లెక్క సరి
close

ప్రధానాంశాలు

Updated : 07/12/2020 08:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లెక్క సరి

రెండో మ్యాచ్‌లో ఆసీస్‌పై విజయం
గెలిపించిన హార్దిక్‌ పాండ్య
మెరిసిన ధావన్‌, నటరాజన్‌, కోహ్లి
టీ20 సిరీస్‌ భారత్‌ వశం
సిడ్నీ

ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా లెక్క సరి చేసింది.
ఆతిథ్య జట్టు చేతిలో వన్డే సిరీస్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
ఏ మైదానంలో అయితే వరుసగా రెండు వన్డేలు ఓడి అప్రతిష్ఠ మూటగట్టుకుందో.. అదే స్టేడియంలో ఆదివారం రెండో టీ20లో కంగారూ జట్టును ఓడించిన భారత్‌.. పొట్టి సిరీస్‌ కైవసం చేసుకుంది. భారీ ఛేదనలో బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. మంచి ఫామ్‌లో ఉన్న హార్దిక్‌ చివర్లో చెలరేగి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

‘‘జట్టుకు అవసరమైన సమయాల్లో మ్యాచ్‌ను ఎలా ముగించాలనే విషయం మీద లాక్‌డౌన్‌లో దృష్టి పెట్టా. నా ఆత్మవిశ్వాసం ఎల్లప్పుడూ నా ఆటపై ఎంతో ప్రభావం చూపుతోంది. అది అతి విశ్వాసంగా మారకుండా ఉండడం నాకు తెలుసు. చివరి ఓవర్లో రెండు భారీ షాట్లు సరిపోతాయని అనుకున్నా. అలాగే జరిగింది. మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన నటరాజన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కాల్సింది. మిగతా బౌలర్లు ఇబ్బందులు పడ్డ పిచ్‌పై అతను గొప్పగా బంతులేశాడు’’

- హార్దిక్‌ పాండ్య

రుసగా రెండు వన్డేల్లో ఓటమితో ఆస్ట్రేలియా పర్యటనను పేలవంగా మొదలెట్టిన టీమ్‌ఇండియా అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. చివరి వన్డేతో పాటు వరుసగా రెండు టీ20లు గెలిచి సత్తాచాటింది. రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తుచేసి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్‌ (58; 32 బంతుల్లో 10×4, 1×6), స్మిత్‌ (46; 38 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. నటరాజన్‌ (2/20) గొప్పగా బౌలింగ్‌ చేశాడు. అనంతరం ఛేదనలో టీమ్‌ఇండియా 4 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. ధావన్‌ (52; 36 బంతుల్లో 4×4, 2×6), కోహ్లి (40; 24 బంతుల్లో 2×2, 2×6) మెరుపులకు తోడు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ (42 నాటౌట్‌; 22 బంతుల్లో 3×4, 2×6) విధ్వంసక ఇన్నింగ్స్‌ జట్టును గెలిపించింది.

మెల్లగా మొదలై.. చివర్లో తుపానై: ఛేదనలో భారత ఇన్నింగ్స్‌ నెమ్మదిగానే మొదలైంది. ప్రత్యర్థి బౌలర్లు ఇబ్బంది పెట్టడంతో రాహుల్‌ (30), ధావన్‌ జాగ్రత్తగా ఆడారు. ఆండ్రూ టై (1/47) వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో ఫ్రీ హిట్‌ను రాహుల్‌ సిక్సర్‌గా మలచడంతో బ్యాటింగ్‌ ఊపందుకుంది. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌ ఓవర్లో ఈ జోడీ చెలరేగడంతో అయిదో ఓవర్లోనే జట్టు స్కోరు 50 దాటింది. కానీ వెంటనే రాహుల్‌ను నకుల్‌ బంతితో టై బోల్తా కొట్టించాడు. ఓ వైపు వీలు చిక్కినపుడల్లా ధావన్‌ బౌండరీలు కొట్టినప్పటికీ.. కోహ్లి మొదట సింగిల్స్‌కే పరిమితమవడంతో స్కోరు వేగం మందగించింది. అర్ధశతకం తర్వాత ధావన్‌ ఔటవగానే.. కోహ్లి దూకుడు పెంచాడు. వచ్చి రాగానే ఫోర్‌, సిక్సర్‌తో జోరు చూపించిన శాంసన్‌ (15) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయినప్పటికీ మరోవైపు కోహ్లి బౌండరీలు బాదడంతో భారత విజయ సమీకరణం అయిదు ఓవర్లలో 54 పరుగులుగా మారింది. కానీ 16వ ఓవర్లో జంపా (1/36) ఎనిమిది పరుగులే ఇవ్వడం.. ఆ వెంటనే కోహ్లి ఔటవడంతో ఉత్కంఠ రేగింది. అంతర్జాతీయ అరంగేట్ర పేసర్‌ సామ్స్‌ (1/41) బౌలింగ్‌లో క్రీజుకు చాలా దూరంగా వెళ్తున్న బంతిని వేటాడి అతను వెనుదిరిగాడు. ఈ దశలో శ్రేయస్‌ (12 నాటౌట్‌)తో కలిసి జట్టును గెలిపించే బాధ్యతను హార్దిక్‌ తీసుకున్నాడు. జంపా బౌలింగ్‌లో శ్రేయస్‌ ఓ సిక్సర్‌, ఫోర్‌ కొట్టడంతో సమీకరణం 12 బంతుల్లో 25గా మారింది. 19వ ఓవర్‌ వేసిన టై.. తొలి మూడు బంతుల్లో రెండు పరుగులే ఇవ్వడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. కానీ వరుసగా రెండు ఫోర్లు బాదిన హార్దిక్‌ ఆశలు నిలిపాడు. చివరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా.. రెండు, నాలుగు బంతులను సిక్సర్లుగా మలచిన పాండ్య విజయాన్ని అందించాడు.
వేడ్‌ ధనాధన్‌..: గాయంతో ఫించ్‌ దూరమవడంతో తొలిసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టి ఓపెనర్‌గా బరిలో దిగిన వేడ్‌ తన ముద్ర బలంగా వేయాలనే పట్టుదలతో ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ప్రధాన పేసర్లు బుమ్రా, షమి లేని బౌలింగ్‌ దళాన్ని ఓ ఆటాడుకున్నాడు. మూడు ఫోర్లతో చాహర్‌కు స్వాగతం పలికిన అతను.. స్పిన్‌, పేస్‌ అనే తేడా లేకుండా బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీంతో నాలుగు ఓవర్లలోనే జట్టు స్కోరు 46కు చేరింది. ఈ ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని విడదీయడానికి నటరాజన్‌కు కోహ్లి బంతినివ్వడం పనిచేసింది. శ్రేయస్‌ పట్టిన చక్కటి క్యాచ్‌కు షార్ట్‌ (9) వెనుదిరిగాడు. వికెట్‌ పడ్డప్పటికీ వేడ్‌ నెమ్మదించలేదు. హార్దిక్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన అతను 25 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. అతని జోరు చూస్తుంటే జట్టు 200కు పైగా పరుగులు చేసేలా కనిపించింది. కానీ అనూహ్యంగా రనౌటై పెవిలియన్‌ చేరాడు. ఈ దశలో ఓ వైపు నటరాజన్‌ కట్టుదిట్టంగా బంతులేసినప్పటికీ మిగతా బౌలర్ల ఓవర్లలో స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ (22) స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా గత మ్యాచ్‌లో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి తమ జట్టును దెబ్బకొట్టిన చాహల్‌ (1/51)ను లక్ష్యంగా చేసుకుని చెలరేగారు. అతని ఒక్కో ఓవర్లో కనీసం ఒక్క సిక్సరైనా బాదారు. మ్యాక్స్‌వెల్‌ ఔటైన తర్వాత మన బౌలర్లు పట్టు బిగించే ప్రయత్నం చేశారు. కానీ హెన్రిక్స్‌ (26) జతగా స్మిత్‌ ఆ అవకాశమే ఇవ్వలేదు. దీంతో ఆ జట్టు 16 ఓవర్లకు 152/3తో నిలిచింది. అయితే స్మిత్‌, హెన్రిక్స్‌ వరుస ఓవర్లలో ఔటైనప్పటికీ చివరి ఓవర్లో స్టాయినిస్‌ (16 నాటౌట్‌) ధాటిగా ఆడి స్కోరును 190 దాటించాడు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వేడ్‌ రనౌట్‌ 58; షార్ట్‌ (సి) శ్రేయస్‌ (బి) నటరాజన్‌ 9; స్మిత్‌ (సి) హార్దిక్‌ (బి) చాహల్‌ 46; మ్యాక్స్‌వెల్‌ (సి) సుందర్‌ (బి) శార్దూల్‌ 22; హెన్రిక్స్‌ (సి) రాహుల్‌ (బి) నటరాజన్‌ 26; స్టాయినిస్‌ నాటౌట్‌ 16; సామ్స్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 9;

మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 194
వికెట్ల పతనం: 1-47, 2-75, 3-120, 4-168, 5-171
బౌలింగ్‌: చాహర్‌ 4-0-48-0; సుందర్‌ 4-0-35-0; శార్దూల్‌ 4-0-39-1; నటరాజన్‌ 4-0-20-2; చాహల్‌ 4-0-51-1
భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) స్వెప్సన్‌ (బి) టై 30; ధావన్‌ (సి) స్వెప్సన్‌ (బి) జంపా 52; కోహ్లి (సి) వేడ్‌ (బి) సామ్స్‌ 40; శాంసన్‌ (సి) స్మిత్‌ (బి) స్వెప్సన్‌ 25; హార్దిక్‌ నాటౌట్‌ 42; శ్రేయస్‌ నాటౌట్‌ 12; ఎక్స్‌ట్రాలు 4;

మొత్తం: (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 195
వికెట్ల పతనం: 1-56, 2-95, 3-120, 4-149
బౌలింగ్‌: సామ్స్‌ 3.4-0-41-1; అబాట్‌ 2-0-17-0; టై 4-0-47-1; మ్యాక్స్‌వెల్‌ 1-0-19-0; స్వెప్సన్‌ 4-0-25-1; హెన్రిక్స్‌ 1-0-9-0; జంపా 4-0-36-1

ఆ షాట్‌.. ఆ రనౌట్‌

భారత ఛేదనలో ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో నాలుగో బంతిని కోహ్లి సిక్సర్‌గా మలిచిన తీరు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. తన ఐపీఎల్‌ జట్టు సహచరుడు డివిలియర్స్‌ లాగా స్కూప్‌ షాట్‌తో అతను సిక్సర్‌ కొట్టడమే అందుకు కారణం. టై వేసిన ఆ బంతిని.. కోహ్లి ఆఫ్‌స్టంప్‌ వైపుగా వెళ్లి కుడి మోకాలిపై కూర్చొని స్కూప్‌ షాట్‌తో ఫైన్‌లెగ్‌ దిశగా స్టాండ్స్‌లోకి పంపించాడు. ఇప్పుడు ఈ షాట్‌కు సంబంధించిన వీడియో అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. ‘‘విరాట్‌ డివిలియర్స్‌’’.. ‘‘కోహ్లి కూడా మిస్టర్‌ 360గా మారాడు’’.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మ్యాచ్‌ తర్వాత ఆ షాట్‌ గురించి కోహ్లి మాట్లాడుతూ.. ‘‘ఈ విషయాన్ని డివిలియర్స్‌కు సందేశం ద్వారా పంపిస్తా. అతను ఈ షాట్‌ గురించి ఏమంటాడో చూడాలి’’ అని చెప్పాడు. డివిలియర్స్‌ దీనిపై స్పందిస్తూ.. ట్విట్టర్‌లో సూపర్‌ అనే అర్థం వచ్చేలా ఎమోజీలు పెట్టాడు. అయితే కోహ్లి ఈ షాట్‌ ఆడడం ఇదే తొలిసారి కాదు. ఐపీఎల్‌లో సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఇలాగే స్కూప్‌ షాట్‌ ఆడి ఫోర్‌ కొట్టాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో కోహ్లి చేసిన రనౌట్‌ కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. అర్ధశతకం చేసి దూకుడు మీదున్న వేడ్‌.. కవర్స్‌ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. ఆ క్యాచ్‌ జారవిడిచిన విరాట్‌.. కోహ్లి వెంటనే బంతిని వికెట్‌ కీపర్‌కు విసిరాడు. ఈ లోపు సింగిల్‌ కోసం ముందుకెళ్లి వెనక్కి మళ్లిన వేడ్‌ను రాహుల్‌ రనౌట్‌ చేశాడు.

‘‘ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయం ఎంతో గొప్పది. టీ20ల్లో జట్టు సమష్టిగా ఆడింది. పరిమిత ఓవర్ల జట్లలో ప్రధానమైన ఆటగాళ్లయిన రోహిత్‌, బుమ్రా లేకపోయినా ఈ సిరీస్‌ గెలవడం చాలా ఆనందంగా ఉంది. జట్టు పట్ల గర్వంగా ఉన్నా. హార్దిక్‌ తన సామర్థ్యాలతో 2016లోనే జట్టులోకి వచ్చాడు. అతనిలో ముడి సరుకు చాలా ఉంది. ఇప్పుడు దాన్ని సరిగ్గా వాడుతున్నాడు. వచ్చే నాలుగైదేళ్లు ఎక్కడ ఆడినా జట్టుకు విజయాలు అందించే సత్తా అతనికుంది. ఫినిషర్‌ పాత్రను పోషించాల్సిన బాధ్యత తనపై ఉందని అర్థం చేసుకున్నాడు. జట్టు కోసం మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఐపీఎల్‌ అనుభవంతో భారత టీ20 జట్టు పటిష్ఠంగా మారింది. గత సీజన్‌లో జట్టులోని ప్రతి ఆటగాడు కనీసం 14 మ్యాచ్‌లాడాడు. నటరాజన్‌ బౌలింగ్‌ అద్భుతం’’

- విరాట్‌ కోహ్లి

1

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికాల్లో టీ20 సిరీస్‌లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌ కోహ్లి.


2

ఈ మ్యాచ్‌లో 195 పరుగుల లక్ష్యాన్ని చేరుకున్న భారత్‌.. ఆస్ట్రేలియాలో టీ20ల్లో అత్యధిక ఛేదనల్లో రెండో స్థానం సాధించింది. తొలి స్థానంలో కూడా టీమ్‌ఇండియానే (2016లో 198) ఉంది.


10

టీ20ల్లో భారత్‌కిది వరుసగా పదో గెలుపు. పొట్టి ఫార్మాట్లో వరుసగా తొమ్మిది విజయాలతో ఉన్న పాకిస్థాన్‌ను అధిగమించి మూడో స్థానానికి చేరింది. తొలి రెండు స్థానాల్లో అఫ్గనిస్థాన్‌ (వరుసగా 12, 2018-19లో.. వరుసగా 11, 2016-17లో) ఉంది.

ఇవీ చదవండి:

రహానె అజేయ శతకం

అందుకే కెప్టెన్సీ వదులుకున్నా: ద్రవిడ్‌ Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన