ఒక్కడు ఇద్దరై..
close

ప్రధానాంశాలు

Published : 05/12/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్కడు ఇద్దరై..

గెలిపించిన జడేజా, చాహల్‌
ఆస్ట్రేలియాతో తొలి టీ20 భారత్‌దే
కోహ్లీసేనకు వరమైన ‘కంకషన్‌’
కాన్‌బెరా

కోహ్లి నిరాశపరిచాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో రాహుల్‌ మినహా అందరూ విఫలమయ్యారు. బుమ్రా లేడు.
షమి తేలిపోయాడు. అయినా టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌లో శుభారంభం చేసింది. కేఎల్‌ రాహుల్‌ ఆరంభంలో ఇన్నింగ్స్‌కు పునాది వేస్తే.. చివర్లో జడేజా మెరుపులు మెరిపించి జట్టుకు పోరాడే స్కోరునందించాడు. చివర్లో అతడి తలకు బంతి తాకి కంకషన్‌కు గురవడంతో సబ్‌స్టిట్యూట్‌గా అనుకోకుండా జట్టులోకి వచ్చిన చాహల్‌.. ఆసీస్‌ను తన మాయాజాలంతో ముంచేశాడు. యువ ఫాస్ట్‌బౌలర్‌ నటరాజన్‌ కూడా చక్కటి ప్రదర్శన చేయడంతో తొలి టీ20లో భారత్‌ జయకేతనం ఎగురవేసింది.

స్ట్రేలియా పర్యటనను రెండు వరుస ఓటములతో ఆరంభించిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు వరుసగా రెండో విజయాన్నందుకుంది. వన్డే సిరీస్‌ చేజారాక, పుంజుకుని చివరి వన్డేలో నెగ్గిన భారత్‌.. శుక్రవారం తొలి టీ20లో 11 పరుగుల తేడాతో నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. మొదట కేఎల్‌ రాహుల్‌ (51; 40 బంతుల్లో 5×4, 1×6), జడేజా (44 నాటౌట్‌, 23 బంతుల్లో 5×4, 1×6) రాణించడంతో భారత్‌ 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. హెన్రిక్స్‌ (3/22), స్టార్క్‌ (2/34) భారత్‌ను దెబ్బ తీశారు. అనంతరం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ చాహల్‌ (3/25), నటరాజన్‌ (3/30)ల ధాటికి ఆసీస్‌ 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులే చేయగలిగింది. ఫించ్‌ (35) టాప్‌స్కోరర్‌. రెండో టీ20 సిడ్నీలో ఆదివారం జరుగుతుంది.

ఆశల్లేని స్థితిలో..: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ ఆరంభమైన తీరు చూస్తే.. సునాయాసంగా మ్యాచ్‌ను గెలిచేస్తుందనిపించింది. 6 ఓవర్లకు ఆసీస్‌ స్కోరు 56/0. పైగా దీపక్‌ చాహర్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో రెండు క్యాచ్‌లు చేజారాయి. ఫించ్‌ క్యాచ్‌ను మనీష్‌ అందుకోలేకపోగా.. షార్ట్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కోహ్లి వదిలేశాడు.అయితే 8వ ఓవర్లో చాహల్‌ బౌలింగ్‌కు వచ్చీ రాగానే ప్రమాదకర ఫించ్‌ (35; 26 బంతుల్లో 5×4, 1×6)ను ఔట్‌ చేసి జట్టుకు ఊరటనిచ్చాడు. తన తర్వాతి ఓవర్లో అతనే స్మిత్‌ (12)ను పెవిలియన్‌ చేర్చడంతో భారత్‌కు విజయంపై ఆశలు రేకెత్తాయి. చాహల్‌కు తోడుగా మరో ఎండ్‌లో బౌలింగ్‌ చేసిన అరంగేట్ర పేసర్‌ నటరాజన్‌ కట్టుదిట్టమైన బంతులతో ఒత్తిడి మరింత పెంచాడు. మ్యాక్స్‌వెల్‌ (2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత కూడా వికెట్ల పతనం అలాగే కొనసాగింది. వేడ్‌ (7)ను సైతం చాహల్‌ ఔట్‌ చేయగా.. బౌలింగ్‌లో భారత్‌ను దెబ్బ తీసిన హెన్రిక్స్‌, బ్యాటుతోనూ కొంత భయపెట్టాడు. కానీ అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్‌ బాగా పెరిగిపోయింది. సుందర్‌ (4-0-16-0) పొదుపైన బౌలింగ్‌తో ఛేదనను సంక్లిష్టంగా మార్చాడు. 15 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన స్థితిలో నటరాజన్‌ బౌలింగ్‌లో హెన్రిక్స్‌ ఔటవడంతో భారత్‌ విజయం ఖరారైంది.

అంత స్కోరు అనూహ్యమే..: మొదట భారత్‌ 161 పరుగులు చేయడం అనూహ్యమే. ఎందుకంటే 15 ఓవర్లకు స్కోరు 97/5. రాహుల్‌ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అందరూ విఫలమవడంతో భారత ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ఒడుదొడుకులతో సాగింది. ఓ ఎండ్‌లో రాహుల్‌ ధాటిగా ఆడుతున్నా అతడికి సహకరించేవారే కరవయ్యారు. ధావన్‌ (1)ను ఆరంభంలోనే స్టార్క్‌ ఔట్‌ చేయగా.. కోహ్లి (9) కూడా ఎంతోసేపు నిలవలేదు. కాసేపు నిలబడ్డ సంజు శాంసన్‌ (23), అతడి తర్వాత వచ్చిన పాండే (2) స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. రాహుల్‌, పాండ్య చివరి ఓవర్లలో స్కోరు పెంచుతారనుకుంటే వాళ్లిద్దరినీ హెన్రిక్స్‌ ఔట్‌ చేశాడు. భారత్‌ 140 దాటితే గొప్ప అనిపించింది. కానీ ఈ స్థితిలో జడేజా గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. హేజిల్‌వుడ్‌ వేసిన 19వ ఓవర్లో అతను మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదాడు. జడేజా ధాటికి చివరి 4 ఓవర్లలో 57 పరుగులొచ్చాయి.

భారత్‌ ఇన్నింగ్స్‌

రాహుల్‌ (సి) అబాట్‌ (బి) హెన్రిక్స్‌ 51; ధావన్‌ (బి) స్టార్క్‌ 1; కోహ్లి (సి) అండ్‌ (బి) స్వెప్సన్‌ 9; శాంసన్‌ (సి) స్వెప్సన్‌ (బి) హెన్రిక్స్‌ 23; పాండే (సి) హేజిల్‌వుడ్‌ (బి) జంపా 2; హార్దిక్‌ (సి) స్మిత్‌ (బి) హెన్రిక్స్‌ 16; జడేజా నాటౌట్‌ 44; సుందర్‌ (సి) అబాట్‌ (బి) స్టార్క్‌ 7; చాహర్‌ నాటౌట్‌ 0;ఎక్స్‌ట్రాలు 8

మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 161;

వికెట్ల పతనం: 1-11, 2-48, 3-86, 4-90, 5-92, 6-114, 7-152;

బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-34-2; హేజిల్‌వుడ్‌ 4-0-39-0; జంపా 4-0-20-1; అబాట్‌ 2-0-23-0; స్వెప్సన్‌ 2-0-21-1; హెన్రిక్స్‌ 4-0-22-3

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌

షార్ట్‌ (సి) హార్దిక్‌ (బి) నటరాజన్‌ 34; ఫించ్‌ (సి) హార్దిక్‌ (బి) చాహల్‌ 35; స్మిత్‌ (సి) శాంసన్‌ (బి) చాహల్‌ 12; మ్యాక్స్‌వెల్‌ ఎల్బీ (బి) నటరాజన్‌ 2; హెన్రిక్స్‌ ఎల్బీ (బి) చాహర్‌ 30; వేడ్‌ (సి) కోహ్లి (బి) చాహల్‌ 7; అబాట్‌ నాటౌట్‌ 12; స్టార్క్‌ (బి) నటరాజన్‌ 1; స్వెప్సన్‌ నాటౌట్‌ 12; ఎక్స్‌ట్రాలు 5

మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 150;

వికెట్ల పతనం: 1-56, 2-72, 3-75, 4-113, 5-122, 6-126, 7-127;

బౌలింగ్‌: చాహర్‌ 4-0-29-1; సుందర్‌ 4-0-16-0; షమి 4-0-46-0; నటరాజన్‌ 4-0-30-3; చాహల్‌ 4-0-25-3

జడేజా ఔట్‌

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాతో మిగతా రెండు టీ20లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ జట్టులోకొచ్చాడు. శుక్రవారం తొలి టీ20లో భారత ఇన్నింగ్స్‌ చివర్లో జడేజా బ్యాటింగ్‌ చేస్తుండగా అతడి తలకు బంతి తాకి కొంచెం ఇబ్బంది పడ్డాడు. అయితే ఫిజియో సాయం కూడా తీసుకోకుండానే అలాగే బ్యాటింగ్‌ కొనసాగించాడు. జడేజా తర్వాత ఫీల్డింగ్‌కు మాత్రం రాలేదు. అతడి స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చిన చాహల్‌ చక్కటి బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం చర్చనీయాంశమైంది. జడేజాను పరీక్షించిన బీసీసీఐ వైద్య బృందం.. అతను కంకషన్‌తో బాధపడుతున్నట్లు ధ్రువీకరించి, శనివారం మరిన్ని పరీక్షలు చేయాలని నిర్ణయించింది.

అలా కలిసొచ్చింది

స్ట్రేలియాతో తొలి టీ20కి భారత తుది జట్టులోకి లెగ్‌స్పిన్నర్‌ చాహల్‌ ఎంపిక కాలేదు. కానీ చివరికి చూస్తే అతనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఇది ‘కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌’ నిబంధన పుణ్యమే. భారత్‌ ఇన్నింగ్స్‌ ఆఖర్లో జడేజా తలకు బంతి తగిలి ఇబ్బంది పడటంతో కెప్టెన్‌ కోహ్లి కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా జడేజా స్థానంలోకి చాహల్‌ను తీసుకున్నాడు. అతను మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రదర్శన చేశాడు. ఫించ్‌, స్మిత్‌ సహా 3 కీలక వికెట్లు ముందు భారత్‌ 161 పరుగులు చేయగలిగిందంటే జడేజానే కారణం. అతడి స్థానంలో వచ్చిన చాహల్‌ కూడా అదరగొట్టాడు. ఇలా కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ నిబంధన భారత్‌కు భలేగా కలిసొచ్చింది.

ఆసీస్‌ అభ్యంతరం

భారత్‌ జడేజా స్థానంలోకి చాహల్‌ను కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవడంపై ఆస్ట్రేలియా అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం కంకషన్‌కు గురైన ఆటగాడి స్థానంలోకి ఆ తరహా ఆటగాడినే తీసుకోవాలన్నది నిబంధన. జడేజా అప్పటికే బ్యాటింగ్‌ పూర్తి చేయగా.. అతను ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసేవాడు కాబట్టి ఆ స్థానంలోకి స్పిన్నర్‌ అయిన చాహల్‌ను ఎంచుకుంది టీమ్‌ఇండియా. అయితే ఆల్‌రౌండర్‌ అయిన జడేజా స్థానంలోకి రెండో ఇన్నింగ్స్‌లో స్పెషలిస్టు స్పిన్నర్‌ను తీసుకుని భారత్‌ ఎక్కువ ప్రయోజనం పొందిందన్నది ఆసీస్‌ అభ్యంతరం. ‘‘చాహల్‌ జడేజాను పోలిన ఆటగాడు ఎలా అవుతాడు’’ అని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ హెన్రిక్స్‌ ప్రశ్నించాడు. భారత్‌ చాహల్‌ను కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఎంచుకుందని తెలిశాక.. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ మొదలవడానికి ముందు కోచ్‌ లాంగర్‌, కెప్టెన్‌ ఫించ్‌ మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌ను కలిశారు. లాంగర్‌ అసహనం వ్యక్తం చేస్తూ బూన్‌తో వాదించడం టీవీ కెమెరాల్లో కనిపించింది. వారి ఆందోళనకు తగ్గట్లే చాహల్‌ ఆసీస్‌ను గట్టి దెబ్బ తీశాడు. భారత్‌ను గెలిపించాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన