమవడం జట్టుపై ప్రభావం చూపనుంది. ఈ కీలక ఆటగాళ్లు తమ మధ్య విభేధాల సంగతి పక్కనపెట్టి జట్టు కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలా జరుగుతుందా? లేదా ఈ విభేధాలు తారస్థాయికి చేరి జట్టుకు నష్టాన్ని కలిగిస్తాయా అన్నది చూడాలి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన